పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో అక్కడి ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని, అందుకనే కేవలం 18 రోజుల్లో 5 కేసులను హైకోర్టు సీబీఐకి అప్పగించిందంటున్నారు నిపుణులు.
ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీ పరిపాలనా శైలి వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ అధ్వానంగా తయారైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 18 రోజుల్లో కోల్ కతా హైకోర్టు 5 కేసులను సీబీఐకి అప్పగిస్తూ విచారణకు ఆదేశించడం అరుదైన విషయమని, ఇలాంటి పరిస్థితి గతంలో ఏ రాష్ట్రంలో కూడా తలెత్తిన దాఖలాల్లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు 5 కేసులను కోల్ కతా హైకోర్టులోని వేర్వేరు డివిజన్ బెంచ్ లు సీబీఐకి అప్పగిస్తూ దర్యాప్తుకు ఆదేశించాయి. ఆ 5 కేసుల్లో కొన్ని గతంలో సింగిల్ జడ్జి విచారించిన కేసులు కూడా ఉండండం గమనార్హం. తాజాగా మంగళవారం నదియా జిల్లాలో ఓ మైనర్ పై జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసును హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించడం మమతకు రాజకీయంగా ఇబ్బందికరంగా పరిణమించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 14 ఏళ్ల బాలికపై రేప్ అండ్ మర్డర్ జరిగిన తరువాత మమత వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి. అది లవ్ అఫెయిర్ అని.. అందులో నేనెందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించిన మమత.. యూపీలో లాగా ఇక్కడ లవ్ జిహాద్ లు జరగవని కామెంట్ చేయడం విమర్శలకు దారితీసింది. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ దీనిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆనాడు నిండు సభలో ద్రౌపదికి ఏం జరిగిందో.. ఇప్పుడూ అదే జరుగుతోందని, అసలు బెంగాల్లో ఏం జరుగుతుందో ప్రజలంతా తెలివిడితో వ్యవహరించాలని కోరారు.
మమత వ్యాఖ్యలతో పోలీస్ విచారణపై అనుమాన మేఘాలు ముసురుకున్నాయి. బాలిక మర్డర్ పై లోతైన విచారణ జరగాలన్న పిటిషన్లతో డివిజన్ బెంచ్ ఏప్రిల్ 12న హైకోర్టు పర్యవేక్షణతో సీబీఐ దర్యాప్తుకు అప్పగించింది. అంతకుముందు బీర్భూమ్ జిల్లా బొగ్తుయి గ్రామంలో జరిగిన 9 మంది సజీవ దహనాల కేసులో మార్చి 25న హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఏప్రిల్ 4న కాంగ్రెస్ నాయకుడు తపన్ కందూ మర్డర్ కేసును కూడా హైకోర్టు సీబీఐ విచారణకు అప్పగించింది. టీఎంసీ ఉపసర్పంచ్ వాదూ షేక్ మర్డర్ కేసు విచారణను కూడా ఏప్రిల్ 8న సీబీఐకి అప్పగించింది. కాంగ్రెస్ నాయకుడు తపన్ కందూ మర్డర్ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన నిరంజన్ వైష్ణవ్ హత్య కేసును సైతం ఏప్రిల్ 12న హైకోర్టు సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించింది. అంటే ఏప్రిల్ 12న ఒక్కరోజే రెండు కేసులను హైకోర్టు సీబీఐకి అప్పగించిందన్నమాట. ఇలా పశ్చిమబెంగాల్ లో వరుస ఘటనలు జరగడం, ప్రభుత్వ విచారణపై అనుమాన మేఘాలు కమ్ముకోవడం, కోర్టు జోక్యం చేసుకొని కేసులను సీబీఐకి అప్పగించడంతో మమత రాజకీయ వ్యవహార శైలి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Post a Comment
Your Comments Please: