Skip to main content

రాష్ట్రపతి విలాసాలు.. రాష్ట్రపతి భవన్ విశేషాలు

ఒక్క భారతదేశంలోనే కాదు.. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అత్యంత దిగువ స్థాయి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తొలి గిరిజన మహిళగా.. ఆమె దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహిస్తున్నారు. అంతేనా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రథమ పౌరురాలిగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ముకు లభించబోయే అధికారాలేంటి? ప్రభుత్వం నుంచి అందుకునే జీతభత్యాల వివరాలేంటి? ఇతర ప్రత్యేకమైన సదుపాయాలేంటో ఓసారి చూద్దాం.

దేశంలో అత్యంత వెనుకబడ్డ గిరిజన తెగ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురించే ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దేశం అనుసరిస్తున్న అత్యున్నతమైన ప్రజాస్వామ్య విధానానికి ఆమె ఎన్నికే ఓ గీటురాయిగా నిలుస్తోందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్నో అవరోధాలు అధిగమించి ఈ స్థాయికి ఎన్నికవడంతో యావత్ గిరిజన జాతి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆమె రాష్ట్రపతిగా వేతనం ఎంత అందుకుంటారనేది ఓ ఆసక్తికరమైన అంశంగా మారింది.

భారత రాష్ట్రపతి నెలకు 5 లక్షల వేతనం అందుకుంటారు. నెల వేతనమే కాకుండా అదనంగా అనేక సదుపాయాలు భారత ప్రభుత్వం కల్పిస్తోంది. ఉచిత నివాసం, ఉచిత వైద్యం, ఏటా ఆఫీసు ఖర్చుల కోసం లక్ష రూపాయలు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రపతి హోదాలో ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అత్యంత విలాసవంతమైన మెర్సిడెజ్ బెంజ్ కారు, పటిష్టమైన భద్రత ఎల్లప్పుడూ కొనసాగుతుంది. కారుకు నెంబర్ ప్లేట్ ఉండదు. దానికి బదులుగా జాతీయ చిహ్నం మాత్రమే ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా కారుకు సంబంధించిన ఇతర వివరాలేవీ వెల్లడించరు. ఇక రాష్ట్రపతి జీవితభాగస్వాములకూ అదే తరహా గౌరవాన్ని రాజ్యాంగం కల్పిస్తోంది. రిటైర్మెంట్ తరువాత కూడా రాష్ట్రపతి హోదాకు తగ్గనిరీతిలో వారి అలవెన్సులను భారత ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రపతి రిటైర్మెంట్ తరువాత నెలకు లక్షన్నర పెన్షన్ వస్తుంది. జీవితభాగస్వామికి సైతం సెక్రటేరియల్ అసిస్టెన్స్ కింద నెలకు రూ. 30 వేలు వెళ్తాయి. అద్దె లేని అత్యంత విలాసవంతమైన బంగళాను కేటాయిస్తారు. రెండు ల్యాండ్ లైన్ ఫోన్లు, ఒక మొబైల్ కూడా ప్రభుత్వం వైపు నుంచి అందజేస్తారు. రిటైర్మెంట్ తరువాత కూడా పర్సనల్ స్టాఫ్ గా ఐదుగురిని నియమించుకునే వెసులుబాటు ఉంది. ప్రపంచంలో ఎక్కడికి పర్యటించినా తనతో పాటు మరొకరికి హైక్లాస్ ట్రెయిన్ లో గానీ, ఎయిర్ బస్ లో గానీ ప్రయాణించే వీలుంది.

ఇక రాష్ట్రపతి భవన్.. దేశంలోని అన్ని అధికార భవనాల కన్నా అత్యంత ఖరీదైంది మాత్రమే కాదు.. అత్యంత విలాసవంతమైంది కూడా. 330 ఎకరాల ఎస్టేట్లో రాష్ట్రపతి భవన్ ఐదు ఎకరాల్లో సర్వాంగ సుందరంగా కొలువుదీరింది. ఇందులోని 4 అంతస్తుల్లో 340 విలాసవంతమైన గదులున్నాయి. రెండున్నర కిలోమీటర్ల కారిడార్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 190 ఎకరాల్లో ఎటుచూసినా పచ్చనైన గార్డెన్స్ పరవశింపజేస్తాయి. ఈ అందమైన భవనాన్ని 1929లో నిర్మించారు. వేలాది మంది శ్రామికులు, కళాకారులు, వాస్తునిపుణులు ఇందులో పాలు పంచుకున్నారు. అప్పట్లో భారత వైస్రాయి కోసం నిర్మించిన ఈ భవనమే.. తరువాతి కాలంలో రాష్ట్రపతిభవన్ గా మారింది. ఇక రాష్ట్రపతికి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ మాత్రమే గాక.. దేశంలోని మరో రెండు ప్రదేశాల్లో విడిది చేయడానికి రెండు అధికారిక భవనాలున్నాయి. ఏటా రెండుసార్లు దాదాపు రెండు వారాలపాటు ఆయా విడుదుల్లో సేద దీరుతారు. షిమ్లాలో ఒక విడిది భవనం, హైదరాబాద్ లో మరో విడిది భవనం ఉన్నాయి. వేసవిలో షిమ్లాలో బస చేస్తే.. చలికాలంలో హైదరాబాద్ లో విడిది చేయడం ఆనవాయితీ.


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...