Skip to main content

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. 

Also Read: తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం

Also Read: హైదరాబాద్ రెండో రాజధాని?

"పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంతకన్నా ఉదాత్తంగా.. ఆయన చనిపోయినప్పుడు నలుగురికి బదులు.. నాలుగు కోట్ల తెలంగాణ సమాజమే కన్నీరు కార్చింది. అలాంటి బతుకును ఎంతమంది బతగ్గలరు? 

ప్రొఫెసర్ జయశంకర్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదేమో అనేంత నిష్టగా ఆయన ఉద్యమ జీవితం గడిపారు. 1934, ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో ప్రొఫెసర్ జయశంకర్‌ ఓ నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు. అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్ల మధ్య ఆయన రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే జీవితాన్ని ధారవోసిన ఆజన్మ బ్రహ్మచారిగా జనం గుండెల్లో నిలిచిపోయారాయన. 2011లో జూన్ 21న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచేదాకా.. ఆయన ఏనాడూ తెలంగాణ తప్ప మరో మాట మాట్లాడలేదంటే అతిశయోక్తి కాదంటారు ఆనాటి ఉద్యమకారులు. 

1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనే గాక.. అంతకు ముందు 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు. వరంగల్ లో ఉపాధ్యాయ బదిలీలపై తలెత్తిన అభ్యంతరాలు హైదరాబాద్ లోని సిటీ కాలేజ్ కాల్పుల దాకా విజృంభించాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ మీద స్వతంత్రంగానే కొనసాగింది. ఆ తరువాత పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశారు. దీంతో దేశం మొత్తానికీ వర్తించే రూల్స్ హైదరాబాద్ కు వర్తించాయి. స్థానిక విద్యగా తెలుగు వచ్చేసింది. కానీ అప్పటికి హైదరాబాదీలు అంతా చదివింది ఉర్దూ మాధ్యమంలోనే. దీంతో అవకాశాలు ఆంధ్రా వాళ్లను వరించడం మొదలుపెట్టాయి. అక్కడంతా ఇంగ్లిష్, తెలుగులోనే విద్యార్జన జరిగింది కాబట్టి.. కొలువున్నీ వారే ఎగరేసుకుపోవడం ప్రారంభమైంది. హైదరాబాదీల అవకాశాలన్నీ చేజారడం మొదలైంది. చదివిన చదువుకు అర్థం లేకుండా పోయింది. ఇదే హైదరాబాదీ విద్యావంతులకు ఆగ్రహం తెప్పించింది. అలా హన్మకొండలో మొదలైన విద్యావంతుల నిరసన హైదరాబాద్ కు పాకింది. నాన్ ముల్కీస్ గో బ్యాక్, ఇడ్లీ-సాంబార్ గో బ్యాక్ అంటూ స్థానిక విద్యార్థులు నినదించారు. అప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో 10 మంది దాకా మరణించారని అంచనా. అయితే అన్ రికార్డెడ్ గా ఇంకా చాలానే మంది చనిపోయారని చెబుతారు. ఎందుకంటే కాల్పుల్లో చనిపోయినవారి శవాలను కూడా ఇవ్వడానికి కూడా ఆనాటి సర్కారు అంగీకరించలేదు. దీనివల్లే ఉద్యమం మరింత ఉధృతంగా జరిగిందంటారు. ఆనాటి ఇడ్లీ-సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో తనలాగే చాలామంది విద్యార్థులతో కలిసి జయశంకర్ పాల్గొన్నారు. హన్మకొండ నుంచి విద్యార్థులు, లెక్చరర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ లో నిరసనల కోసం బయల్దేరినప్పుడు.. పోలీసులు వారిని మధ్యలోనే అడ్డగించారు. ఆ విధంగా జయశంకర్ భావి ఉద్యమ జీవితానికి ఆనాటి ఘటన తోడ్పడిందంటారు. 

ఒక న్యాయమైన డిమాండ్ కోసం గళమెత్తిన విద్యార్థులను ఆనాటి సర్కారు పొట్టన పెట్టుకుందన్న ఉద్దేశంతో జయశంకర్ కలవరపడిపోయారు. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకుంటూ.. ఒక సందర్భంలో జయశంకర్ ఏమన్నారంటే.. ఆనాటి కాల్పుల్లో పోయినా.. ఈనాటి దురాగతాలు చూడాల్సి వచ్చేది కాదని. అలాంటి తీవ్రమైన మనోవేదన నుంచే జయశంకర్ ఇక భవిష్యత్తులో తన జీవితమంతా ప్రత్యేక తెలంగాణ సాధించడానికే అంకితమివ్వాలని నిర్ణయించుకున్నారట. 

ఇలా ఇడ్లీ-సాంబార్ గోబ్యాక్ నుంచి మొదలైన జయశంకర్ ఉద్యమ జీవితం.. 1969లో తెలంగాణ తొలి ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనేలా చేసింది. 2001లో మొదలైన మలి దశ పోరాటానికి మార్గదర్శకత్వం వహించేలా చేసింది. అయితే తెలంగాణకు ఓ ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం ఉంది. నిజాం పాలనా సమయంలోనే నిజాంకు, ఆయన బంట్లు అయిన రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం ఉంది. ఇటు నిజాం మత రాజ్య భావనలకు వ్యతిరేకంగా జాతీయవాద దృక్పథంతో వందేమాతరం అంటూ నినదించిన చరిత్ర కూడా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రజాపోరాటాలు నిర్వహించిన లెఫ్ట్ తో పాటు.. నిజాం వేర్పాటు కుట్రలను జాతీయవాదంతో మాత్రమే ఎదుర్కోగలమని జాతీయగీతం, వందేమాతర గీతాలాపన చేసి యూనివర్సిటీల నుంచి బహిష్కృతులైన పీవీ నరసింహారావు లాంటి మహనీయుల నేపథ్యం కూడా ఉంది. ఈ ప్రాంతానికి ఉండే నేపథ్యాన్ని చక్కగా అర్థం చేసుకున్న ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణ సంకెళ్లు వీడిపోవాలంటే ఆ రెండు శక్తులూ అవసరమేనన్న అవగాహన కలిగి ఉన్నారు. ఆ ఇద్దరినీ సమన్వయం చేసుకుంటూ.. తాను అనుకున్న తెలంగాణ స్వప్న సాఫల్యం కోసం అహరహమూ శ్రమించారు. 

హైదరాబాద్ విలీనం తరువాత పాలన అంతా ఆంధ్రా నాయకుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో రిక్రూట్మెంట్లలో స్థానికులకు అన్యాయాలు మరింత పెరిగాయి. ఆంధ్రా పాలకుల వివక్ష అనేది కొలువులకు మాత్రమే పరిమితం కాకుండా నీళ్లు తరిలంచుకుపోవడానికీ పాకింది. తెలంగాణ భూములను ఇష్టారీతిన ఇష్టమొచ్చిన వ్యక్తులకు కట్టబెట్టడం వంటి నిర్ణయాలు పుష్కలంగా జరిగిపోయాయి. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆనాటి కాంగ్రెస్ సీనియర్ నేతలు చెన్నారెడ్డి లాంటివారు టీపీఎస్ ను స్థాపించి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఢిల్లీకి చాటి చెప్పేలా చేశారు. అత్యధిక సీట్లు టీపీఎస్ గెలుచుకున్నప్పటికీ.. ఆ తరువాత టీపీఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయడంతో జయశంకర్ ఆలోచన పంథా మారిపోయింది. తెలంగాణ ఉద్యమాన్ని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అణచివేస్తుందని.. అలా జరగకుండా తెలంగాణ డిమాండ్ సజీవంగా ఉండాలంటే ప్రజల్లో అవగాహన పెంచడమే మంచిదని భావించారు. అందుకే.. భుజాన సంచీ తగిలించుకొని ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రజలు గుర్తించేలా చేసేందుకే కంకణం కట్టుకున్నారు. విస్తృతంగా పుస్తకాలు రాశారు. తెలంగాణ అంతటా సభలు, సమావేశాలు ఏర్పాటు చేయించారు. పత్రికలకు వ్యాసాలు రాశారు. ఎడిటర్లతో మాట్లాడి తెలంగాణ న్యాయమైన డిమాండ్ ను గుర్తించాలని విజ్ఞప్తులు చేశారు. ఇలా ఉద్యమ వ్యాప్తి కోసం జయశంకర్ ఎన్ని చేయాలో అన్నీ చేశారు. 

ఉద్యమ ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేళ.. తెలంగాణ అనేది కేవలం రాజకీయ నినాదంగా మారి.. అన్ని పార్టీలు సైతం పోటీ పడి వంచన చేస్తున్న క్రమంలో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి-టీఆర్ఎస్ పేరిట ఓ కొత్త పార్టీ పురుడు పోసుకుంది. అప్పటికి టీడీపీలో క్రియాశీలంగా ఉన్న కేసీఆర్, చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిగా ఉన్న కేసీఆర్.. తెలంగాణ డిమాండ్ ను ఎత్తుకున్నారు. తెలంగాణ ఆకాంక్ష తీరాలంటే అందుకోసం ప్రత్యేకంగా పనిచేసే ఓ పార్టీ అవసరం అన్న అవగాహనతో ఉన్న జయశంకర్.. కేసీఆర్ కు పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. దీంతో టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమం, ఉద్యమం అంటే టీఆర్ఎస్ అన్న అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. కేసీఆర్ పిలుపిస్తే అది తెలంగాణ ఉద్యమ పిలుపుగా ఉండేది. కేసీఆర్ కు ముందూ, వెనకానే గాక మేధాపరంగానూ ఆయనకు గైడ్ గా వ్యవహరించింది ప్రొఫెసర్ జయశంకర్ సారేనని అంతా ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. 

టీఆర్ఎస్ అంటే నేటి బీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత జయశంకర్ మేదాశక్తి, కేసీఆర్ వ్యూహ చాతుర్యం, ప్రజల్లో ఉండే బలమైన ఆకాంక్ష కారణంగా రోజురోజుకూ ఉద్యమం బలపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ పరంపర మొదలెట్టిన బీఆర్ఎస్.. క్రమంగా పార్లమెంట్ లో గళం వినిపించేదాకా ఎదిగింది. ఉద్యమ ప్రభావంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ కార్యాచరణను ప్రారంభిస్తున్నాం అంటు ప్రకటించేదాకా వెళ్లింది. అయితే ఆ తరువాత అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో ప్రాంత ప్రజల్లో నైరాశ్యం అలముకుంది. అయితే ఇక తెలంగాణ సాధ్యమేనని.. ఒకసారి ప్రకటన ఇచ్చి వెనక్కి వెళ్లినా అది తాత్కాలికమేనని.. ఇక్కడిదాకా లాక్కొచ్చిన ఉద్యమాన్ని మరింత స్ఫూర్తిమంతంగా నిర్వహించాలని జయశంకర్ చెబుతూ ఉండేవారు. ఈ స్టేజ్ దాకా వచ్చిన తెలంగాణను ఇక ఎవరూ ఆపలేరని.. ఇప్పుడది ప్రజల చేతుల్లోకి వెళ్లిందని.ి. రాజకీయ పార్టీలు కేవలం సాధనా పరికరాలు మాత్రమే తప్ప.. నిర్ణేతలు కారని అసలైన కీపాయింటును ప్రజల్లోకి ఎక్కించారు. తెలంగాణ సాకారాన్ని తాను కళ్లారా చూడలేకపోయినా.. అందుకు తగిన భూమిక ఏర్పరిచానన్న తృప్తితోనే జయశంకర్ కన్ను మూశారు. అప్పటికే ఆయనకు సోకిన క్యాన్సర్  మరింత ముదరడంతో.. 2011 జూన్ 21న ఈ లోకం విడిచారు ప్రొఫెసర్ జయశంకర్. 

ప్రొఫెసర్ జయశంకర్ లాంటివారు ఎంతో నిబద్ధతతో ఉద్యమం నడిపి.. ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ దాకా చేరవేసి.. తెలంగాణ జాతిపిత అన్న పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే అలాంటి జయశంకర్ పేరు గానీ, ఉద్యమ చరిత్ర గానీ క్రమంగా కనుమరుగవుతోందన్న అభిప్రాయాలు తెలంగాణ మేధావుల్లో, తెలంగాణ రాజకీయ నేతల్లో వినిపిస్తున్నాయి. జయశంకర్ మార్గదర్శనంలో పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాం వంటి విద్యావంతులు.. జయశంకర్ తరువాత ఆ పాత్రలోకి సులభంగా ఇమిడిపోతారన్న పేరు సంపాదించుకున్నారు. అయితే రాజకీయ పార్టీలు తమ సంకుచిత ప్రయోజనాలు కాపాడుకునే క్రమంలో అసలైన తెలంగాణవాదులకు, నికార్సయిన ఉద్యమకారులకు చోటు దక్కకుండా చేస్తున్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

తెలంగాణలో తెలంగాణవాదం లేకుండా బతికి బట్ట కట్టలేమన్న సోయిని అన్ని పార్టీలకూ కలిగించిన ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి అటు జాతీయవాదులకు అయినా, ఇటు లెఫ్ట్ పార్టీలకు అయినా శిరోధార్యమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సైద్ధాంతిక భావజాలాన్ని బట్టి కాక.. ప్రజల అవసరాలను బట్టే రాజకీయ నిర్ణయాలు ఉంటే.. ఏ లక్ష్యమైనా విజయవంతం అవుతుందని జయశంకర్ నిరూపించారంటారు విశ్లేషకులు. మరి ఇప్పుడైనా ఆ స్ఫూర్తిని మిగతా రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తాయా? వేచిచూద్దాం. 
- భాగ్యనగర్ పోస్ట్, హైదరాబాద్.


Comments

Popular posts from this blog

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, కేంద

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.