భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‌కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.
సూర్యవంశ రాజులు ఈ దేశంలోని చాలా భూభాగాలను యుగయుగాలుగా పరిపాలిస్తున్నారు. ఆ సూర్యవంశానికి చెందిన సిసోడియా రాజపుత్రుల కుటుంబంలో ఉద్భవించిన త్యాగశీలుడైన గొప్ప పరిపాలకుడే మహారాణా ప్రతాప్. ఆయన పూర్తిపేరు కుంవర్ ప్రతాప్ సింహ్ జీ. 1540 మే 9న రాజస్థాన్‌లోని కుంభల్ గఢ్‌లో జన్మించాడు. తండ్రి మహారాణా ఉదయసింహ్. తల్లి రాణి జీవత్ కుంవర్ జీ. 1568 నుంచి 1597 వరకు మేవాడ్ పాలకుడిగా 29 ఏళ్లు పరిపాలించాడు. పాలకుడిగా ఉన్నన్నాళ్లూ మొఘల్ దాడులను తిప్పికొట్టడానికే జీవితాతం పోరాడిన వ్యక్తి రాణాప్రతాప్. ఇక సిసోడియా రాజవంశీకులు 13వ శతాబ్దం నుంచీ ఓ గొప్పనైన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వీరు ఎక్కడా తమను తాము రాజులుగా ప్రకటించుకోలేదు. రాజరికపు ఛాయలు వారి పాలనలో ఎక్కడా కనిపించలేదని చరిత్ర విశ్లేషకులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. తమ దృష్టిలో వారంతా రాజ్యానికి కాపలాదారులే తప్ప.. రాజులు కారు. ఇంకో రకంగా చెప్పాలంటే వారు రాజ్యానికి సేవకులు మాత్రమే. ఇదే అవగాహనతో సిసోడియా రాజవంశీకులు చివరివరకూ వ్యవహరించారు. అందుకే వారి పేర్ల చివర గానీ, ముందు గానీ రాజు అనో, రాజాధిరాజు అనో, మహారాజా అనో... ఇలాంటి పదాలు కనిపించవంటారు చరిత్రకారులు. మరి రాజెవరు? పరిపాలన ఎవరి పేరుతో సాగుతుందన్నది మరో ఆసక్తికరమైన అంశం. సిసోడియా రాజవంశీకుల దృష్టిలో మేవాడ్ కు రాజు.. స్వామి ఏక్ లింగ్జీ. అంటే మేవాడ్ లో కొలువైన శివుడన్నమాట. పరమేశ్వరుడే రాజుగా.. ఆ పరమేశ్వరుడి పేరు మీద రాజ్యాన్ని కాపలా కాసే సైనికులుగా మాత్రమే తమను తాము భావించుకుంటారు. రాణా అంటే కస్టోడియన్. మహారాణా అంటే ప్రధాన కస్టోడియన్.. లేదా ప్రధాన కాపలాదారుడన్నమాట. ఇంతటి ఔదార్యమైన భావనతో పరిపాలించినవారిని నేటి కాలంలోనైతే అసలు ఊహించలేం కూడా.
భారతదేశానికి చక్రవర్తిని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో అక్బర్.. తన సామ్రాజ్యాన్ని విస్తరింపుజేసుకోవడంలో నిగ్నమయ్యాడు. అందులో భాగంగానే మేవాడ్ ను కూడా కలుపుకోవాలని కలలు గన్నాడు. మహారాణా ప్రతాప్ గురించి ఎందరో రాజులు గొప్పగా చెప్పిన ఫలితంగా ఆయనపై యుద్ధం చేయడం కన్నా ఆయన్ని రాజీ పరచుకొని సామంతుడిగా ఉండమని ఒప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అక్బర్. తనకు సామంతులుగా మారిన ఎందరో హిందూ రాజుల చేత రాయబారం నడిపించాడు. అప్పటికే అనేక మంది హిందూ రాజపుత్రులతో సంబంధాలు కలుపుకొని.. మతాతీత లౌకికవాదిగా తన దగ్గరి కవులచేత రాతలు రాయించుకున్న అక్బర్.. మిగతా రాజులు అందరికన్నా రాణాప్రతాప్ కు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు తనకు ఎదురులేని సామ్రాజ్యం నిర్మించుకోవాలనేది అక్బర్ కల. అందుకు మధ్యలో రాజస్థాన్ లోని మేవాడ్ రాజ్యం ఉంది. మేవాడ్ ను లోబరచుకోకుండా గుజరాత్ చేరుకోవడం అసాధ్యం కాబట్టి.. మేవాడ్ కు అతను అధిక ప్రాధాన్యతనిచ్చాడు. అయితే రాయబారాలేవీ ఫలించకపోవడంతో యుద్ధ తంత్రం ప్రయోగించాడు అక్బర్.
అక్బర్ కు సామంతుడైన అంబర్ కు చెందిన రాజా మాన్సింగ్ నేతృత్వంలోని మొఘల్ దళాలకు.. మేవాడ్ మహారాణాకు హల్దీఘాటీ అనే కొండప్రాంతంలో జరిగిన చారిత్రక యుద్ధమే హల్దీఘాటీ యుద్ధం. 1576 జూన్ 18న ఈ యుద్ధం మొదలైందని చెబుతారు. ఈ యుద్ధంలో మొఘలు సేనలు.. మేవాడ్ దళాలకు గణనీయమైన ప్రాణనష్టం కలిగించాయి. చివరికి చిత్తోడ్, మండల్ గఢ్ వంటి పలు ప్రాంతాలు మొఘలుల వశమైపోయాయి. సైనికపరంగా రాణాప్రతాప్ దగ్గర దాదాపు 20 వేలు, అక్బర్ సైన్యంలో దాదాపు 80వేల మంది ఉన్నారంటారు చరిత్రకారులు. మరోవైపు మొఘల్స్ దగ్గర తుపాకులు, ఫిరంగులు ఉండగా.. రాణాప్రతాప్ దగ్గరున్న భిల్లు అనే గిరిజన జాతి సైనికులే ఉన్నారు. ఈటలు, బల్లాలు వంటి నాటు ఆయుధాలు మాత్రమే వీళ్ల దగ్గర ఉన్నాయి. ఫలితంగా యుద్ధంలో ఓటమితో రాణాప్రతాప్ ను యుద్ధభూమి నుంచి తప్పించారు అతని ఆంతరంగికులు. అక్బర్ కు పట్టుపడకుండా తప్పించుకుని అడవుల్లో తలదాచుకుంటూ.. కోల్పోయిన భూభాగాలను మళ్లీ పొందేందుకు నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు మహారాణా ప్రతాప్. అడవుల్లో తిండి కూడా దొరకని పరిస్థితుల్లో గడ్డి రొట్టెలు చేసుకొని తిన్నాడు. సార్వభౌమాధికారం కలిగిన ఒక భారతీయ రాజు ఇంతటి కష్టాలు అనుభవించిన దాఖలాలు బహుశా లేవనే చెప్పాలి.
ఇక అడవుల్లో అజ్ఞాతంగా ఉంటున్న రాణాప్రతాప్.. తనచుట్టూ అక్బర్ కు సామంతులుగా ఉన్న రాజులను నమ్మలేదు. అందుకు బదులుగా.. భిల్లు జాతి గిరిజన సేనను సమకూర్చుకున్నాడు. వారికి సైనికంగా తర్ఫీదునిచ్చాడు. భామాషా అనే ఆనాటి పెద్ద వ్యాపారి.. అక్బర్ కు వ్యతిరేకంగా పోరాడుతూ స్వేదేశీ ఆత్మగౌరవం కోసం ప్రయత్నిస్తున్న రాణాప్రతాప్ కు భారీఎత్తున సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. అతను ఇచ్చిన డబ్బుతో అవసరమైన సరంజామాను రాణాప్రతాప్ సమకూర్చుకున్నాడు. అయితే మొఘలుల దృష్టి 1585 తర్వాత సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలపైకి మళ్లడంతో.. దాన్ని అవకాశంగా మలచుకున్నాడు రాణా ప్రతాప్. ఇదే అదునుగా పోరాటానికి దిగిన ప్రతాప్.. తాను కోల్పోయిన ఒక్కొక్క కోటనే స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు. ఈ విషయం సమకాలీన శిలాశాసనాల్లోనూ దొరుకుతుంది. ఇలా రాణా ప్రతాప్ తిరిగి స్వాధీనం చేసుకున్నవాటిలో చిత్తోడ్, మండల్గఢ్లతో పాటు మేవాడ్‌లో ఉన్న అన్ని అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నాడు. తాను కోల్పోయిన భూభూగాలను తన జీవితకాలంలోనే తిరిగి సాధించి ఆత్మగౌరవం నిలుపుకున్న గొప్పనైన పాలకుడు మహారాణా ప్రతాప్.
కోల్పోయిన మేవాడ్ చేజిక్కిన తరువాత రాణాప్రతాప్.. గోగండా, ఉదయ్‌పూర్ వంటి అనేక కోటలు ఆధీనంలోకి వచ్చాయి. హిందూ రాజపుత్రులను అక్బర్ తనవైపు తిప్పుకొని తనను ఒంటరిని చేసినా.. రాణాప్రతాప్.. ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. గెరిల్లా యుద్ధాల ద్వారా మొఘలులకు వ్యతిరేకంగా ప్రతిఘటన కొనసాగించాడు. మరణించేలోపు.. తన పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి సాధించుకున్న గొప్ప దేశభక్తుడు రాణాప్రతాప్. 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా రాణా ప్రతాప్ చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకం.
Comments
Post a Comment
Your Comments Please: