కర్నూల్, భాగ్యనగర్ పోస్ట్ ప్రతినిధి: శ్రీశైల మహాక్షేత్రంలో గత సం డిసెంబర్ 31 రాత్రి నకిలీ డీఎస్పీ రజాక్ అనుచరులు శ్రీశైలం వచ్చిన భక్తులపై దాడి చేశారు. ఆ దాడిలో భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 323, 324, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే పోలీసుల దుర్బుద్ధి, దురుద్దేశాలు ఇక్కడే బయట పడుతున్నాయంటున్నారు బాధిత భక్తులు. మారణాయుధాలతో దాడులు చేసి, రక్తాలు కారేలా కొట్టి, చంపడానికి యత్నిస్తే.. హత్యా యత్నాన్ని సూచించే 307 పెట్టకపోవడం ఏంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆ రాత్రి శ్రీశైలంలో నకిలీ డీఎస్పీ అనుచరులు నానా బీభత్సమే సృష్టించారు. ఓ సత్రంలోని రెండో అంతస్తు నుంచి ఓ వ్యక్తిని తోసేశారు. బాధితుణ్ని హుటాహుటిన ప్రాజెక్ట్ వైద్యశాలకు తరలించారు. తనను ఎవరు ఏం చేశారు.. ఎలా గాయాలయ్యాయో.. పోలీసుల సమక్షంలో, వైద్యుల ముందే బాధితుడు చెబుతున్నా అతని వాంగ్మూలాన్ని మాత్రం పోలీసులు రికార్డు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో తీయకపోవడం, స్టేట్మెంట్ ఫైల్ చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. తక్షణం జిల్లా యంత్రాంగం ఈ సంఘటనలపై విచారణ చేపట్టాలని బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు ఈనెల 3న రాత్రి నకిలీ డీఎస్పీ రజాక్ అనుచరులు మద్యం సేవించి ముగ్గురు యువకులపై దాడి చేశారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు మాత్రం పెట్టలేదు. నకిలీ డీఎస్పీ రజాక్ ప్రభావానికి లోనైన సీఐ రమణ ఫిర్యాదు చేసినవారినే బెదిరింపులకు గురి చేసి రజాక్ అనుచరులకు, అల్లరిమూకలకు అండగా నిలిచారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాక.. రజాక్ కు బాహాటంగా కొమ్ముకాస్తూ.. ఫిర్యాదు గనక వాపసు తీసుకోకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తానని, రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని తమనే బెదిరించారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంలో టూటౌన్ ఎస్సై నవీన్ బాబు మరుసటి రోజు స్టేషన్కు పిలిపించుకొని ఫిర్యాదుదారులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కేసు పూర్వాపరాల జోలికి వెళ్లకుండా తమ పైనే ఐపిసీ 160 సెక్షన్ బనాయించారని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై కర్నూలు జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన పోలీసులు నకిలీ పోలీసుల పేరుతో ప్రజల్ని పీడించేవారికి కొమ్ముకాయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: