ఒకసారి పాపులారిటీ వస్తే.. దానికి బోనస్ గా నిర్లక్ష్యం కూడా వస్తుందా? అయితే ప్రజల నుంచి నిరసన ఎదురైతే.. ఎంతో కష్టపడి సంపాదించుకున్న పాపులారిటీ కూడా పేకమేడల్లా కూలిపోక తప్పదు. గాయని శ్రావణభార్గవి విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు.. శ్రీవారి భక్తులు. ఇటీవల ఆమె పాడి నటించిన అన్నమయ్య కీర్తన వివాదానికి కేంద్ర బిందువైంది. ఆమె పాటపై అన్నమయ్య వంశీకులు తీవ్ర్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీడియోను డిలీట్ చేయాలని కోరారు. అయినా ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. తన పాటలో అసభ్యత ఏముందని ఎదురు ప్రశ్నించింది కూడా. ఆ వివాదం చినికిచినికి గాలివానగా మారి... అన్నమయ్య కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికీ సిద్ధమయ్యారు. అటు వెంకన్న భక్తులు కూడా శ్రావణభార్గవికి వార్నింగ్ ఇచ్చారు. ఆమెను తిరుమలలో అడుగుపెట్టనీయం అంటూ హెచ్చరించారు. ఇలా అన్ని వైపుల నుంచీ విమర్శలు రావడంతో శ్రావణ భార్గవి ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. ఆలస్యంగానైనా తన యూట్యూబ్ చానల్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆమె మంచి గాయని కావడంతో వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అది కాస్తా వివాదాస్పదం అయ్యాక మరింత వ్యూస్ వచ్చే అవకాశం పెరిగింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వీడియోను డిలీట్ చేయక తప్పలేదు.
అన్నమయ్య గురించి తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. శ్రీనివాసుడి మహిమల గురించి తెలియాలంటే అన్నమయ్య పాటలు వింటే సరిపోతుందని చెబుతారు. అంతటి ఆధ్యాత్మిక తత్వాన్ని, భక్తి భావాన్ని తన సాహిత్యం ద్వారా అందించిన అన్నమయ్యను భగవంతుడితో సమానంగా భావిస్తారు. అలాంటి అన్నమయ్య భగవంతుడి రూపురేఖలకు మోహితుడై రాసిన ఓ కీర్తనను.. శ్రావణభార్గవి తన అందాలను వర్ణించుకుంటున్నట్టుగా అభినయిస్తూ పాడింది. 'ఒకపరి ఒకపరి వయ్యారమే' అంటూ సాగే కీర్తనను శ్రావణభార్గవి.. ఇలా వక్రీకరించిందని అన్నమయ్య కుటుంబ సభ్యులు, శ్రీవారి భక్తులు విమర్శనాస్త్రాలు సంధించారు. అన్నమయ్య కుటుంబ సభ్యులను శ్రావణభార్గవి లైట్ తీసుకున్నా.. భక్తుల ఒత్తిడికి మాత్రం తలొగ్గక తప్పలేదు.
Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి
శ్రావణభార్గవి హావభావాలు, అభినయం.. అన్నమయ్య ఆధ్యాత్మికతలోని ఔన్నత్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు ఆరోపించారు. భక్తితో కూడుకున్న పాటను ఇలా అసభ్యకరంగా రూపొందించడం ఏంటని.. వెంటనే వీడియో డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ట్రస్ట్ సభ్యునికి, శ్రావణ భార్గవికి మధ్య జరిగినట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలువురు శ్రావణ భార్గవి వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొంతమంది శ్రావణ భార్గవిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. కొందరు తిరుపతి వాసులైతే.. ఆమె వీడియో డిలీట్ చేసి క్షమాపణ చెప్పకపోతే.. తిరుపతిలో అడుగుపెట్టనీయమని హెచ్చరించారు. దీంతో మొత్తానికి శ్రావణభార్గవి భక్తుల ఆగ్రహానికి తలవంచక తప్పలేదు. ఆమె వీడియోను డిలీట్ చేయడంతో వివాదం సద్దుమణిగినట్టేనని భావిస్తున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: