పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఎవర్ని పలకరించినా గ్రామ దేవతల ఆరాధనా పారవశ్యంతో తడిసిముద్దయిన ఆనందమే తాండవిస్తోంది. కమాన్పూర్లో దాదాపు వారం రోజులపాటు జరిగే బొడ్రాయి ప్రతిష్టాపనా మహోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్లను గ్రామ ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో, సామూహిక వేడుకగా జరుపుకుంటున్నారు.
బొడ్రాయి ప్రతిష్టాపనా కార్యక్రమం అనేది దాదాపుగా తరానికి ఒకసారి జరుపుకుంటారని పెద్దల ఉవాచ. ఒకసారి అలాంటి వేడుక జరిగిన తరువాత మళ్లీ 3, 4 దశాబ్దాల తరువాత గానీ జరుపుకోవడం కుదిరే పని కాదంటారు అనుభవజ్ఞులు. దేశమైనా, గ్రామమైనా ఒక మనిషితో సమానమేనని భారతీయుల తాత్విక చింతన చెబుతుంది. మానవ ఆకారానికి నాభి ఎలాగైతే నవ నాడులకూ ఒక కేంద్ర బిందువుగా ఉంటుందో.. అలాంటిదే గ్రామానికి బొడ్రాయి కూడా. గ్రామం మధ్యలోనే ఈ శిలలను ఏర్పాటు చేస్తారు. అమ్మవార్ల అదే రూపాలను చెక్కబొమ్మలుగా తీర్చిదిద్ది ఉత్సవ విగ్రహాలుగా ఊరేగించడం ఆనవాయితీ. అమ్మవార్ల శుభాశీస్సులు, కరుణా కటాక్షాలు ప్రజలందరి మీదా సమానంగా ప్రసరించాలని వేడుకుంటారు. ఆ తరువాత ఊరంతా సామూహికంగా పండుగ చేసుకొని ఆనందాలు పంచుకుంటారు. ఇళ్లలో జరిగే శుభ కార్యక్రమాల్లో బంధువులంతా కలిసి పాల్గొని బరువు బాధ్యతలు ఎలాగైతే పంచుకుంటారో.. బొడ్రాయి పండుగను కూడా ఊరంతా ఒక మహోత్సవంగా జరుపుకోవడం భారతీయుల తత్వ చింతనలోని ఒక విశేషంగా చెప్పుకుంటారు.
ఇలాంటి గ్రామ వేడుకల వల్ల ఆ గ్రామ ప్రజల మధ్య ప్రేమానురాగాలు, పరస్పర విశ్వాసాలు బలపడతాయి. ఒకరి గురించి మరొకరికి అవగాహన పెరుగుతుంది. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వెంటనే స్పందించి ఆపన్న హస్తం అందించే ఐక్యతా గుణం ఏర్పడుతుంది. ఇలాంటి వేడుకలు జరుపుకోవడం వల్ల గ్రామంలో కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, ఊరి సంప్రదాయాల పట్ల ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. జన్మభూమి పట్ల మరింత బాధ్యతను, మరింత అనురాగాన్ని పెంపొందించే బొడ్రాయి వేడుక కోసం అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు, దూరపు బంధువులు సైతం కలుసుకోవడం ఒక సంప్రదాయం.
కమాన్పూర్ లో ఇలాంటి అరుదైన వేడుకను బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోందని, ప్రజల క్షేమం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఊళ్లోని వలంటీర్లు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు ఎంతగానో సహకరిస్తున్నారని సర్పంచ్ నీలం సరిత, శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ ఇదే ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment
Your Comments Please: