కాంగ్రెస్, బీజేపీలకు విజ్ఞాపనపత్రాలు ఇస్తాం: ఎర్రోజు భిక్షపతి
తెలంగాణ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను దారుణంగా అవమానపరుస్తుందని, ఇకనైనా ప్రభుత్వం మోసపుచ్చే ధోరణి విడనాడకపోతే ఆత్మగౌరవ పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుందని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యారని, వారిలో విశ్వబ్రాహ్మణులే ముందువరుసలో ఉంటారన్నారు. అయినా కడు పేదరికంలో మగ్గుతున్న విశ్వబ్రాహ్మణుల పట్ల కనీసం ఇతర బీసీ కులాలకు ఇచ్చిన గౌరవం, ఆదరణ కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండలు అందించిన విశ్వబ్రాహ్మణుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తమ సంఘంలోనే తమకు గొడవలు పెట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నికైన తమ ప్యానెల్ కు బదులు... అప్రజాస్వామికంగా దొంగదారిలో ఎంపికైన సంఘాన్ని గుర్తించి అలా ఎంపికైన సంఘానికే ఉప్పల్ భగాయత్ లో ఐదెకరాల స్థలాన్ని, రూ. 5 కోట్లను కేటాయించడం పూర్తి అన్యాయమన్నారు. అప్రజాస్వామిక సంఘాన్ని కొందరు టీఆర్ఎస్ నాయకులే ప్రోత్సహిస్తున్నారని, అది ఎవరనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించాలన్నారు. దీనిపై ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రులకు ఎన్నిసార్లు వ్యక్తిగతంగా కలిసి విన్నవించినా.. ఫలితం లేకుండా పోయిందని, ఫలితంగా ఈ ప్రభుత్వంపై విశ్వబ్రాహ్మణ జాతి నమ్మకం కోల్పోయే పరిస్థితి దాపురించిందన్నారు.
గత సెప్టెంబర్లో అబ్దుల్లాపూర్మెట్ లో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్.. భూ కేటాయింపులు, నిధుల కేటాయింపుల కాగితాలు తమ సంఘానికి అప్పగించారని, వారు ప్రజల చేత ఎన్నికైనట్టుగానే తెలంగాణ విశ్వబ్రాహ్మణ సమాజం ఓట్ల ద్వారా ఎన్నికైన వీవీఐఎస్ ను కూడా ప్రభుత్వం గుర్తించిందని, అందుకే తనను ఆ సభకు పంపి కాగితాలు అప్పగించాలని ఆదేశించినట్లు చెప్పిందని గంగుల అన్నారని గుర్తు చేశారు. అలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు విస్మరించారో అర్థం కావడం లేదన్నారు. ఏ ఒక్క నాయకుడి కోసమో యావత్ విశ్వబ్రాహ్మణ జాతి ఓర్పును పరీక్షించాలనుకోవడం మంచిది కాదని కేసీఆర్ కు హితవు పలికారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, లేకపోతే పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుందన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే గ్రామగ్రామం నుంచి విశ్వబ్రాహ్మణ యూత్ ఐక్యంగా కదిలి ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు. తమకు ప్రభుత్వపరంగా జరుగుతున్న అన్యాయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కు 2 వేల కోట్లు కేటాయించాలని, వడ్రంగులపై అటవీ అధికారులు దాడులు ఆపాలని, స్వర్ణకారులపై పోలీసు వేధింపులు నిలిపివేయాలని, శిల్పకారులకు క్వారీలు కేటాయించాలని, విశ్వబ్రాహ్మణ పురోహితుల్ని దేవాలయాల్లో అర్చకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో విశ్వబ్రాహ్మణుల పారిశ్రామికవాడకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని, 50 ఏళ్లు పైబడినవారికి పెన్షన్లు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లోని తార్నాకలో ప్రధాన కార్యదర్శి నందిపేట రవీంద్రాచారి, ఇతర నాయకులతో కలిసి భిక్షపతి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి, ఎర్రోజు రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: