ఊరక రారు మహానుభావులన్నట్లు ఢిల్లీ నుండి ఓ పెద్దాయన వచ్చాడు. చాలా పెద్ద రాచకార్యానికి వచ్చిన ఆ పెద్దాయన.. జూనియర్ ను పిలిపించుకొని ముచ్చటించాడు. పెద్దవాళ్లు పెద్దపెద్ద టాపిక్‌లు మాట్లాడుకోవాలి గానీ.. కుర్రాళ్లతో మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయబ్బా.. అని గల్లీ లెవల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. అసలే ఆ పెద్దాయనకు అగ్గిపుల్ల స్వామి అనే పేరొకటి ఉంది. మరి అలాంటప్పుడు కాక మీదున్న కుర్రాణ్ని అగ్గిపుల్ల స్వామి కలిస్తే.. అగ్గి రాజుకోకుండా ఎలా ఉంటుంది?
Also Read: పవన్‌కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?
Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి
కేంద్రహోంమంత్రి అమిత్ షా.. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల భేటీపై తెలుగు రాజకీయాల్లో రేగిన చర్చ రచ్చ రచ్చ అవుతోంది. ఈ మీటింగ్ పై ఎవరికి తోచినవిధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అబ్బురపడి ఆయన్ని పిలిపించుకుని అమిత్ షా శెభాష్ అంటూ కితాబిచ్చారని పైకి చెబుతున్న మాటలు.. కామెడీగా తేలిపోతున్నాయి. అదే నిజమైతే మరి రామ్‌చరణ్ ను, సినిమా దర్శకుడు రాజమౌళిని ఎందుకు పిలవలేదన్న ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం దొరకటం లేదట. ఏమో మాకేం తెలుసు.. వాళ్లు ఏకాంతంగా భేటీ అయ్యారు.. ఏం మాట్లాడుకున్నారో తెలీదని కొందరు నేతలు దాటవేసే ప్రయత్నం చేస్తున్నా.. అవేవీ అతికేలా కనిపించడం లేదు. అయితే అమిత్ షాకు, బాద్ షాకు తప్ప వారేం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియకపోవటంతో ఆ భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీకి పవన్ దూరం అవుతున్నారనీ, ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ ను ఆ పార్టీ ఎంచుకుందనే ఊహాగానాలు ఓ వైపు... కాదు కాదూ.. తెలంగాణలో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని, మరీ ముఖ్యంగా గ్రేటర్ లో పార్టీ బలోపేతంలో భాగంగానే ఎన్టీఆర్ తో స్నేహానికి బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
వారి భేటీపై మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతుంటే.. టీడీపీలో మాత్రం వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణి కనిపిస్తోంది. బుద్ధా వెంకన్న లాంటి ఒకరిద్దరు నేతలు మాత్రం ఎన్టీఆర్, అమిత్ షాను కలిస్తే తప్పేంటని ప్రశ్నించినప్పటికీ మెజారిటీ నేతలు మాత్రం దృశ్యం సినిమాలో సీన్ లాగా తాము ఆ భేటీ చూడలేదని.. అక్కడ ఏం జరగిందో తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈ భేటీని అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది పార్టీ అధిష్టానం ఫీలింగట. అయితే ఇది నమ్మేబుల్ గా కనిపించడం లేదనేవారు కూడా టీడీపీలోనే ఉన్నారు. తాము ప్రధాని మోడీని కలిసినప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగిందనీ, పవర్ ఫుల్ పర్సన్స్ కమింగ్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్ అన్న సినిమా డైలాగ్ లా.. కేంద్రంలో పవర్ లో ఉన్న పెద్దలు కదుపుతున్న పావుల్ని జాగ్రత్తగా గమనిద్దామని సదరు నేతలకు టీడీపీ హైకమాండ్ నుండి ఆదేశాలు వెళ్లాయట. అయితే అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ వల్ల టీడీపీకి వచ్చే ఇబ్బందేమీ లేదనీ... ప్రస్తుతానికి జూనియర్.. టీడీపీకి దగ్గరగా లేకపోయినా.. పార్టీకి నష్టం కలిగేలా ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయాలూ తీసుకోబోరని మరికొంతమంది నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొన్నామధ్య ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు కంటితడి పెట్టిన ఘటనపై కూడా ఎన్టీఆర్ స్పందించారనీ, అదేవిధంగా పార్టీకి కచ్చితంగా తన సేవలు అవసరమైనపుడు ఎన్టీఆర్ మళ్లీ ముందుకు వస్తారనీ, 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ పార్టీ కోసం పడ్డ శ్రమను మనం గుర్తుంచుకోవాలని డైలమాలో ఉన్న నేతలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారట.
మరోవైపు టీడీపీకి, ఎన్టీఆర్ కు దూరం పెరిగిందనీ, ఎన్టీఆర్ ను ప్రోత్సహిస్తే లోకేశ్ లీడర్ షిప్ కు ఇబ్బందిగా మారుతుంది కాబట్టి.. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందనీ బీజేపీలో ఇంకో వర్గం భావిస్తోంది. ఏపీలో ఇప్పటికే పవన్ తో పొత్తులో ఉన్న నేపథ్యంలో, అటు తెలంగాణలో ఎన్టీఆర్ చరిష్మా సైతం తమకు కొంత ఉపయోగపడుతుందనీ, ఇప్పటికే విజయశాంతి లాంటి క్రేజీ స్టార్ బీజేపీలో ఉన్నారు.. త్వరలో మరోసీనియర్ నటి జయసుధ కూడా చేరిపోతారు... ఇక ఎన్టీఆర్ లాంటి వారిని దగ్గర చేసుకుంటే తిరుగులేని సినీ చరిష్మా తెలుగురాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడుతుందన్నది హైకమాండ్ వ్యూహమనీ, కాబట్టి వారి ప్రతి భేటీ, ప్రతి కలయికా రాజకీయ ప్రయోజనాలతోనే కూడి ఉంటుందని ఆ వర్గం నేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న కొద్దిపాటి ఓటింగ్ బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని.. ఇటు ఏపీలో బీజేపీ, టిడిపి, జనసేనలకు సంబంధించిన 2014 కాంబినేషన్ మళ్లీ హిట్ కొట్టే ఛాన్స్ ఉందన్న ఆశాభావం మరికొందరిలో కనిపిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనీ, అందుకోసమే ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై తొందరపడొద్దన్న సంకేతాలు టీడీపీ నుండి వచ్చాయని వారంటున్నారు.
ఓవరాల్ గా చూస్తే.. భేటీలో కూర్చున్న వాళ్లిద్దరూ డిన్నర్ చేసి తాపీగా వెళ్లిపోతే... ఆ తర్వాత చాలా నేతల డిన్నర్స్ లోనూ, లంచ్ మీటింగ్స్ లోనూ ఇదే చర్చ కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతానికి కీలకనిర్ణయాలు తీసుకునే విధంగా ఆ భేటీ జరగకపోయినప్పటికీ భవిష్యత్తులో తెలుగురాష్ట్రాల్లో కీలకంగా మారే పరిణామాలకు మాత్రం వారిద్దరి భేటీ ఓ టీజర్ లాంటిదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందన మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనీ, టీడీపీని స్వాధీనం చేసుకోవాలని ఆమె కోరుతుండడం.. టీడీపీలో హాట్ టాపిగ్గా మారింది. పాడ్యమి నాడో, విదియ నాడో కనిపించని చంద్రుడు.. తదియ నాడు తానే కనిపిస్తాడంటారు. ఓ వారం పోతే.. వారిద్దరి భేటీలో ఏం జరిగిందో తెలియకుండా ఎలా ఉంటుంది? కాస్త ఓపిక పట్టాలంతే.
Comments
Post a Comment
Your Comments Please: