దాదాపు వారం రోజులుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మహా రాజకీయంలో ఇవాళ చాలా కీలకమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. గౌహతిలో క్యాంపు నిర్వహిస్తున్న రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనుకున్న శివసేనకు సుప్రీంకోర్టు నుంచి భంగపాటు ఎదురైంది. రెబల్ ఎమ్మెల్యేలంతా ఇవాళ సాయంత్రం ముంబైకి రావాలని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటూ.. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ నోటీసులు పంపారు. మరోవైపు శాసనసభా పక్ష నేతగా ఉన్న రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే స్థానంలో అజయ్ చౌదరిని నియమిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ షిండే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కోర్టులో పిటిషన్ ఎదుర్కొంటున్న డిప్యూటీ స్పీకర్‌కు అనర్హత వేటు వేసే అధికారం లేదంటూ.. దానిపై వివరణ ఇవ్వడానికి జులై 11 వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. దీంతో రెబల్ ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు పడకుండా ఊరట లభించినట్లయింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వానికి, శివసేన శాసనసభాపక్ష నేతకు, చీఫ్ విప్‌కు, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారందరూ తన నోటీసులకు 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు అందరికీ, వారి ఆస్తులకు కూడా భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఏకకాలంలో రెండు పిటిషన్లపై విచారణ మొదలుపెట్టింది. పార్టీ నిర్ణయం మేరకు 16 మంది రెబల్స్ పై అనర్హత వేటు వేసేలా డిప్యూటీ స్పీకర్ నోటీసులపై దాఖలైన పిటిషన్ ఒకటైతే.. శాసనసభా పక్ష నేతగా తన స్థానంలో అజయ్ చౌదరిని నియమించడాన్ని షిండే చాలెంజ్ చేసిన పిటిషన్ మరోటి. విచారణ మొదలు పెట్టిన సుప్రీంకోర్టు.. డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన నోటీసులపై తదుపరి విచారణ జరిగేవరకు స్టే విధించింది. దీంతో రెబల్ ఎమ్మెల్యేలకు అత్యంత కీలకమైన సమయం చిక్కినట్లయింది. దీంతో రెబల్ ఎమ్మెల్యేలు క్రాకర్స్ కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఫలితంగా మహా అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని షిండే టీమ్ కోరే అవకాశం ఏర్పడింది. ఇది బాలాసాహెబ్ కోరుకున్న హిందుత్వ విజయంగా షిండే ట్వీట్ చేశారు. శివసైనికులందరూ దీన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటు దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో బీజేపీ కీలక నేతలు, పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తదుపరి కదలికపై మంతనాలు జరిపారు. ఉద్ధవ్ తో దోస్తీని పునరుద్ధరించుకునే ప్రసక్తే లేదని బీజేపీ వర్గాలు క్లారిటీ ఇస్తుండడంతో... ఇక బలపరీక్షే తరువాయి అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. రెబల్ గ్రూపులో ఉన్న మంత్రులందరి పోర్ట్‌ఫోలియోలను లాగేసుకున్నారు. పరిపాలన కుంటుపడకుండా ఉండేందుకు.. ఐదుగురు మంత్రులు, మరో నలుగురు సహాయ మంత్రుల శాఖలను తన కుమారుడైన ఆదిత్య థాకరేకు కొన్నింటిని కట్టబెట్టి.. మిగతావాటిని కూడా అడ్జస్ట్ చేశారు.
ఇక ఉద్ధవ్ శిబిరంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఒక వెయ్యి 34 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో జవాబు చెప్పాలని, రేపు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే తాను ఈడీ నోటీసులకు రెస్పాండ్ కానని, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం అలీబాగ్‌లో జరిగే ర్యాలీలో పాల్గొనాల్సి ఉందని సంజయ్ రౌత్ చెప్పారు. ఈడీ నోటీసుల్లో కుట్ర దాగి ఉందన్నారు. ఈ ధర్మ పోరాటంలో బీజేపీ మీద పోరాడతానని, అరెస్టు చేస్తారా.. చూస్తానని సవాల్ విసిరారు.
Comments
Post a Comment
Your Comments Please: