నాలుగు దశాబ్దాల క్రితం దూరదర్శన్లో మహాభారత్ వచ్చినప్పుడు ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఆ తరువాత రామాయణం వచ్చినప్పుడూ అంతే మైమరచిపోయి ఆస్వాదించారు. కొన్నేళ్లుగా వస్తున్న తాజా మహాభారత్ కు కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఇతిహాస ఇతివృత్తాలపై ఎందరు ఎన్నిసార్లు సినిమా తీసినా ఆదరించే భారతీయులు.. తాజా ఆదిపురుష్ పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?
ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడాన్ని ఎవరూ ఇష్టపడరు. వినడానికి చేదుగా ఉన్నా, జీర్ణించుకోవడానికి కఠినంగా ఉన్నా.. ఆదిపురుష్ సినిమా దేశవ్యాప్తంగా వెలగబెడుతున్న నిర్వాకం మాత్రం ఇదే విషయాన్ని రూఢి చేస్తుందంటున్నారు సినీ అభిమానులు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ డిజాస్టర్ ను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. బాహుబలి వంటి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ని, తన ఇమేజ్ ని అమాంతం పెంచుకున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ కూడా అంతకుమించి అనేంతగా ఉంటుందని అంతా ఊహించారు. సనాతన భారతీయ సాహితీ సాంస్కృతిక విలువలకు ఆదిపురుష్ లో పట్టం కడతారని.. అంతర్జాతీయ రేంజ్ కు ఎదిగిన తెలుగు సినిమా.. తాజా సినిమాతో కొత్తపుంతలు తొక్కుతుందని ఆశపడ్డారు. అయితే అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అన్నట్టుగా ఆదిపురుష్ టాక్ అధ్వానంగా తయారైంది.
భారతీయులకు రామాయణం కొత్త కాదు. కానీ ఎవరు ఎన్ని సార్లు చెప్పినా ఇంకా ఏదో కొత్తదనం, కొత్తకోణం ఉంటుందని రామ భక్తులు ఆశిస్తారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని రామాయణాలనూ అలాగే ఆస్వాదించారు. రామాయణం మీద వచ్చిన విమర్శనాత్మక గ్రంథాలను సైతం ఆ కోణంలో చదివి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ రాముణ్ని ఈ తరహాలో చూపించిన వైనాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ రాముణ్ని విమర్శించాల్సి వస్తే.. క్యారెక్టర్ పరంగా విమర్శించడం వేరు. కానీ రాముణ్ని గానీ, రామాయణంలోని ఇతర పాత్రలను గానీ అసలు మూలానికి దూరంగా విసిరేసినట్టుగా చిత్రీకరించారన్న విమర్శలు ఈ సినిమా మూటగట్టుకుందంటున్నారు. విడుదలైన తొలి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఆదిపురుష్.. సమయం గడుస్తున్నకొద్దీ, అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టినకొద్దీ రియల్ ఒపీనియన్స్ వెల్లువెత్తాయి.
అదీ తొలిరోజు ప్రభాస్ ఫ్యాన్స్ స్పందన. అయితే ఆదిపురుష్ మీద అంచనాలు భారీగా పెంచుకున్న తెలుగు ప్రేక్షకులు.. మొహమాటానికో లేక గ్రహపాటుకో గానీ.. సినిమా బావుందనే అన్నారు. కానీ రెండోరోజు, మూడోరోజు పోయేసరికి ప్రేక్షకుల ఓపిక, సహనం నశించాయి. రామాయణాన్ని పరమచెత్తగా చిత్రీకరించిన వైనాన్ని వారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. సినిమా నిర్మాణాన్ని ప్రయత్న లోపంగా భావించినప్పుడు డైరెక్టర్ ను, నిర్మాతను, డైలాగ్ రైటర్స్ ను వారు క్షమించినా.. అసలు చిత్తశుద్ధిలోనే లోపముందన్న విషయం వెలుగు చూడడంతో వారు ఉపేక్షించలేకపోయారు. తెలుగునాట కంటే హిందీ రాష్ట్రాల్లో ఆదిపురుష్ సినిమా టీమ్ మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది. ఢిల్లీ, ముంబై, లక్నో, ఉదయ్ పూర్ వంటి చాలా చోట్ల సినిమాలను ఆడనివ్వలేదు. తక్షణమే సినిమా ప్రదర్శన నిలిపివేయాలని హిందూ సంఘాలు, సనాతన ధర్మ ప్రేమికులు రోడ్డెక్కారు.
ఆందోళనల ఫలితంగా 3వ రోజు థియేటర్లు బోసిపోయాయి. ప్రేక్షకుల దెబ్బకు దిగొచ్చిన ఓమ్ రౌత్.. వివాదాస్పదంగా కనిపించిన పలు డైలాగ్ లను వారం రోజుల తరువాత ఎత్తేస్తామని ప్రకటించారు. మరోవైపు.. భారత్ సన్నిహిత దేశమైన నేపాల్.. 3 రోజుల్లోగా ఆ డైలాగ్ లను మార్చాలంటూ హుకుం జారీ చేసింది. లేకపోతే ఈ ఒక్క ఆదిపురుష్ మాత్రమే కాదు.. అసలు ఇండియా సినిమాల్నే నేపాల్ లో ఆడకుండా చేస్తామన్నారు. అసలు నేపాల్ ఎక్కడ హర్ట్ అయిందంటే.. సీతమ్మ జన్మస్థలాన్ని భారత్ గా చెప్పడమేనట. సీత పుట్టింది నేపాల్లో అయితే భారత్ లో పుట్టినట్టు ఎలా చూపిస్తారు అంటూ నేపాల్ పాలకులు లా పాయింటు లాగారు.
ఒక స్పిరిచ్యువల్ మూవీ చూడాలనుకొని.. ఆ స్పిరిచ్యువల్ మూవీని లేటెస్ట్ టెక్నాలజీలో ఎంత హృద్యంగా చిత్రీకరిస్తారో చూడాలనుకొని థియేటర్ కు వెళ్తే.. అసలు తాము ఆనందించే సన్నివేశం ఒక్కటి కూడా లేదన్న అభిప్రాయాలు ప్రేక్షకుల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. అసలు సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం. ఆదిపురుష్ అంటూ రాముడి బొమ్మతో ఊదరగొట్టారు డైరెక్టర్ ఓం రౌత్. ఆ రాముడి పాత్రలో అందాల ఆజానుబాహుడు అయిన బాహుబలి ఫేమ్ ప్రభాస్ ను చూపించారు. దీంతో సినిమా అంతా.. రాజమౌళి రేంజ్ లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని అంతా ఆశించారు. ఎవరైనా అదే ఊహిస్తారు కూడా. కానీ సినిమాలో మాత్రం అసలు రామాయణం కాదు కదా.. కొసరు రామాయణాన్ని కూడా సరిగా చూపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాముడి పాత్రకు ప్రభాస్ బాగానే కుదురుతాడు అనిపించినా.. ప్రభాస్ ను యాక్షన్ మూవీలో చూపించినట్టుగా ఉందన్న టాక్ వచ్చింది. రాముడి గొంతులో వినిపించే మార్దవం గానీ, రాముడి నడకలో ఉండే సౌమ్యం గానీ, ముఖ కవళికల్లో కనిపించాల్సిన సహజత్వం గానీ ఎక్కడా లేవన్న విమర్శలు క్రిటిక్స్ నుంచి వినిపిస్తున్నాయి. జానకి లాంటి రాజకుమారి ఉండాల్సింది రాజభవనంలో తప్ప అడవుల్లో కాదనే డైలాగ్ చెప్పేటప్పుడు గానీ, ఆ తరువాత సీత చెప్పే డైలాగ్ సందర్భంలో గానీ.. ప్రభాస్ అత్యంత పేలవమైన హావభావాలు ప్రదర్శించాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో సీతను చూపించిన విధానం కూడా ఆక్షేపణీయంగా ఉందంటున్నారు సీతాదేవి భక్తులు. సీతతో మాట్లాడేటప్పుడు తొంగిచూడాల్సిన సున్నితత్వం రాముడిలో ఎక్కడా కనిపించకపోవడాన్ని తెలుగు ప్రేక్షకులు ఇట్టే పసిగట్టేశారు.
తెలుగు ప్రేక్షకులకైనా, యావత్ భారత ఇతిహాస ప్రేమికులకైనా రాముడు ఎలా ఉంటాడో కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తెలుగువారికైతే ఎన్టీఆర్ కన్నా ముందే రాముడి పాత్రలో ఒదిగిపోయిన రవికుమార్ ఉన్నారు. ఎన్టీఆర్ తో సరిసమానంగా రాముడంటే ఇలా ఉండాలి అనిపించిన హరనాథ్ గురించి తెలియని పాతతరం ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. సీనియర్ ఎన్టీఆర్ గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వారు కాకుండా రాముడిగా శోభన్ బాబు, సుమన్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి పాత్రల ద్వారా రాముణ్ని తెలుగు ప్రేక్షకులు తమ సొంతింటి బిడ్డగానే భావిస్తారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల తీసిన రామాయణం సినిమాలో సీతగా నటించే అవకాశం గ్లామర్ తార నయనతారకు వచ్చింది. సీతగా నయన్ నటిస్తుందనగానే చాలా మంది ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే నయన్ ను చూసిన తీరు వేరు. అలాంటి నటి సీత పాత్రలో ఎలా మెప్పిస్తుంది.. ప్రేక్షకుల నుంచి మార్కులు కొట్టేస్తుందా లేదా అన్న అనుమానాలు వచ్చాయి.
కానీ సినిమాలో నయన్ నటించిన తీరును ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. అందుక్కారణం ఆ పాత్రను నయన్ ఎంతో పవిత్రంగా భావించి.. దానికి న్యాయం చేయాలన్న తపనే అంటారు సినీ క్రిటిక్స్. అసలు సీత పాత్రలో నటించే అవకాశం రావడాన్నే ఊహించలేకపోయిన నయనతార... అది ఈ జన్మకు దక్కిన అద్భుతమైన అవకాశంగా భావించి కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను అబ్బురపరచింది. సీతగా మెప్పించడానికి నయన్ ఎంత కృషి చేసిందో.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో.. ఎంత తపస్సు చేసిందో ఎవరికి తెలుసు? నయన్ కన్నీళ్లు తప్ప.. ఆ అంశాన్ని వివరించే ఘట్టాలేవీ బయట కనిపించవు మరి. అలా ఉంటుంది సీత పాత్ర. ఆ స్థాయికి ఏమాత్రం తగ్గినా.. తగ్గినట్టు చూపించినా.. ఎవ్వరూ తట్టుకోలేరు. ఇప్పుడదే జరిగింది. మరి ఆదిపురుష్ లో సీతను చూపించిన తీరు ఎలా ఉంది. సీతను ఉన్నతమైన రోల్ నుంచి గ్లామర్ రోల్ లోకి దిగజార్చేలా చేసినట్టు కనిపించడం లేదూ? ఇది ప్రేక్షకుల సెంటిమెంట్స్ ను హర్ట్ చేయడం కాకపోతే ఏమిటి.. అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓం రౌత్ దుస్సాహసమా? మనోజ్ ముంతశిర్ వాచాలత్వమా?
ఆదిపురుష్ లో రామాయణాన్ని బాలకాండం నుంచి గాక.. అరణ్య కాండం నుంచి యుద్ధకాండ వరకు మాత్రమే ఫోకస్ చేశారంటున్నారు. అంటే రామాయణాన్ని తొలి నుంచీ గాక.. కిడ్నాపులు, ఫైటింగ్, రావణుడితో ఢీకొనడం, లంకాదహనం వంటి యాక్షన్ పార్టుకే ప్రాధాన్యం ఇచ్చారని.. అది కూడా అత్యంత పేలవంగా చూపించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సరే.. సెలెక్టివ్ పార్టు.. యుద్ధకాండ వరకే తీసుకున్నా.. ఆంజనేయుణ్ని గానీ, రాముణ్ని గానీ, రావణుణ్ని గానీ చూపించిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాముడి పాత్ర మీద ప్రేక్షకులకు భక్తి వెల్లివిరుస్తుంది. అలాగే రావణుడు విలన్ క్యారెక్టరే అయినా.. సీత మినహా మిగతా చోట్ల ఒక పౌరాణిక విలన్ లాగే కనిపిస్తాడు తప్ప.. బొట్టు లేకుండా, కళ్లకు కాటుకో, ప్యాంటు లాంటి వస్త్రధారణతో యాక్షన్ మూవీల్లో ఉండే బాడీ లాంగ్వేజ్ తో ఎక్కడా రావణుడు కనిపించడు. రావణుణ్ని చూడగానే శివభక్తుడు అన్న ఫీల్ కలగాలి. ఇక కొండచిలువలు రావణుడికి మసాజ్ చేయడం ఎక్కడైనా కన్నామా? విన్నామా?
ఆంజనేయుడి చేత యాక్షన్ మూవీ డైలాగులు పలికించిన తీరుతో ఆ పాత్ర మీద ఫీలింగే మారిపోతోంది. కోతుల స్థానంలో చింపాంజీలను చూపించిన వైనం.. విమర్శల పాలవుతోంది. అయితే విచిత్రంగా ఏంటంటే.. ఆంజనేయుడు పలికిన డైలాగులు గానీ, రాముడు పలికిన మాటలు గానీ.. రామాయణంలోని పాత్రలు పలికినట్టుగా ఎక్కడా కనిపించవు. దీనికి డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ ఏమంటాడంటే.. ఆ మాటలన్నీ చిన్నప్పుడు తాను గ్రామంలో విన్నవేనని.. రాముణ్ని, ఇతర పాత్రలను లోకలైజ్ చేసేందుకు, నేటి తరానికి రామాయణాన్ని దగ్గర చేసేందుకే అలాంటి డైలాగులు వాడానని సమర్థించుకున్నారు. తాను చేసిన ప్రయత్నమంతా భావి తరాలకు రామాయణాన్ని చేరువ చేస్తుందని చెప్పుకొచ్చారు. తీరా విమర్శలు, ఆందోళనలు పెరిగాక.. డైలాగులు కత్తిరించడానికి పూనుకున్నాడు. ఆ తరువాత తనకు రక్షణ కావాలంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి ఇలాంటి డైలాగులను మనోజ్ ముంతశిర్ ఎందుకు ఎంచుకున్నాడు? కాకతాళీయంగానే ఎంచుకున్నాడా లేక మరేదైనా కారణముందా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
ఈ సినిమాకు ఆదిపురుష్ అనే టైటిల్ ఎందుకు పెట్టారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. రాముణ్ని ఆదిపురుషునిగా పేర్కొంటే.. మరి అంతకు 50 తరాలకు ముందు ఇక్ష్వాకు దాకా ఉన్న మహామహులను ఏమనాలి? త్రేతాయుగంలో రాముడి నుంచి కృతయుగంలోని హరిశ్చంద్రుని వంటి ఎందరో గొప్ప క్యారెక్టర్లు సూర్యవంశంలో ఉన్నారు. వారందరివీ వర్ణించనలవి కాని అమలిన క్యారెక్టర్లు. ఒక్కొక్కరూ ఒక్కో చరిత్రకు మూల పురుషుల్లాంటివారు. ఏ రామాయణంలోనూ రాముణ్ని ఆదిపురుషుడిగా చెప్పలేదంటున్నారు సినీ విమర్శకులు. అంటే బేస్ లేకుండా రాముడికి ఒక విశేషాన్ని జత చేసి.. ఆ పాత్ర చిత్రణలో మాత్రం తీవ్రమైన అన్యాయం చేశారంటున్నారు. అంతేకాదు.. ప్రభాస్ కు వేసిన వేషాన్ని బట్టి రాముణ్ని చూపించబోయి ఏసుప్రభువును చూపించారన్న విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా చెలామణీ అవుతున్నాయి. అటు రావణుడిగా సైఫ్ అలీఖాన్ ను చూపించబోయి.. బొట్టు లేకుండా, కళ్లకు కాటుకను పెట్టి అచ్చమైన సాయిబును చూపించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవే తప్ప.. ప్రయత్నలోపంగా దొర్లిన పొరపాట్లు కావన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకు మనోజ్ ముంతశిర్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకున్నట్టుగా చెబుతున్న ఓ క్లిప్పింగ్ కూడా హల్చల్ చేస్తోంది.
మనోజ్ శుక్లా అనే ఈ ఆదిపురుష్ డైలాగ్ రైటర్.. చెబుతున్నదేమంటే.. తన మీద ఉర్దూ ప్రభావం, ఉర్దూలోని ముషాయిరాల ప్రభావం క్రమంగా పడిందని.. ఇంటికి వెళ్లినా కూడా అదే తనపై బలంగా పని చేసిందని చెబుతున్నాడు. తండ్రి పురోహితుడని.. అతను రోజూ ఉదయాన్నే లేచి శివనామ స్తోత్రం పారాయణం చేసేవాడని.. దానికి పోటీగా తాను ఉర్దూ ముషాయిరాలను కూడా అంతే పిచ్ లో పాడుకునేవాణ్ని అని చెబుతున్నాడు. మనోజ్ శుక్లా స్థానంలో పెన్ నేమ్ గా మనోజ్ ముంతశిర్ గా మార్చుకున్నానని.. క్రమంగా ముంతశిర్ గా స్థిరపడిపోవడం సులువు అవుతుందంటూ తనలో గూడు కట్టుకున్న ఇస్లామిక్ పక్షపాతాన్ని సరదాగా బయట పెట్టుకోవడం విశేషం. మరి అందుకే.. రాముణ్ని, రావణుణ్ని, హనుమంతుణ్ని.. ఇలా చాలా క్యారెక్టర్లను సైతం ఇస్లామిక్ షేడ్స్ తొంగిచూసేలా చూపించాడా అన్న అనుమానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.
hmtv youtube link: ఆదిపురుష్ పై వివాదాలు ఎందుకు?
మరి ఏమాశించి రామాయణాన్ని ఇలా భ్రష్టు పట్టించాల్సి వచ్చిందీ.. అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం దొరకదు. కొన్ని కలెక్టివ్ యాక్షన్స్ మధ్య డాట్స్ ని జాగ్రత్తగా కలిపితే తప్ప వాటిని అర్థం చేసుకోవడం సులభం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు ప్రజలంతా ఆరాధించే రామాయణంలోని డైలాగులను తమ గ్రామాల్లో చెప్పుకునే మామూలు మాటలతో తెరకెక్కించడంలోనే కుట్రకోణం దాగుందన్న అభిప్రాయాలున్నాయి. గ్రామీణ జనం సరదాగా మాట్లాడుకునే మాటల్ని క్యారెక్టర్ల చేత పలికించడం అనే ఆలోచనే.. రైటర్ మనసులో రామాయణం పట్ల ఉన్న తేలిక భావనకు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. అదీగాక.. తాను ఏ కుటుంబం నుంచి వచ్చానో దాన్ని గర్వంగా చెప్పుకొని.. ఆ తరువాత తన ప్రయాణం ఎటువైపు సాగుతుందో కూడా గర్వంగా చెప్పుకోవడంలో ముంతశిర్ ఇచ్చిన ట్రీట్ మెంట్ కు నిదర్శనంగా భావించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇదంతా భారత వ్యతిరేకతతో, సనాతన ధర్మం మీద వ్యతిరేకతతో కంటికి కనిపించని కుట్రతో సినిమా తీసే ప్రయత్నమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ జరుగుతున్న తొలిరోజుల్లోనే పోస్టర్ పై విమర్శలు చెలరేగాయి. అయినా వారు మార్చుకోలేదు. తరువాత కొన్ని మార్పులు చేసినట్టు చేసి మళ్లీ యథావిధిగా చేయాల్సిన పని చేసేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రావణుడి తలలు కూడా ముందుగా వరుసగా పెట్టి.. ఆ తరువాత ఆ ప్రయోగం నప్పకపోవడంతో పైనొక వరుస.. కిందొక వరుసలో పేర్చి.. ఏం చేయాలో అర్థం కాక వదిలేసినట్టుగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాత్రలు సైతం నడుస్తున్న తీరు, కదులుతున్న తీరు, డైలాగులు పలికేటప్పుడు హావభావాల్లేని వైనం.. ఇవన్నీ ఒక చారిత్రక సినిమాకు ఏమాత్రం నప్పవు అన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్ చూడగానే కంగనా రనౌత్ ఇదే విషయాన్ని నర్మగర్భంగా నిలదీసింది. వేల ఏళ్ల క్రితం మనుషుల బాడీ లాంగ్వేజ్, ఇప్పటి తరం లాగే ఉండేదా అంటూ.. సినిమా మీద అనేక అనుమానాలను రెయిజ్ చేయడం విశేషం.
మరోవైపు ఎంతో అందగాడైన ప్రభాస్ ను, హాలీవుడ్ రేంజ్ లో మార్కెట్ సృష్టించుకున్న టాలీవుడ్ హీరోని.. ఔట్ స్క్రీన్ చేయాలన్న ఉద్దేశంతోనే బాలీవుడ్ కుట్రలు పన్నిందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బాలీవుడ్ ను మించిపోవడమే కాక.. టాలీవుడ్ సృష్టించుకున్న రేంజ్ తో బాలీవుడ్ అడ్రస్ గల్లంతవుతోందన్న అభిప్రాయాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చాపకింద నీరులా బాలీవుడ్ వర్గాలు.. తమ ఆధిపత్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకే ప్రభాస్ వంటి టాప్ హీరో మీద పగబట్టి ఉంటారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ సినీ నిర్మాతలు హిందువుల సెంటిమెంట్లు గాయపరచడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు ఇప్పుడు పదునెక్కుతున్నాయి. మనోజ్ ముంతశిర్ లోగుట్టుగా చెబుతున్న వీడియో వైరల్ గా మారడంతో.. ఆ అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతర్జాతీయంగా హిందువుల సెంటిమెంట్లు గాయపరచడాన్నే పనిగా పెట్టుకున్నారంటున్నారు పలువురు జాతీయవాదులు. ఈ క్రమంలో సినిమా నిర్మాణం అనే ముసుగేసుకొని ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు భాష్యాలు ప్రకటించేందుకు అవకాశం ఇవ్వరాదని.. అందుకే ఆదిపురుష్ ను దేశవ్యాప్తంగా నిషేధించాలని.. ఆ సినిమాను బయటకు రాకుండా చూడాలన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్... ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి.. నేరుగా ప్రధానమంత్రి మోడీకే లేఖ రాసింది. మోడీ రంగంలోకి దిగాలని.. దేశ సనాతన ధర్మానికి విఘాతం కలుగుతుంటే చూస్తూ ఊరుకోరాదని సినీ వర్కర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది.
మరోవైపు.. ఒక చారిత్రక, సనాతన ధర్మాన్ని మహోన్నతంగా చూపాల్సిన సినిమా ఇంత పేలవంగా, ఇంత వక్రించి ఎలా తీస్తున్నారన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దేశమంతా సీతారాములను మహోన్నతులుగా పూజిస్తారని.. అలాంటి క్యారెక్టర్లను చూసి భక్తులు తల దించుకునేలా చిత్రీకరిస్తున్నా.. అసలు సెన్సార్ బోర్డు ఏం చేస్తోందన్న విమర్శలు బయల్దేరాయి. సినిమా వచ్చాక దాని మీద చర్చించడం ఎందుకు? విమర్శించడం ఎందుకు? నిషేధించాలన్న డిమాండ్లు రావడం ఎందుకు? ఆదిపురుష్ లో అనేక పొరపాట్లు ఉన్నట్టు ఇంత సులభంగా అర్థమవుతున్నా.. అది సెన్సార్ బోర్డు దాటుకొని ఎలా రాగలిగింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా మీద క్రమంగా విమర్శలు పెరిగి, థియేటర్లు వెలవెలపోతున్నా.. తొలి 3 రోజులు మాత్రం కాస్త ఆశావహంగానే కలెక్షన్లు జరిగాయి. అయితే అది ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అని, ఆయన పర్ఫామెన్స్ రాముడిగా ఎలా ఉంటుందో చూడాలన్న ఉద్దేశంతోనే థియేటర్లకు వెళ్లారని.. కానీ సినిమా మీద నెగెటివ్ మౌత్ టాక్ నానాటికీ పెరుగుతుండడంతో.. నిర్మాతలకు భారీ లాస్ తప్పదంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ పై అంచనాలు క్రమంగా తల్లకిందులవుతుండగా.. ఎన్నో అంచనాల మధ్య రూపొందించిన ఆదిపురుష్ కూడా బాక్సాఫీస్ దగ్గర గల్లంతయితే.. ఇక బాలీవుడ్ ఏ దిశగా ప్రయాణించాలి? ఈ పొరపాటు నుంచి బాలీవుడ్ టీమ్ పాఠాలు నేర్చుకుంటుందా? పాత అంచనాలకు చేరుకుంటుందా? కాలమే జవాబు చెప్పాలి.
Comments
Post a Comment
Your Comments Please: