మహా రాజకీయం మహా సంక్షోభాన్ని తలపిస్తోంది. ఏక్నాథ్ షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండగా.. ఉద్ధవ్ శిబిరం వెలవెలపోతోంది. ఉద్ధవ్ థాక్రే నిన్ననే అధికార నివాసాన్ని ఖాళీ చేయడంతో ఆయన రాజీనామా చేయడం ఇక లాంఛనమే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారానికి మేజిక్ ఫిగర్ 144 సంఖ్య సరిపోతుండగా.. ఇండిపెండెంట్లు, స్థానిక పార్టీలు కలుపుకొని.. 169 సంఖ్యతో మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమి సభ్యులు అధికారాన్ని ఎంజాయ్ చేశారు. అయితే అసంతృప్త నేత ఏక్నాథ్ షిండే తిరుగుబావుటా ఎగరేయడంతో.. సంక్షోభానికి తెర లేచింది. 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత అసోంలోని గౌహతిలో ఆతిథ్యం పొందుతూ.. క్షణక్షణం అధికార శివసేనలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యే షిండే చాలా కీలకంగా మారిపోయారు. తన దగ్గరున్న సంఖ్యతో బీజేపీతో పాటు శివసేన రెబల్ అభ్యర్థులతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమైపోయింది. ఈ సంక్షోభాన్ని ఆలస్యంగా గుర్తించిన శివసేన, ఎన్సీపీ నేతలు.. నష్టనివారణ చర్యలకు పూనుకున్నా ఆ ప్రక్రియలేవీ సుసాధ్యంగా కనిపించడం లేదు. గౌహతిలోని రాడిసన్ హోటల్లో ఉత్తేజంతో నినాదాలిస్తున్న రెబల్ ఎమ్మెల్యేల నినాదాలే అందుకు రుజువుగా చెబుతున్నారు.
ఈ ఎపిసోడ్ నుంచి శివసేన పూర్తిగా చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. ఇంతకన్నా ఏం జరుగుతుంది.. అధికారం పోతుంది.. అంతేకదా.. పోయిన అధికారం మళ్లీ వస్తుంది అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అసహనంగా వ్యాఖ్యానించారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు చేసింది చాలా తప్పిదమని, మహా వికాస్ అఘాడీలో ఉండడం ఇష్టం లేకపోతే.. అదే విషయాన్ని తమ ముందుకు వచ్చి చెప్పవచ్చన్నారు. ఇప్పటికీ వారు వెనక్కి రావాలని కోరుతున్నట్టు చెప్పారు. ఈ ఆటలో అసలు ఎవరూ పట్టించుకోని క్యారెక్టర్ ఎవరూ అంటే... అది కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటేల్ తూతూ మంత్రంగా మీటింగ్ పెట్టి ఎన్సీపీని, శివసేనను తిట్టిపోశారు. అక్కసు వెళ్లగక్కారు.
ఇటు శివసేన అధికారిక నేతగా ఉద్ధవ్ థాక్రే పెట్టిన సమావేశానికి కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో శివసేన చేతులెత్తేసినట్లే అయిపోయింది. మరోవైపు ఈ అలయెన్సుకు రూపకల్పన చేసిన శరద్ పవార్.. ముఖ్యమంత్రిగా షిండేకే పగ్గాలు అప్పజెబుతామని బేరసారాలు చేసినా.. ఇక్కడిదాకా వచ్చాక ఇప్పుడెలా వెనక్కి వస్తామంటూ బెట్టు చేస్తున్నారు. వెనక్కి రాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ సంజయ్ రౌత్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. రౌత్ విజ్ఞప్తులను గానీ, ఆయన హెచ్చరికలను గానీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా హాస్యాస్పదంగా కొట్టిపారేస్తున్నారు. ఇదే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ భారీ కటౌట్ ను ఆయన ఇంటిముందు పెట్టి ముఖ్యమంత్రిగా పేర్కొంటూ బీజేపీ కార్యకర్తలు ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు ఏకమొత్తంలో పార్టీ మారినా యాంటీ డిఫెక్షన్ లా వర్తించదని న్యాయ నిపుణులు అంటున్నారు. దీంతో శివసేన చాప్టర్ కూడా క్లోజ్ అయ్యిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కూటమికి రూపకర్త అయిన శరద్ పవార్ ను మించిన చాణక్యుడిగా ఇప్పుడు మహా రాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ కనిపిస్తున్నాడంటున్నారు రాజకీయ నిపుణులు.
సంక్షోభం పతాకస్థాయికి చేరింది. అయితే ఫిరాయింపుదార్ల చర్యలతో మహా రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ఉద్ధవ్ శిబిరం నుంచి మరో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు.. ఏక్నాథ్ షిండేతో చేతులు కలిపారు. వారు గౌహతి బాట పట్టారు. మరోవైపు షిండే క్యాంపు నుంచి ఓ ఎమ్మెల్యే మహారాష్ట్ర పయనమైనట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఎన్సీపీలో ఉత్సాహం కనిపించింది. ఎన్సీపీ ఎమ్మెల్యేల మీటింగ్ తరువాత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడారు. శివసేనకు తమ మద్దతు కొనసాగుతుందని, ఈ సంక్షోభానికి త్వరలోనే తెర పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలు రెబల్స్ ను రెచ్చగొట్టగా.. అజిత్ పవార్ వ్యాఖ్యలు.. తప్పు దిద్దుకునేలాగా కనిపిస్తున్నాయంటున్నారు. ఇక ఆఖరు దశలో శరద్ పవార్ ఎంటరయ్యారు. దీనికంతటికీ కారణం బీజేపీయేనని... శివసేన వెంట తాము కొనసాగుతామన్నారు. రాజీనామాకు సిద్ధపడ్డ ఉద్ధవ్ ను పవార్ వారించినట్లుగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Comments
Post a Comment
Your Comments Please: