బీజేపీ నేతలు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఇంట్రస్టింగ్ అంశంగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచే హైదరాబాద్ ఓటర్లకు, బీజేపీ మద్దతుదార్లకు, హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా యోగి అమ్మవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈసారి ప్రధాని మోడీ కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శించుకుంటారని భావించినా.. సమయాభావం వల్ల అది కుదరలేదని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అంతకుముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా వినాయక నవరాత్రుల సమయంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. భాగ్యలక్ష్మి అమ్మవారినే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
బీజేపీ నేతల హిడెన్ ఎజెండాలో హైదరాబాద్ పేరు మార్చే ప్రక్రియ ఉందన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నేతల సందర్శన కూడా అదే విషయాన్ని రుజువు చేస్తోంది. హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చే అంశాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినా.. బీజేపీ నేతల వ్యవహార శైలి మాత్రం అలాగే ఉందని నిపుణులు అంటున్నారు. చార్మినార్ వద్దనే గల భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రముఖ నేతలంతా దర్శించుకోవడం వల్ల భాగ్యలక్ష్మికి పాపులారిటీ వస్తుంది. జాతీయ మీడియా కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ పై ఫోకస్ చేస్తుంది. దీంతో చార్మినార్, హైదరాబాద్ వంటి అంశాలకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యమైన సీట్లు గెల్చుకున్న బీజేపీ... జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో కొంతవరకు ఇప్పటికే సఫలీకృతమైంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పరంగానూ ఎమ్మెల్యేల సంఖ్యా బలం పెంచుకునేందుకు కృషి చేస్తోంది. ఫలితంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిటీ మొత్తంగా వ్యాపించే పథకంతో ముందుకెళ్తోంది. ఈ అన్ని ఎన్నికల ఫలితాల ఆలంబనతో భాగ్యనగర్ మీద ఓ నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవడానికి వీలుగా వ్యూహం రచిస్తోంది. మహారాష్ట్రలో శివసేన సంఖ్యాబలాన్ని తగ్గించి.. ఉద్ధవ్ చేతనే ఔరంగాబాద్ పేరు మార్చిన వైనాన్ని ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు.
Comments
Post a Comment
Your Comments Please: