ఎన్.ఐ.ఎ... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంతర్గత శాంతిభద్రతల కోసం నిరంతరం పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. తీవ్రవాదులు, ఉగ్రవాదుల కదలికలపై పూర్తి నిఘా పెట్టి వారిని మట్టుపెట్టే పకడ్బందీ సంస్థ. దాని వెబ్ సైట్ లో వివరాలు కూడా ఎప్పటికప్పుడు అప్-డేట్ చేస్తూంటారు. అయితే కొందరు కీలకమైన మావోయిస్టు నేతలు చనిపోయి చాలాకాలం అవుతున్నా.. వారి పేర్లను మాత్రం ఇంకా తొలగించలేదు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్.కె... ఆయన మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడిగా పని చేశారు. ఇక యాపనారాయణ అలియాస్ హరిభూషణ్. ఈయన మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. అయితే గత సంవత్సరమే వారు చనిపోయారు. అయినా ఎన్.ఐ.ఎ మాత్రం వారి పేర్లను ఇంకా మోస్ట్ వాంటెడ్ జాబితాలోనే ఉంచింది.
ఆర్కే, హరిభూషణ్ తో పాటు మరికొందరు తెలుగువారు కూడా ఎన్.ఐ.ఎ. హిట్ లిస్టులో ఉన్నారు. ఈ సంవత్సరం మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నవారిపై రివార్డులు పెరుగుతాయని పోలీసు శాఖ చెబుతోంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లవారీగా తాజా లిస్టును ఎన్.ఐ.ఎ. సేకరిస్తోంది. తాజా లిస్టులో ఇంకా ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన కోయతెగకు చెందిన మావోయిస్టు నేత. రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన గతేడాది జూన్ 21న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో కోవిడ్‌తో మరణించారు. ఇక అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ.. అలియాస్ ఆర్కే.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమకోటకు చెందిన ఆయన.. అనారోగ్యంతో గతేడాది అక్టోబర్ 14న బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు.
Also Read: కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?
ఈ ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు చనిపోయి నెలలు గడుస్తున్నా.. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ వారి పేర్లను ఇంకా మోస్ట్ వాంటెడ్ జాబితాలోనే ఉంచింది. ఎన్‌ఐఏ వెబ్‌సైట్‌లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద, తీవ్ర ఆర్థిక నేరాలతో సంబంధమున్న 328 మంది పేర్లతో మోస్ట్ వాంటెడ్ జాబితాను రూపొందించింది. అందులో ఇప్పటికే చనిపోయిన మావోయిస్టు నేతల పేర్లు ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ పెరిగిందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేతల వివరాలను జిల్లాలు, పోలీస్‌స్టేషన్ల వారీగా సేకరిస్తున్నారు. హనుమకొండ, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల నుంచి ఇలాంటి డేటా తీసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ సహా 11 రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతల వివరాలు, వారిపై ఉన్న రివార్డులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ రివార్డులు పెంచనున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన 54 మంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్టు తేలిందని సమాచారం. ఎన్‌ఐఏ జాబితాలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్.. గంగన్న, ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి పేర్లను టాప్ వాంటెడ్ లిస్టులో చేర్చగా.. ఆ తర్వాత మడావి హిడ్మా, మరికొందరి పేర్లున్నట్టు తెలిసింది. గణపతిపై ఇప్పటికే రూ. 2.52 కోట్ల రివార్డు, బస్వరాజ్‌పై రూ.1.25 కోట్లు, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న నేతలపై కోటి రూపాయల చొప్పున రివార్డులున్నాయి. తెలంగాణ నుంచి 9 మంది మావోయిస్టులు కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇందులో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ సాధు, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లా రాజిరెడ్డి, గంకిడి సత్యనారాయణరెడ్డి, మోడం బాలకృష్ణ, పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, గాజర్ల రవి అలియాస్ గణేశ్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, తిప్పిరి తిరుపతి తదితర అగ్రనేతల పేర్లు ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఇక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 40 మందిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది.
Comments
Post a Comment
Your Comments Please: