ఆఫ్ఘనిస్థాన్ మనకు శత్రు దేశమా.. మిత్రదేశమా? మిత్రదేశం అనడానికి ఎలాంటి బలమైన ఆధారాలూ లేవు. శత్రుదేశంగా పరిగణించడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. మరి ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండానే.. భారత్ పెద్దమొత్తంలో తిండిగింజలు, మెడిసిన్స్‌ను ఎందుకు పంపుతోంది? కనీసం అక్కడి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇప్పటివరకూ గుర్తించని భారత్.. భారతీయులు కూడా ప్రశ్నించేలా ఆ దేశానికి అంతపెద్ద మొత్తంలో ఆపన్నహస్తం ఎందుకు అందిస్తోంది?
యుగయుగాలుగా భారతీయులు చూపిస్తూ వస్తున్న ఔదార్యం ముందు ప్రపంచంలోని ఏ దేశమైనా దిగదుడుపేనంటారు. గతేడాది ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు కబ్జా చేసుకొని, అధికారం చేపట్టినప్పుడు ప్రపంచమంతా వణికిపోయింది. ముఖ్యంగా భారత ప్రభుత్వం తాలిబాన్ల కదలికల్ని నిశితంగా గమనిస్తూ అడుగులు వేస్తోంది. అమెరికా వెన్నుదన్నుతో కర్జాయ్ పరిపాలించినప్పుడు వెల్లివిరిసిన స్నేహ సంబంధాలు ఒక్కసారిగా అదృశ్యమైపోయి... తాలిబన్ల రాకతో మన దాపునే రాక్షస రాజ్యం పురుడుపోసుకున్నట్లయింది. అయితే తాలిబాన్ల వ్యవహార శైలి, పాలనలో షరియాను పక్కాగా అమలు చేయడం, మహిళలతో అనుసరించే విధానం వంటి అనేక కారణాలతో జనజీవనం స్తంభించింది. ప్రజల్లో భయాందోళనలు మరింతగా పెరిగాయి. ఉద్యోగ జీవులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి దాపురించింది.దీంతో ఉత్పాదకత పడకేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘన్లకు ఆర్థికంగా సాయం అందించడమే గాక.. వారి ఆకలి తీర్చేందుకు తిండిగింజలు సైతం భారత్ పంపడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియా పాముకు పాలు పోస్తోందన్న విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఆఫ్ఘన్ విపక్ష పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత భారత్ చేస్తున్న సాయాన్ని అపాత్రదానంగా అభివర్ణించడం ఆసక్తి రేపుతోంది.
అహ్మద్ మసూద్.. 34 ఏళ్ల కుర్రాడు. ఆఫ్ఘనిస్థాన్ పౌరుడు. విదేశాల్లో ఉన్నత విద్యలు చదువుకోవడమే గాక.. ఆఫ్ఘనిస్థాన్ మీద విదేశీ గద్దలు వాలకుండా కాపాడాలని తహతహలాడే ఓ యువనాయకుడు. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్... N.R.F.A అనే విపక్ష పార్టీ నడిపిస్తున్న యువనేత. ఆఫ్ఘనిస్థాన్ మీద సోవియట్ యూనియన్ పెత్తనాన్ని అడ్డుకునేందుకు గెరిల్లా పోరాటం చేసిన అహ్మద్ షా మసూద్ కుమారుడే ఇతను. ఆఫ్ఘన్ కోసం పోరాడుతూ అమెరికా ట్విన్ టవర్స్ పేల్చివేతకు ముందే అహ్మద్ మసూద్ తండ్రి హతమయ్యాడు. ఆయన పేరు మీదనే అహ్మద్ మసూద్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. తండ్రిబాటలోనే N.R.F.A రాజకీయ పార్టీని కూడా నడిపిస్తున్నాడు. ఇప్పుడీ అహ్మద్ మసూద్ భారత్ పట్ల చేసిన కామెంట్స్ భారత వార్తా ప్రపంచంలో ప్రముఖంగా మారుతున్నాయి. భారత్ నుంచి సాయం అందుకుంటున్న తాలిబాన్లు.. ఆ సాయాన్ని నిజంగా ప్రజల కోసం వెచ్చించడం లేదని, తాము కొన్నేళ్లపాటు కదలకుండా కూచుని తిన్నా తరగనంతగా ఆహార ధాన్యాలను పోగేసుకుంటున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలే చేశాడు. భారత్ నుంచి తేరగా వస్తున్న ఆహారం మెక్కి.. ప్రజల్ని ఇబ్బందులపాల్జేస్తున్నారని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టాడు. భారత్ అందిస్తున్న సాయాన్ని పునరాలోచించుకోవాలంటూ ఓ సూచన కూడా చేయడం విశేషం. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల పాలన మొదలయ్యాక భారత్.. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. కానీ.. మానవీయ కోణంలో సాయం అందిస్తామని, అమాయకులైన ప్రజల్ని ఆదుకునేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని తేల్చి చెప్పింది. అన్నట్టుగానే గత ఆరు నెలలుగా అనేక విడతలుగా పెద్దమొత్తంలో గోధుమలు, పప్పులు వంటి ఆహార ధాన్యాలతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్స్ పెద్దమొత్తంలో అందిస్తోంది. ఆఫ్ఘన్ కు అవసరమైన సాయం అందిస్తున్నందుకు, అక్కడ ప్రజాపాలన గాడిన పడేలా ఏజెన్సీలు నెలకొల్పి ఆపన్నహస్తం అందిస్తోంది. రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు నిలుపుకునేందుకు కాబూల్ లో రాయబార కార్యాలయాన్ని సైతం తెరచింది. భారత్ చూపుతున్న చొరవకు తాలిబన్లు కూడా పలుమార్లు కృతజ్ఞతలు చెప్పడం గమనించాల్సిన అంశం.
తాజాగా అహ్మద్ మసూద్ చేసిన వ్యాఖ్యలు భారత్ చేస్తున్న సాయంలో పరమార్థాన్ని శంకించేలా చేస్తుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాలిబన్ల రాజ్యం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వంలో తనను కూడా చేరమన్నారని, అయితే తాను అందుకు నిరాకరించానని అహ్మద్ చెబుతున్నాడు. తాలిబన్ల అరాచకాలను అంతం చేయడానికే వారి మీద పోరాడుతున్నానని, అందుకే అడవుల్లో ఉంటూ గెరిల్లా పోరాటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నానని చెబుతున్నాడు. తాలిబన్ల రాకతో ఆఫ్ఘన్ ను వీడిన అహ్మద్.. తజకిస్తాన్లో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు. దీంతో తాలిబన్లతో తన తండ్రి చేసిన పోరాటాన్ని కొనసాగిస్తానని, ఏనాటికైనా ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్ల చెర నుంచి విడిపిస్తానని ధీమాగా చెబుతున్నాడు. పాముకు పాలు పోయడం భావ్యం కాదంటూ భారత్ కు సూచనలు చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తాలిబన్ సర్కారును గుర్తించని భారత్.. అహ్మద్ మసూద్ లాంటి కుర్రాళ్లతో ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు.. భారత్ సాయం కోసం పక్కనున్న బంగ్లాదేశ్ కూడా అర్థిస్తోంది. కానీ అక్కడున్న మతవాదుల ఆట కట్టించడంలో బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా సైతం చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర వహిస్తోందన్న విమర్శలున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ కు అయినా.. బంగ్లాదేశ్ కు అయినా భారత్ సాయం చేసే క్రమంలో కొన్ని ముఖ్యమైన షరతులైనా విధించాలన్న సూచనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
గతేడాది ఆఫ్ఘన్లో తాలిబన్ సర్కారు ఏర్పడినప్పుడు.. భారత్ లో కొందరు మేధావులు, పలు పార్టీలు కూడా తాలిబన్లతో చేయి కలపాలని, వారి ప్రభుత్వాన్ని గుర్తించాలన్న డిమాండ్ వినిపించింది. రాజకీయ పార్టీల్లో ఆ డిమాండ్ ఎంఐఎం నేత అసదుద్దీన్ నుంచి ప్రముఖంగా వినిపించింది. భారత్ మీద దాదాపు ఒత్తిడి తెచ్చినంత పనిచేశారు ఒవైసీ. అందుకు భిన్నంగా అహ్మద్ మసూద్ మాత్రం.. భారత్ చర్యను పునరాలోచించుకోవాలంటున్నాడు. అయితే భారత్ ఎలాంటి ఒత్తిడికీ లోను కాకుండా.. సాయం అందిస్తూనే.. తాలిబన్ల చర్యలను నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో అజ్ఞాత ప్రాంతం నుంచి అహ్మద్ మసూద్ ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి మనోభావాలు తెలియజేయడం.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది.. ఎలాంటి కొత్త ఈక్వేషన్లు పుట్టుకొస్తాయన్న ఉత్కంఠకు దారితీస్తోంది.
Comments
Post a Comment
Your Comments Please: