సర్జికల్ స్ట్రయిక్ అంటే 2016లో భారతదేశం పాకిస్తాన్ మీద చేసిందే అనుకుంటారు అందరూ. కానీ అది ఓ కొనసాగింపు మాత్రమే. అలాంటి సర్జికల్ స్ట్రయిక్, అంతకన్నా ప్రమాదకరమైంది, అంతకన్నా ఎన్నో రెట్ల భయంకరమైంది భారతీయ పురాణ కాలంలోనే జరిగింది. ఆ సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించిన రుద్రమూర్తే వీరభద్రస్వామి. బహుశా దాన్ని మొట్టమొదటి సర్జికల్ స్ట్రయిక్ గా భావించవచ్చేమో.
శత్రువు చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారమే సరైన చర్య. అవమానించడానికి శత్రువే కానక్కర లేదు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ అయినా సరే.. అవమానించాడంటే శత్రువు కిందే లెక్క. సాక్షాత్తూ పరమశివుడు కూడా అదే సూత్రాన్ని పాటించాడు. అల్లుణ్ని అవమానించడానికే దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టాడట. తండ్రి పిలవకపోయినా ఓ గొప్ప కార్యాన్ని, శుభకార్యాన్ని తలపెట్టాడు కాబట్టి వెళ్లొస్తానని శివుని దగ్గర బలవంతంగా అనుమతి తీసుకొని వెళ్లిపోయింది పార్వతి. దుర్బుద్ధితోనే యజ్ఞం తలపెట్టిన దక్షుడు.. కూతురు ముందే అల్లుణ్ని దారుణంగా అవమానించాడు. శివుడికి కూతురును ఇచ్చి పెళ్లి చేయడమే ఇష్టం లేని దక్షుడు.. కూతురే ఇష్టపడి చేసుకోవడంతో ఏమీ అనలేకపోయాడు. కానీ అల్లుడి మీద, అల్లుడి పేదరికం మీదా, ఆడంబరాలకు ఏమాత్రం విలువ ఇవ్వని ఆయన వైరాగ్యం మీద, బిచ్చమెత్తుకుంటే తప్ప పూట గడవని శివుడి దైన్యం మీద దక్షుడికి ఏమాత్రం గౌరవ భావం లేదు. ఆదరణ అసలే లేదు. ఇలాంటి తరుణంలో పిలవని పేరంటానికి వచ్చిన కూతురును సాకుగా తీసుకొని అల్లుడి మీద వాగ్బాణాలు సంధించాడు. ఘోరంగా అవమానించాడు. వెకిలిగా విమర్శించాడు. ఆ యజ్ఞానికి అతిథులుగా వచ్చిన దేవతలందరి ముందూ తన భువనైక నాథుడిని సాక్షాత్తూ తండ్రే ఛీత్కరించడం తో పార్వతీదేవి మనసు కలుక్కుమంది. అలా అందరి ముందూ జరిగిన అవమానం తరువాత బతికి ఉండడం అనేది చావు కన్నా దారుణం. అది కూడా అక్కడ ఆహూతులుగా వచ్చిన దేవీదేవతలందరూ కొలిచే శివుణ్నే అవమానించాక.. తానిక బతికిి ఉండడంలో అర్థం లేదనుకుంది. యోగాగ్ని రాజేసుకొని మంటల్లో ఆహుతైంది.
అక్కడ కైలాసనాథుడికి ఈ దుర్వార్త తెలిసింది. ముక్కు అదిరింది. మూడోనేత్రం నిప్పులు చిమ్మింది. తన ప్రియసతి, తనలో సగభాగంగా నిలుపుకున్న పార్వతీదేవి మరణానికి కారణమైన దక్షుడు ఇకపై ఎప్పుడూ అలాంటి పని చేయకూడదనుకున్నాడు. పట్టలేని ఆగ్రహంతో తాండవం ఆడాడు. తన జడల్లోంచి ఓ పాయను తీసి నేలకేసి కొట్టగా.. ఆ నిప్పుల్లోంచి వీరభద్రుడు ఉదయించాడు. కోరమీసాలతో, భయంకరమైన రూపంతో, బహు బాహువులతో, అనేక ఆయుధాలతో పట్టసం అనే ఖడ్గాన్ని చేతబూని తండ్రి శివయ్య నుంచి ఆజ్ఞ తీసుకొని దక్షుడు చేస్తున్న యజ్ఞవాటికకు వెళ్లి విధ్వంసం సృష్టించాడు. తండ్రిని అవమానించేందుకు తలపెట్టిన యజ్ఞశాలలను అగ్నికి ఆహుతి చేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన దక్షుడి పరివారాన్ని, దేవతా గణాలను సైతం చీల్చి చెండాడాడు. ఆ ఉగ్రరూపానికి మహామహులందరూ తలోదిక్కు పరారయ్యారు. అహంకరించి తండ్రిని అవమానించినందుకు, తల్లి పార్వతి దహనానికి కారణమైన దక్షుడి తల నరికేశాడు. ఆ తరువాత అందరి కోరిక మేరకు మేక తల తొడిగి కాపాడారు. అది వేరే కథ. దీన్ని మించిన సర్జికల్ స్ట్రయిక్ బహుశా మన పురాణగాథల్లో ఎక్కడా కనిపించదు. పరమశివుడు తలపెట్టిన ఆనాటి సర్జికల్ స్ట్రయిక్ ను అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేసిన శివాంశ సంభూతుడే వీరభద్రస్వామి. వీరభద్రుడికి దేశమంతటా అనేక ప్రాంతాల్లో దేవాలయాలు ఉన్నాయి.
వీరభద్రస్వామి కొలువైన కొత్తకొండ
పాత కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి పుణ్యక్షేత్రం తెలంగాణలోని ప్రముఖ శైవాలయాల్లో ఒకటి. ఆసియా ఖండంలో ఖ్యాతికెక్కిన పాల సహకార సంఘం, ముల్కనూరుకు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉందీ క్షేత్రం. తొలుత కొండ మీదనే స్వామి ఉండేవాడంటారు. అయితే భక్తులందరికీ అందుబాటులో ఉండడానికి వీలుగా కొన్ని తరాల క్రితమే కిందికి తీసుకొచ్చారు. ఎత్తయిన కొండ పైనుంచి వీరభద్రుణ్ని జాగ్రత్తగా దింపటానికి చాలా మొత్తంలో దూదిని వాడారట. ఆ పని చేసింది స్థానిక కుమ్మరులే అని స్థల పురాణం చెబుతుంది. అయితే స్వామిని కిందికి దింపే క్రమంలో ఆయన కాలు విరిగినట్లు స్థానికులు చెబుతుంటారు. అందుకే విగ్రహం రెండు కాళ్లు సమానంగాా ఉండవు అంటారు. నిరాడంబరుడైన తెలంగాణ సహజకవి బమ్మెర పోతన రాసిన పురాణేతిహాసమే వీరభద్ర విజయం. విజయానికి చిరునామా వీరభద్రుడేనని ఇంతకన్నా చెప్పాల్సింది లేదంటారు అనుభవజ్ఞులు.
కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయాన్ని రాళ్ల మధ్య నిర్మించారు. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఏడు కోనేరులు నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహిమగా ప్రజలు చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరిలో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందురోజు ఇక్కడ భవ్యమైన జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రధాన ఆకర్షణగా సంక్రాంతి రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు ఎడ్లబండ్లలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నుంచి 10 రోజులపాటు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది.
వీరభద్రుణ్ని ప్రతిష్టించిన వీరబ్రహ్మేంద్రస్వామి
వీరభద్రుడికి వీరబ్రహ్మేంద్రస్వామికి ఓ ఆశ్చర్యకరమైన సామ్యం ఉంది. చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరే.. అని ప్రబోధించిన కాలజ్ఞానకర్త, జగద్గురువు వీరబ్రహ్మేంద్రస్వామి కడప జిల్లాలోని అల్లాడుపల్లెలో స్వహస్తాలతో వీరభద్రుడి శిల్పాన్ని చెక్కి ప్రతిష్టించారు. అల్లాడుపల్లె వీరభద్రుణ్ని దర్శించుకోవడానికి రాయలసీమ నుంచే గాక కర్నాటక నుంచి పెద్దసంఖ్యలో క్యూ కడతారు భక్తులు. తలపెట్టిన పనిని పక్కాగా పూర్తి చేసే శక్తి వీరభద్రుడికి ఉందని.. ఆయన్ని ఆరాధిస్తే శత్రువులపై విజయం ఖాయమని మహానుభావులు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి స్వయంగా వీరభద్రుణ్ని ప్రతిష్టించడం అందుకు ఓ తిరుగులేని తార్కాణంగా భావిస్తారు. కొత్తకొండకు వచ్చే భక్తులు కూడా తాము కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా వీరభద్రుణ్ని కొలుస్తారు.
ఈ సంవత్సరం (2023) జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈఓ కిషన్ రావు చెప్పారు. 10వ తేదీ, మంగళవారం సా. 6-20కి శ్రీ వీరభద్రస్వామి-భద్రకాళీమాత కళ్ యాణం, 14వ తేదీన భోగీ పండుగ, 15వ తేదీ సంక్రాంతి రోజున బండ్లు తిరగడం, 16వ తేదీ నాగవెల్లి, 17వ తేదీ త్రిశూల స్నానం, 18వ తేదీ అగ్నిగుండాలు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయని కిషన్ రావు చెప్పారు.
Really intresting
ReplyDelete👌👌🙏🙏 excellent
ReplyDelete