తెలంగాణలో రసవత్తరమైన రాజకీయ అంకానికి తెర లేచింది. భారత ఉపఖండంలో తెలంగాణ విలీనాంశం అనేది ఓ కీలకమైన ఘట్టం. అయితే ఆ ఘట్టాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కొన్ని పక్షాలు ప్రయత్నిస్తుండగా.. అదే ఘట్టాన్ని ఆసరా చేసుకొని తమ రాజకీయ అవసరాలు తీర్చుకున్న పక్షాలు కూడా ఉన్నాయి. తెలంగాణ విలీనంతో కొన్ని వర్గాలు తమ ఉనికి కోల్పోతామని ఆందోళన చెందితే.. మరికొన్ని వర్గాలేమో సెంటిమెంట్లు గాయపడే అంశంగా పరిమితం చేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణలో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ నేతగా అనేక వేదికల మీద చెప్పిన కేసీఆర్.. తన మాట నిలుపుకోవడం లేదంటూ... బీజేపీ కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తామని డిక్లేర్ చేయడంతో... ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.
Also Read: భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని.. అధికారిక ఉత్సవంగా నిర్వహించాలన్న డిమాండ్.. ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కేంద్రంలోని మోడీ సర్కారు సెప్టెంబర్ 17 రోజున పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవాన్ని కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తామని, ఆ కార్యక్రమానికి తమరు కూడా రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓ లేఖ రాశారు. అటు కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలకు కూడా ఇదే పద్ధతిలో ఆహ్వానాలు పంపారు. మోడీతో, కేంద్ర సర్కారుతో కొన్ని నెలలుగా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న కేసీఆర్‌కు కమలనాథుల ఆహ్వానపత్రం ఓ సవాలు విసిరినట్టయింది. ఉద్యమనేతగా ఉన్న సమయంలో సెప్టెంబర్ 17ను అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామన్న కేసీఆర్.. తెలంగాణ వచ్చిన తరువాత ఆ విషయాన్ని అటకెక్కించారని బీజేపీ నేతలు ప్రతి సంవత్సరం నిలదీస్తున్నారు. ప్రతియేటా సెప్టెంబర్ 17 వచ్చిందంటే.. బీజేపీ నేతలు టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వైపు నుంచి గానీ, ప్రభుత్వం వైపు నుంచి ఆ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో బీజేపీ నేతల తాజా అడుగుతో కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా వివాదానికి ముందు.. అసలు సెప్టెంబర్ 17 చుట్టూ చరిత్రతో ముడివడి ఉన్న అంశాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై దేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో.. హైదరాబాద్ సంస్థానంలో మాత్రం ఇంకా బానిస ఛాయలే కొనసాగుతున్నాయి. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్... దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక తనను తాను సర్వ స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ సంస్థానం ఇండియాలో గానీ పాకిస్తాన్లో గానీ కలవదని తేల్చేశాడు. అది మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్ణయం. కానీ హైదరాబాద్ ప్రజల అభీష్టం మాత్రం వేరుగా ఉంది. ప్రజలంతా భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. పలువురు జాతీయ ఉద్యమకారులు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైళ్లకు వెళ్లడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ప్యూడల్ పాలన కొనసాగుతోంది. దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, దొరల వెట్టి చాకిరీలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజల్ని దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్బలంతోనే రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై ఆసఫ్ జాహీ పతాకం ఎగురవేస్తానని విర్రవీగాడు. నిజాం నిరంకుశ పాలనపై జాతీయ కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర విభాగం, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ నాయకులు వేర్వేరు పంథాలో పోరాటం నిర్వహించారు. అయితే ఆ సంస్థలన్నింటినీ ఉస్మాన్ అలీఖాన్ నిషేధించడం గమనించాల్సిన అంశం. మరోవైపు ఉస్మాన్ అలీఖాన్.. పేరుకు స్వతంత్రుడిగా ప్రకటించుకున్నా.. మనసులో మాత్రం పాకిస్తాన్ జపం చేస్తూ ఉండేవాడు.
మరోవైపు అప్పటికే భారత్ పట్ల పాక్ అనుసరిస్తున్న వైఖరి, రెండు ప్రధాన వర్గాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు, పాక్ లో చెలరేగుతున్న హింస వంటి కారణాలతో.. భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశం నడిబొడ్డున క్యాన్సర్ కణితిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు... పాకిస్తాన్ సాయం కోరుతూ ఓ లేఖ రాశాడు. అంటే భారత సైన్యాన్ని తిప్పికొట్టే పోరాటంలో తనకు మద్దతివ్వాలని అభ్యర్థించాడు. మరోవైపు తన స్వతంత్ర రాజ్యం మీద భారత్ దురాక్రమణ చేస్తోందంటూ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పోలీస్ యాక్షన్ నిర్వహించింది. మూడు రోజుల ఆపరేషన్ తరువాత నిజాం నవాబు.. నాలుగో రోజున సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశాడు. ఈ విధంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తరువాత హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం సిద్ధించింది. ఇలాంటి ముఖ్యమైన సందర్భాన్ని అధికారికంగా ఎందుకు జరుపుకోరాదన్న ప్రశ్న ఇప్పుడు తీవ్రరూపం దాలుస్తోంది.
దేశంలో ఎక్కడా లేంది.. తెలంగాణలో మాత్రమే ఈ అభిప్రాయ భేదాలు, సైద్ధాంతిక పట్టింపులు ఎందుకొచ్చాయి? సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన ఘట్టాన్ని విద్రోహ దినంగా పేర్కొన్నదెవరు? విమోచన దినంగా జరపాలని పట్టుబడుతూ వస్తున్నదెవరు? విలీన దినంగా భావిస్తున్నదెవరు? ఈ ప్రశ్నలకు జవాబులు ఇప్పటివరకు రాకపోయినా.. కేంద్ర సర్కారు, తెలంగాణ సర్కారు మధ్య వ్యూహ, ప్రతివ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ సర్కారు తాజాగా నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో.. కేంద్రానికి దీటైన పంథా అవలంబిస్తోందంటున్నారు విశ్లేషకులు.
ఆనాడు దేశంలో ఉన్న దాదాపు 600 సంస్థానాలు అన్నీ కూడా ఎలాంటి సమస్య లేకుండా భారతదేశంలో విలీనం అయ్యాయి. అవన్నీ స్వాతంత్ర్యానంతరం జరిగిన విలీనాలే. అయితే హైదరాబాద్ సంస్థానంలో ప్రభువు ముస్లిం. అధిక సంఖ్యాకులైన ప్రజలు హిందువులు. దీంతో పాలనలో అనేక వివక్షాపూరితమైన నిర్ణయాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. మరోవైపు.. అధిక సంఖ్యాకుల మనసు చూరగొనేందుకు, పాలన సవ్యంగా జరిగేందుకు నిజాం కూడా అనేక చర్యలు తీసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అయినా ప్రభువు ముస్లిం కావడం చేత పాలనలో పైచేయి అంతా ముస్లింలదే ఉండేది. అటు అధిక సంఖ్యాకులైన హిందువుల్ని సంస్థానమంతా పరిపాలించడానికి నిజాం.. దేశ్‌ముఖ్ లు, జాగీర్దార్ల సాయం తీసుకున్నాడు. పన్నులు వసూళ్లు చేసేది వారే... నిజాం ప్రతినిధులుగా శాంతిభద్రతలు నిర్వహించేదీ వారే. అయితే పన్నుల వసూళ్లలో గానీ, శాంతిభద్రతల విషయంలో గానీ దేశ్‌ముఖ్‌లకు, జాగీర్దార్లకు, భూస్వాములకే పూర్తి అధికారాలు ఇవ్వడంతో.. పేద ప్రజలపట్ల వారు అమానవీయంగా వ్యవహరించారన్న అభియోగాలున్నాయి. వెట్టిచాకిరీ, పన్నులు కట్టనివారి భూములు లాక్కోవడం వంటి ఆరోపణలు చరిత్ర నిండా కనిపిస్తాయి. సంస్థానంలో ఇలాంటి అమానవీయ పాలన సాగుతున్న క్రమంలో పేద ప్రజల పక్షాన కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాటానికి అవకాశం ఏర్పడింది. కమ్యూనిస్టు ఉద్యమకారులు నిజాం మీద మాత్రమే గాక.. జమీందార్ల మీద, భూస్వాముల దాష్టీకాల మీద తిరుగుబాటు చేశారు. వారి తిరుగుబాటు కారణంగా నిజాం దుష్టపాలనకు చరమగీతం పాడాలన్న డిమాండ్ ఊరూరా ఊపందుకుంది.
ఇక హైదరాబాద్ సంస్థానంలో జాతీయ ఉద్యమానికీ కొదువ లేదు. దేశమంతటా స్వాతంత్ర్య పోరాట కాంక్ష వెల్లువెత్తుతున్న క్రమంలో పలువురు విద్యావంతులు ఆ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. సంస్థానంలో కూడా జాతీయ ఉద్యమానికి బీజాలు వేశారు. వందేమాతరమే ఆనాడు జాతీయ ఉద్యమానికి ఊతమిచ్చిన నినాదం. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం పాడినందుకు బహిష్కృతులైనవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వేటు కారణంగానే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు.. నాగపూర్ వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం కావడమే ఇక్కడ సకల సమస్యలకూ పరిష్కారం అవుతుందని.. ఒక్క దెబ్బతో సంస్థానం భారత్ లో విలీనమై, నిజాం పీడ విరగడవుతుందని ఆనాటి స్వాతంత్ర్య పోరాటయోధులు భావించారు. ఈ పోరాటంలో ఆనాటి జాతీయ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఆర్యసమాజ్ నేతలు, ఆ సంస్థ కార్యకర్తలు.. ఇతర హిందూ సంస్థలు.. తమదైన ఇస్లామిక్ వ్యతిరేక పంథాలో జాతీయ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఇది గమనించాల్సిన అంశంగా చరిత్రకారులు పేర్కొంటారు.
ఇక సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో విజయవంతంగా ముగిసిపోయి, నిజాం పాలన అంతమయ్యాక.. ఆ ఘటనతో తమ ఉనికిని చాటుకునే సైద్ధాంతికపరమైన ఓ పెనుగులాట మొదలైందంటారు విశ్లేషకులు. సంస్థానం విలీనానికి ముందు నిజాం ప్రభువు.. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. అటు వామపక్ష విప్లవకారుల పంథా మరోరకంగా ఉండేది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కమ్యూనిస్టు పోరాటాలు చేస్తున్న లెఫ్ట్ నేతలు.. తమ ప్రయోగానికి అనుకూలమైన ప్రాంతంగా తెలంగాణను గుర్తించారు. నిజాంను తరిమేస్తే.. తమదైన మార్కు పాలనను భారత్ నడిబొడ్డున ప్రారంభించవచ్చన్న తహతహ వారిలో ఉండేది. అప్పటి రష్యా సోషలిజం వైపు అడుగులు వేస్తున్న ఛాయలుండేవి. చైనాలో కూడా కమ్యూనిస్టు నేతల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ తెలంగాణలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడాలంటే.. ఇక్కడి కమ్యూనిస్టు నేతలు చైనా సాయం కావాలని లేఖలు రాసిన దాఖలాలు కూడా ఉన్నాయని చరిత్రకారులు చెబుతారు. అంటే భారత్ మీద యుద్ధానికి లేదా భారత్ ను నిలువరించేందుకు నిజాం పాకిస్తాన్ సాయం కోరితే.. కమ్యూనిస్టులు చైనా సాయం కోరారని విశ్లేషకులు ఇప్పటికీ ఆనాటి ఘటనల్ని గుర్తు చేసుకుంటారు. అందువల్లే తెలంగాణ ప్రాంతం.. తమ పట్టు నుంచి జారిపోతుందన్న ఉద్దేశంతోనే వామపక్ష పోరాటయోధులు.. దీన్ని విద్రోహ దినంగా పరిగణిస్తున్నారు.
మరోవైపు సెప్టెంబర్ 17ను విలీన దినంగా భావించినవారిలో జాతీయ కాంగ్రెస్ ఉద్యమకారులు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఏఐసీసీ ముఖ్యనేతగా, భారత హోంమంత్రిగా సర్దార్ పటేల్ నిర్వహించిన ఆపరేషన్ పోలో సత్ఫలితాచ్చిందని.. అలా భారత జాతీయ పటంలో హైదరాబాద్ సంస్థానానికి ముఖ్యమైన స్థానం కల్పించారని చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఓ ముస్లిం ప్రభువు అధిక సంఖ్యాకులైన హిందువుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని, మత స్వేచ్ఛ లేకుండా చేశారని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అప్పటివరకూ ఉన్న నిజాం పాలన అణచివేతకు పరాకాష్ట అని, ఆయన కబంధ హస్తాల నుంచి తెలంగాణ పేదప్రజలు విముక్తం చెందారు కాబట్టి దాన్ని విమోచన దినంగా జరుపుకోవాలని వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రజలందరి ఆకాంక్షను పటేల్ ఆ విధంగా పూర్తి చేశారని.. బీజేపీ నేతలు పటేల్ ను హైలైట్ చేస్తూ వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కూడా ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇదే క్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్.. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారని, ఆయన ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చుకోవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రతియేటా వారు ఏదో స్థాయిలో విమోచన దినం జరుపుకుంటూ వస్తున్నారు. అయితే కేసీఆర్ తన నినాదం మరచిపోయారని, ఎంఐఎం నేతల ఒత్తిడికి తలొగ్గి ఆ మాటను అటకెక్కించారని వారు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు నమ్మకమైన మిత్రుడిగా వస్తున్న ఎంఐఎం నేత అసదుద్దీన్.. తాజాగా ఓ కొత్త వెర్షన్ తెరమీదికి తీసుకొచ్చారు. సంస్థానంలోని నిజాం వ్యతిరేక పోరాటంలో చాలా మంది ముస్లింలు కూడా ఉన్నారని, నిజాం అరాచకాలకు వారు ప్రాణాలు సైతం కోల్పోయారని.. అందువల్ల సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపుకోవాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.
కర్నాటక, మహారాష్ట్రలు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు నిర్వహించరాదన్న ప్రశ్న కీలకంగా మారుతోంది. విలీనమా, విమోచనమా, విద్రోహమా అనే పదాల్లో ఏదో ఒకటి ఎంచుకొని... అధికారికంగా ఎందుకు నిర్వహించరన్న ప్రశ్నకు.. ఉమ్మడి ఆంధ్రాలో సమైక్య పాలకుల నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరి నుంచీ జవాబు రాలేదు. ఆ మౌనాన్ని బద్దలు కొట్టాలని బీజేపీ నేతలు భావిస్తుండగా.. కొందరి సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యతనిచ్చే పలు పార్టీలు.. ఇంకా మౌనం వీడటం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి.. సెప్టెంబర్ 17 నాటికైనా ఏదో ఒకటి క్లారిటీ ఇస్తారా.. లేక ఎప్పటిలాగే ఎటూ తేల్చక.. కేవలం ఎన్నికల ఎజెండగానే ముందుకు తీసుకెళ్తారా అన్నది చూడాల్సి ఉంది.
Comments
Post a Comment
Your Comments Please: