ఓటరన్న తన పని తాను కానిచ్చేశాడు. తనను సంప్రదించిన పార్టీలతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. మీట నొక్కాల్సిన చోట నొక్కాడు. నిశ్శబ్దంగా తన రొటీన్ వర్క్ లోకి వెళ్లిపోయాడు. మరి ఆ ఓటరు ఏ మీట నొక్కాడు.. ఎవరి మీటరు మార్చబోతున్నాడు.. ఎవరి తలరాత మారబోతుంది? మునుగోడులో ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆ కీలకమైన విషయాలు మీకోసం.
మునుగోడులో పరుగుపందెంలా మారిన ఉపఎన్నికలో హుజూరాబాద్ ఫలితం రిపీట్ కాకూడదన్న పట్టుదలతో టీఆర్ఎస్... మరో హుజూరాబాద్ లా మార్చేయాలన్న వ్యూహంతో బీజేపీ శ్రేణులు పనిచేశాయి. సర్వే సంస్థలు కూడా ఈ పోటీ తీవ్రతను అర్థం చేసుకొని.. అదే స్థాయిలో ఓటర్ల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఒకటీ, అరా సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ఆయా సర్వే సంస్థల రిపోర్టును ఆసరా చేసుకొని పార్టీలు కూడా గెలుపు తమదేననే ధీమాలో ఉన్నాయి.
థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 48 నుంచి 51 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. 13 నుంచి 15 శాతం ఓట్లతో కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. బీఎస్పీ 5 నుంచి 7 శాతం ఓట్లు కైవసం చేసుకుంటుందని, ఇతరులు 2 నుంచి 5 శాతం ఓట్లు పొందే అవకాశం ఉందని థర్డ్ విజన్ అంచనా వేసింది.
మరో సర్వే సంస్థ అయిన ఎస్.ఎ.ఎస్ గ్రూప్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థే గెలుస్తారని అంచనా వేసింది. 41 నుంచి 42 శాతం ఓట్లతో టీఆర్ఎస్ గెలుస్తుందని, 35 నుంచి 36 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థి 16న్నర నుంచి 17న్నర శాతం ఓట్లు పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇక బీఎస్పీకి 4 నుంచి 5 శాతం ఓట్లు, ఇతరులకు ఒకటిన్నర నుంచి 2 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేసింది. వీరు కాకుండా పలు ఇతర సర్వే సంస్థలు కూడా దాదాపు ఇదే రకమైన అంచనాతో రిపోర్టులు వెలువరించడం విశేషం.
ఇక నేషన్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్ కూడా అలాంటి రిపోర్టే ఇచ్చింది.
టీఆర్ఎస్- 42.11 శాతం, బీజేపీ- 35.17 శాతం, కాంగ్రెస్- 14.07 శాతం, బీఎస్పీ- 2.95 శాతం, ఇతరులు- 5.70 శాతం
ప్రముఖ తెలుగు దినపత్రిక, జనంసాక్షి మీడియా సంస్థ మునుగోడు పల్స్ పట్టుకునేందుకు పెద్దఎత్తున కసరత్తు చేసింది. గతంలో హుజూరాబాద్ బైపోల్ లో పలు సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా.. జనంసాక్షి మాత్రం బీజేపీ గెలుస్తుందని కుండబద్దలు కొట్టింది. అలాంటి క్రెడిబిలిటీ సంపాదించుకున్న జనంసాక్షి ఈసారి కూడా అదే పద్ధతిలో పని చేసింది. జనంసాక్షి ఇచ్చిన రిపోర్టు ఇలా ఉంది.
టీఆర్ఎస్: 45-52 శాతం, బీజేపీ: 29-34 శాతం, కాంగ్రెస్: 16-18 శాతం, బీఎస్పీ: 4-5 శాతం
మునుగోడు బైపోల్ కోసం ప్రముఖ దినపత్రిక పోలీస్ నిఘా పటిష్టమైన సర్వే నిర్వహించింది. మునుగోడు మండలంలో బీజేపీదే పైచెయ్యిగా ఉంటుందని, చౌటుప్పల్ మండలంతో పాటు మున్సిపాలిటీలో పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా ఉందని, మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ హవా హవా కొనసాగుతుందంటున్నారు. నారాయణపూర్ మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ. కానీ కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంటుంది. మర్రిగూడ మండలంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. స్వల్ప శాతంతో బీజేపీ ముందుంటుంది. చండూరులో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా టిఆర్ఎస్ దే పైచేయిగా నిలుస్తుంది. నియోజకవర్గంలో 2018లో 2లక్షల 11వేల పైచిలుకు ఉన్న ఓట్లు నేడు కొత్తగా నమోదైన ఓటర్లతో 2,41,805 నమోదయ్యాయి. దీంతో అభ్యర్థుల గెలుపోటములను కొత్త ఓటర్లే తేల్చే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద 2వేల నుండి 5 వేల ఓట్ల లోపు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలున్నట్లు పోలీస్ నిఘా పత్రిక అంచనా వేస్తోంది. మెజారిటీలో 1000 ప్లస్ లేదా మైనస్ ఉండే చాన్సుంది.
బీజేపీ: 36.9 శాతం, టీఆర్ఎస్: 35.5 శాతం, కాంగ్రెస్: 23.0 శాతం, బీఎస్పీ: 3.2 శాతం, ఇతరులు: 1.4 శాతం
మరో ప్రముఖ సర్వే సంస్థ అయిన ఆరా గ్రూపు టీఆర్ఎస్ 50 శాతానికి పైగా ఓట్లు నమోదు చేస్తుందని అంచనా వేసింది.
2018 ఎన్నికల్లో మునుగోడులో 91.3 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 93.13 శాతానికి పెరిగింది. అంటే 3.1 శాతం మంది ఓటర్లు అదనంగా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నమాట. అయితే ఈ భారీ పోలింగ్ ప్రభుత్వం మీద వ్యతిరేకతనా లేక ప్రభుత్వానికి అనుకూలమా అన్నదానిమీదనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Comments
Post a Comment
Your Comments Please: