జూనియర్ ఎన్టీఆర్, బీజేపీ నేత అమిత్ షా భేటీ రాజకీయవర్గాల్లో చాలా ఆసక్తి రేపుతోంది. వారేం మాట్లాడుకున్నారన్నది బయటకు పొక్కకపోయినా.. కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యమైన అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని అంతా భావిస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడనే పేరున్న అమిత్ షా.. తన విలువైన సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవడం అనేక కోణాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ టాప్ లీడర్, టాప్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా.. నోవోటెల్ హోటల్లో ప్రముఖ తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ గెలుపు కోసం, దగ్గరి బంధువైన చంద్రబాబు కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీతో పాటు చంద్రబాబునాయుడుతో కూడా ఆయన ఎడం పాటిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టాకే.. పవన్ కల్యాణ్ తో చెట్టపట్టాలు వేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ క్రమంలో తన సినిమా ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటూ.. రాజకీయాల్లో పూర్తి నిశ్శబ్దం పాటిస్తున్న ఎన్టీఆర్.. అమిత్ షా ను కలవడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
ఏపీలో సొంతబలం లేని బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి ఓ మంచి శక్తిగా ఎదగాలని ఆరాటపడుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో చెలిమి చేసినా.. ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాల చేత బాబును తాము నమ్మే పరిస్థితి లేదంటున్నారు పలువురు బీజేపీ నేతలు. మరోవైపు.. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందనేది ఏపీ బీజేపీ నేతల అభిప్రాయం. అందుకు అనుగుణంగానే సోము వీర్రాజు కొంత చొరవ తీసుకొని.. టీడీపీ, జనసేన, బీజేపీ లను కలిపి ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే జనసేనాని ఇటీవల.. తాను గతంలో త్యాగం చేశానని, ఈసారి ఇతరులు కూడా త్యాగనిరతి చూపించుకోవాలని కామెంట్లు చేయడం, అటు చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటూ అప్పుడే టికెట్లు కేటాయిస్తుండడం వంటి అంశాలతో.. తమ మూడు పార్టీల పొత్తు త్రిశంకు స్వర్గం లాంటిదేనన్న అభిప్రాయానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు వచ్చినట్లు ఆఫ్ ద రికార్డుగా పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. ఏక కాలంలో పవన్ కల్యాణ్ కు, అటు చంద్రబాబునాయుడుకు చురుకు తగిలేలా ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
అమిత్ షా గానీ, మోడీ గానీ.. తమ సమయాన్ని వృథా చేసుకోరని, రాజకీయాలు కాకుండా వారిద్దరూ వేరే అంశాలు చర్చించడానికి టైమ్ దుర్వినియోగం చేయరని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అంటున్నారు. ఏపీలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విడివిడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా.. తమకు ఒరిగే నష్టమేమీ ఉండబోదన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు గెలిస్తే.. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీ నేతలు 76 సీట్లు గెల్చుకున్నారని గుర్తు చేశారు. రేపు ఏపీలో కూడా అదే రిపీట్ అవుతుందన్న కొడాలి నాని.. చంద్రబాబునాయుడుతో ఒరిగేదేమీ ఉండదన్న ఉద్దేశంతోనే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ఉంటారన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ స్టార్ ను సమర్థవంతంగా వాడుకోవడం చంద్రబాబునాయుడుకు చేత కాలేదని, ఆయన పడేసిన పావుతోనే ఇప్పుడు కమలనాథులు గేమ్ షురూ చేశారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా.. కీలక బాధ్యతలు ఇచ్చి పలు రాష్ట్రాల్లో కూడా ఆయన సేవలు వినియోగించుకునే ప్లాన్ చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి బీజేపీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది.. రేపేం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.
Comments
Post a Comment
Your Comments Please: