భారత స్వాతంత్ర్య పోరాట తొలి గర్జన ఆయనది. సీమ పౌరుషానికి ప్రతీక ఆయన. ఆయన పేరు చెబితే ఇంకా మీసం మొలవని కిశోరాలు కూడా మూతి మీద చెయ్యేసుకుని పొంగిపోతారంటే అతిశయోక్తి కాదు. ఆయనే.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు కోటలకు బీటలు పెట్టిన సీమ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అద్భుతమైన ఆయన పోరాటానికి చరిత్రలో ప్రముఖ స్థానం దక్కకపోవచ్చు గానీ.. రాయలసీమ గ్రామాల్లో ఆయన కీర్తి అజరామరం. ఆజాదీ అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆ వీరుడి వీరగాథ ప్రస్తుత కాలానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం.
Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి
Also Read: భారతీయుడి శౌర్య ప్రతాపం మహారాణా
ఉయ్యాలవాడ పేరు చెబితేనే నరనరానా ఉద్యమ స్ఫూర్తి రగులుతుందంటారు రాయలసీమ ప్రజలు. ఆయన పోరాట పటిమ, పౌరుష పరాక్రమాల గురించి స్థానిక భాషలో పాటలు కట్టి పాడుకుంటారు. ఇప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనంపై పాటలు వినిపిస్తుంటాయి. భరతమాత దాస్యశృంఖల విముక్తి కోసం తెల్ల దొరలపై తెగబడిన ఖడ్గం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది. తెల్లటి గుర్రం.. చేతిలో నాట్యమాడే కత్తి.. పౌరుషానికి ప్రతీకగా మెలితిరిగిన మీసం.. సీమలో పౌరుషాగ్ని నేటికీ రగిలిస్తూ ఉంది. చరిత్రకు ఎక్కినా.. ఎక్కకపోయినా... దేశం ఆయన్ని గుర్తించినా... గుర్తించకపోయినా.. బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి తొలి పునాది వేసింది మాత్రం నరసింహారెడ్డే.
ఆ మహనీయుడి గొప్పతనం ఇప్పటికీ సీమ పల్లెల జనపదాల్లో కథలుగా కనిపిస్తుంది. నేటితరం ఆయన గురించి చెప్పుకొని ఉప్పొంగిపోతుందంటే.. ఆయన కీర్తి ఈ భూమండలం ఉన్నంతవరకూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉయ్యాలవాడలో మాత్రమే కాదు.. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఆంధ్రాల్లో ఆయన పేరే ఓ చైతన్య కెరటం. ఆయన గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువే. కానీ.. ఆ నాలుగైదు విషయాలే ప్రజలకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఇక నరసింహారెడ్డి వంశీకులు ప్రస్తుతం ఐదో తరానికి చెందినవారు అదే ఇంట్లో ఉంటున్నారు. ఆనాటి వైభవం ఇవాళ కనిపించకపోవచ్చు. కానీ.. ఉయ్యాలవాడ పౌరుష-పరాక్రమాలను పట్టిచూపే ఆనవాళ్లు.. ఆయన తిరుగాడిన స్థలంలో ఇప్పటికీ కనిపిస్తాయి. ఆయన గురించి నేటి తరం గొప్పగా చెప్పుకుంటుంటే.. తమ పూర్వీకుడి ఘనకీర్తి ఏపాటిదో విని ఉయ్యాలవాడ వంశీకులు ఉప్పొంగిపోతుంటారు.
వ్యాపారం కోసం వచ్చి.. వందల ఏళ్లు భారతావనిని కబళించిన తెల్లదొరలకు 18వ శతాబ్దంలో చుక్కలు చూపించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1857 సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే... ఈ సీమసింహం జూలు విదిల్చింది. బ్రిటిష్ సైనికుల తలలు తెగనరికింది. తన పరగణాలో ఉన్న వందలాది మందిలో స్వాతంత్ర్య స్ఫూర్తి నింపింది. భారతదేశంలో ఒక్కో ప్రాంతాన్ని కబళిస్తూ... దక్షిణాదిలో అడుగుపెట్టిన బ్రిటిష్‌వారు... విజయనగర సామ్రాజ్యంలోని పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేయించారు. థామస్ మన్రో కడప కలెక్టర్‌గా వచ్చాక ఈ నిర్ణయం తీసుకున్నాడు. సామంతులను జనం నుంచి కప్పం వసూలు చేసే వారధులుగా మలిచారు. పైగా వారి సొమ్మునే వారికి భరణంగా విదిలించేవారు. ఈ వ్యవస్థ 1840వ దశకంలో సీమలోనూ వేళ్లూనుకుంది. నిజాం సీమ ప్రాంతాన్ని బ్రిటిష్‌కి అమ్మేయగా... వారు పరగణాల కింద విభజించి పాలించడం మొదలుపెట్టారు. బ్రిటిష్ అక్రమణకు గురైన పరగణాల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తండ్రి పెద్దమల్లారెడ్డి, తాత నొస్సం జయరామ్‌రెడ్డి పరగణాలు ఉన్నాయి. తండ్రి పాలెగాడు కాగా తాత నొస్సమ్ జమిందార్.. తాతకు మగసంతానం లేకపోవడంతో కూతురు బిడ్డ అయిన నరసింహారెడ్డినే దత్తత తీసుకున్నాడు. ఈ ఇద్దరి భరణం నరసింహారెడ్డి పొందేవాడు.
భరణం పొందే విషయంలో స్థానిక తహశీల్దార్.. నరసింహారెడ్డిని అవహేళనగా మాట్లాడాడు. భరణం కోసం వెళ్లిన జీతగాణ్ణి దారుణంగా అవమానించి పంపాడు. నరసింహారెడ్డి వస్తేనే భరణం ఇస్తానంటూ మాట తూలాడు. దీంతో నరసింహారెడ్డి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. మన సొమ్ము మనకి భిక్షం వేస్తారా.. అంటూ తిరుగుబాటుకు శంఖం పూరించాడు. సవాలు చేసి మరీ.. తహసీల్దార్ తలనరికి కోటగుమ్మానికి వేళ్లాడదీశాడు. అంతటితో ఆగక, కోవెలకుంట్ల ట్రెజరీని కొల్లగొట్టి 805 రూపాయిలు దోచుకున్నాడు. ఆ వెంటనే దువ్వూరు ఖజానాపై పడ్డాడు. అడ్డొచ్చిన బ్రిటిష్ సైన్యాన్ని అడ్డంగా నరుకుతూ తిరుగుబావుటా ఎగురవేశాడు. ఈ నరసింహం దెబ్బకి బ్రిటిష్‌వారి వెన్నులో వణుకు మొదలైంది. ఇలాంటి తిరుగుబాటు దేశానికి పాకకముందే.. ఆ స్ఫూర్తి ప్రతి భారతీయుడికి చేరకముందే... నరసింహారెడ్డిని మట్టుబెట్టాలని పథకం వేశారు.
అటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పల్లెల్ని చైతన్యపరుస్తూ సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. మగవారు కత్తులు, బాణాలతో శత్రువులపై విరుచుకుపడితే., ఆడవారు రోకళ్లు, కారం పొడితో కట్టడి చేసేవారు. ముందు నరసింహారెడ్డి ఉంటే ఏ ఒక్కరూ వెనక్కి తగ్గేవారు కాదు. ఉయ్యాలవాడ సైన్యంలో చెంచు సైన్యం, బోయ సైన్యం కీలకపాత్ర పోషించేవి. వీరి సాయంతోనే ఏడాది పాటు బ్రిటవష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాడు నరసింహారెడ్డి. కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారిల్లో ఆయన పేరు మారుమోగింది. నరసింహారెడ్డి తలపై ఆ రోజుల్లో వెయ్యి రూపాయిల రివార్డు కూడా తెల్లదొరలు ప్రకటించారంటే... ఆ భయం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
భారతావనికి కుట్రలు, కుతంత్రాలు నేర్పిన బ్రిటిష్ వారు.. అదే కుట్రతో ఎదురుగా పోటీ పడలేని పరిస్థితుల్లో అయినవారిని కొనేసి, నరసింహారెడ్డి ఆచూకీ తెలుసుకున్నారు. 1847 అక్టోబర్‌లో నల్లమల అటవీ సమీపంలోని పేరు సోముల వద్ద గల జగన్నాథాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న బ్రిటిష్ సైన్యం.. భారీ ఎత్తున మందీ, మార్భలంతో వెళ్లి ఆ వీరుణ్ని బంధించారు. వెంటనే విచారణ జరిపి జుర్రేరు నది వద్ద ఉరితీశారు. ఉరి తీశాక కూడా నరసింహారెడ్డి భయం వారిని దాదాపు 30 ఏళ్ల పాటు వెంటాడింది. అందుకే ఆయన్ని చంపేశామని నిత్యం గుర్తు చేసుకునే విధంగా 30 ఏళ్లపాటు ఆయన పార్థివదేహాన్ని అలాగే ఉరికొయ్యకు వేళ్లాడదీసే ఉంచారని చెబుతారు. సీమ ప్రాంతం నుంచి మరెవరూ తమపై తిరుగుబాటు చేయకుండా భయపెట్టేందుకే ఉయ్యాలవాడ మృతదేహాన్ని అలా వాడుకుందని చెబుతారు.
నరసింహారెడ్డి వీరగాథను మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి అంటూ తెరకెక్కించారు. దీంతో ఆ మహనీయుడి సొంత స్థలానికి వచ్చే ప్రజలతో ఓ జాతరను తలపిస్తోంది. అయితే అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం, సరైన సమాచారం కూడా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై ఇకనైనా దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకొని స్వాతంత్ర సమరయోధులను, వారు చేసిన త్యాగాలను స్మరించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.
Good article 😊
ReplyDelete