రేసు మళ్లీ మొదలైంది. రేసు పాతదే అయినా.. ఎప్పుడూ సరికొత్తగా ఉండేలా చూసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి. సెప్టెంబర్ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీల మధ్య ఇదో ప్రహసనంగా మారిందన్న తేలిక భావం కూడా ఏర్పడిందన్న అభిప్రాయాలున్నాయి. సెప్టెంబర్ 17 అనేది చారిత్రక ప్రాధాన్యత ఉన్న రోజే కాదు.. తెలంగాణ ప్రజలకు ఎంతో ఘనమైన సెంటిమెంట్ కూడా దీంతోనే ముడివడి ఉంది. తెలంగాణలో అధికార పార్టీ ఈసారి మళ్లీ ఎలాగైనా గెలిచి తీరేందుకు కసరత్తు చేస్తుంటే.. అటు విపక్షాలు కూడా తమ కలను సాకారం చేసుకునేందుకు అదే తరహాలో ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 17ను ఏ పార్టీ ఏవిధంగా నిర్వహించాలని చూస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.
సెప్టెంబర్ 17వ తేదీకి ఉండే ప్రాధాన్యత ఈనాటిది కాదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 13 నెలల తరువాత గానీ హైదరాబాద్ సంస్థానం విలీనం జరగలేదు. అంటే భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17వ తేదీన కలిసిపోయింది. అప్పటిదాకా హైదరాబాద్ అనేది ప్రత్యేక సంస్థానంగా, ప్రత్యేక సైన్యం, ప్రత్యేక రైల్వే, ప్రత్యేక ఆర్టీసీ వంటి అనేక సౌకర్యాలతో ఉనికి చాటుకుంది. అనేక పోరాటాల ఫలితంగా, ఎందరో అమాయకుల ప్రజల బలిదానం ఫలితంగా, అనేక జాతీయవాద సంస్థల రాజనీతి ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైంది. అయితే అది విలీనమా? విమోచనమా? విద్రోహమా? అనే దృష్టికోణం తాలూకు విభేదాలు అప్పట్నుంచే కొనసాగుతూ వస్తున్నాయి. భావజాల పరమైన అలాంటి భేదాలు ఇప్పటికీ కొనసాగుతుండగా.. ఆ టైటిల్స్ కు గతేడాదే మరో 2 కూడా తోడయ్యాయి. అవేంటంటే.. ఇక్కడి అధికార బీఆర్ఎస్ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతూ ఉంటే.. జాతీయ కాంగ్రెస్ మాత్రం హైదరాబాద్ స్వాతంత్ర్య దినోత్సవంగా జరిపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ కారణంగా సెప్టెంబర్ 17కు మరింత ప్రాధాన్యత ఏర్పడడమే కాదు.. ప్రజల్లో అంతకుమించిన కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతోందంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.
Read this also: సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం
తెలంగాణలో ఏ పార్టీ ఎక్కడెక్కడ, ఎలాంటి కార్యక్రమాలకు ప్లాన్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఎప్పటిలాగే కేంద్రంలోని అధికార బీజేపీ పెద్దలు సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్ లో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ విలీనాన్ని బీజేపీ నేతలది మొదట్నుంచీ విమోచనా దినంగానే పరిగణిస్తున్నారు. శతాబ్దాలపాటు తెలంగాణ ప్రజలు నిజాం ప్రభువుల దాష్టీకంలో మగ్గిపోయారని.. రజాకార్ల అణచివేతను సంస్థానంలోని ప్రజానీకం మొత్తం అనుభవించారని.. సెప్టెంబర్ 17న భారత యూనియన్లో కలవడం ద్వారా అనేక అరాచకాల నుంచి ప్రజలు విముక్తం అయ్యారని.. అందుకే అది విమోచనా దినోత్సవంగా జరపాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అధికారికంగా ఆ ఉత్సవం నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుండడం విశేషం. బీజేపీ నేతలు మొదట్నుంచీ ఇదే వైఖరిని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ వారు అదే స్వరం వినిపిస్తున్నారు.
ఇక రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ నేతలు తమ పంథాను మార్చుకోవడం విశేషం. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచనోత్సవాన్ని తాము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పినా... తెలంగాణ ఏర్పాటు తరువాత వివిధ కారణాల చేత పంథా మార్చుకున్నారు. హైదరాబాద్ ను గంగా-జమునా తెహజీబ్ కు నమూనాగా అభివర్ణిస్తూ... గతంలో పాలకులు ఎలా వ్యవహరించినా.. ఇక్కడి ప్రజలు మాత్రం శతాబ్దాలుగా కలిసే ఉన్నారని.. ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తాము.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్టు గతేడాదే ప్రకటించారు. ఈసారి కూడా దాన్నే కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. జాతీయ పార్టీలకు పోటీగా రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 16వ తేదీనే కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇక 17వ తేదీన నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించే వేడుకల్లో కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేస్తారు. అటు జిల్లా కేంద్రాల్లో సమాంతరంగా నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, ప్రభుత్వవిప్‌లు పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారు.
తెలంగాణ ప్రజలు సంబరంగా జరుపుకునే జాతీయ సమైక్యతా దినోత్సవం విషయంలోనూ కొన్ని పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడుతున్నారు. ప్రతి అంశానికీ మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గానీ, దేశవ్యాప్తంగా గానీ ఇప్పుడు కావాల్సింది జాతీయ సమైక్యతే తప్ప.. విభేదాలను పెంచిపోషించే వింతడవాదనలు వద్దని అధికార బీఆర్ఎస్ నేతలు అభిప్రాపయపడుతున్నారు.
ఇక కాంగ్రెస్ నేతలు సైతం సెప్టెంబర్ 17 సందర్భానికి తమదైన కోణాన్ని జత చేస్తున్నారు. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్ నేతలు సెప్టెంబర్ 17ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమ పార్టీలో చేరే నాయకులను అదే రోజు సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ నేతల సమక్షంలో చేర్చుకొని కేడర్ కు మరింత జోష్ పెంచేదుకు తహతహలాడుతున్నారు. ఆ రోజు తుక్కుగూడలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు విజయభేరి సభ అనే నామకరణం చేసి తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులను కాంగ్రెస్ లో చేర‌్చుకునేందుకు పథకం వేసుకున్నారు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్రావు, మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు వంటి నేతలు ఈ సభలోనే కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలున్నాయట. 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోనే పార్టీ వర్కింట్ కమిటీ సమావేశాలు నిర్వహించుకుంటున్న ఆ పార్టీ నేతలు.. సోనియాగాంధీ నేతృత్వంలో 17వ తేదీన తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ విధంగా సెప్టెంబర్ 17 సభను ఆ రెండు అధికార పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని చాటుకునేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.
ఇక పూర్వ కాంగ్రెస్ నేతలు సెప్టెంబర్ 17 ను మొదట్నుంచీ విమోచనా దినోత్సవంగానే ప్రకటిస్తూ ఉండగా.. కాలక్రమంలో తదుపరి కాంగ్రెస్ నేతలు తమ భావజాలంలోని గాఢతను సవరించుకుంటూ వస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో విమోచనం నుంచి విలీనానికి ఇప్పుడైతే హైదరాబాద్ స్వాతంత్ర్య దినోత్సవంగా నామకరణం చేసి.. తమదైన రాజకీయ పంథాలో తెలంగాణలో దూసుకుపోయేందుకు కాంగ్రెస్ నేతలు జోష్ మీద ఉండడం విశేషం.
ఇక పార్లమెంట్ సమావేశాలకు ఒకరోజు ముందు సెప్టెంబర్ 17న అఖిల పక్ష సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు పిలుపునిచ్చింది. ఇందుకోసం అన్ని పార్టీలకు ఇప్పటికే ఈ మెయిల్ ద్వారా ఆహ్వానాలు కూడా వెళ్లాయట. 18 నుండి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈసారి పార్లమెంట్ సెషన్లో ఎజెండా ఏముంటుందనేది అధికారికంగా వెల్లడి కాకపోయినా.. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌర స్మృతి, జమిలి ఎన్నికలతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సెప్టెంబర్ 17కు దేశవ్యాప్తంగా కూడా చాలా ఇంపార్టెన్స్ లభిస్తోంది.
ఇలా ఎన్నికలు సమీపిస్తున్న వేళ... బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని జనం నాడిని తమవైపు మళ్లించుకునేలా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పోటాపోటీగా కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటున్నాయి. ఈ మూడు పార్టీలు కూడా హైదరాబాద్ లోనే ఒకే రోజు భారీ కార్యక్రమాలకు ప్లాన్ చేయడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కే అవకాశం ఉంది. ప్రాంతీయ నేతలు, జాతీయ నేతల రాకతో తెలంగాణవ్యాప్తంగా వాతావరణం మారిపోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక సెప్టెంబర్ 17ను తెలంగాణలో బీజేపీ నేతలు విమోచన దినోత్సవంగా అధికారికంగా జరుపుతుండగా... బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్నారు. వీరిద్దరూ ఇలా జరపడం ఇది రెండోసారి. గతేడాది కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి నుంచి అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాగా.. అప్పటికప్పుడు కేసీఆర్ వ్యూహం మార్చి.. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించి కేంద్రానికి ప్రతివ్యూహాన్ని పన్నారు. దీంతో బీజేపీ తన పాత నినాదానికే కట్టుబడగా.. బీఆర్ఎస్ పాత పంథా మార్చుకొని జాతీయ సమైక్యతా దినం అంటూ కొత్త వైఖరి తీసుకున్నట్లయింది. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతుండడం విశేషం. దరిమిలా కాంగ్రెస్ కూడా మరో పంథాను ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ స్వాతంత్ర్య దినోత్సవం పేరిట రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఇక తెలంగాణ సాయుధ పోరాటంలో, రైతాంగ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన చరిత్ర గల కమ్యూనిస్టులు ఉనికి కోల్పోతున్న క్రమంలో వారు సైతం తెలంగాణ ఉత్సవాలు నిర్వహిస్తామంటున్నారు. కాకపోతే ఈ విషయంలోనూ సీపీఎం, సీపీఐ మధ్య ఏకాభిప్రాయం ఉన్నట్టయితే కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. సీపీఎం నేతలు తాము విలీనోత్సవం పేరిట జరుపుతామని చెబుతుండగా.. సీపీఐ మాత్రం ఇంకా తనవైఖరి ప్రకటించిన జాడ కనిపించడం లేదు. మొత్తానికి నిజాం నిరంకుశత్వం మీద పోరాడిన చరిత్ర గల కమ్యూనిస్టులు విలీనం పేరిట ఎలాంటి భావగాఢత లేని శబ్ద ప్రయోగంతో రాజకీయ రంగంలో దీటుగా నిలవాలనుకోవడం అత్యాశే అన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.
విలీనం, విమోచనం, జాతీయ సమైక్యం, హైదరాబాద్ స్వాతంత్ర్య దినోత్సవాల పేరిట నానా రకాల టైటిల్స్ తెలంగాణ ప్రజల ముందు చర్చకు వస్తుండగా.. తెలంగాణలో మొదట్నుంచీ క్రియాశీల రాజకీయాలు చేసిన అతివాద వామపక్ష నేతలు కొందరు ఇప్పటికీ తమ పాత వాదనకే కట్టుబడి ఉన్నామంటున్నారు. అదే విద్రోహం. హైదరాబాద్ లో ఒకప్పుడు సాయుధ పోరాటం నిర్వహించిన కమ్యూనిస్టులు ఆనాడు సంస్థానాన్ని విలీనం చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వ కుట్రగానే ఇప్పటికీ అభివర్ణిస్తారు. అందుకే దానికి వారు విద్రోహం అనే పేరు పెట్టారంటారు. అంటే వారి ఉద్దేశంలో సంస్థానాన్ని పాక్ లో కలవాలా.. లేక భారత్ లో కలవాలా.. లేక స్వతంత్రంగా ఉండాలో తేల్చుకునే అవకాశం ఇవ్వకుండానే.. హైదరాబాద్ మీద ఢిల్లీ సైన్యం దండెత్తి వచ్చిందని.. కమ్యూనిస్టులను ఏరిపారేసి హైదరాబాద్ ను బలవంతంగా కలిపేసుకున్నారని.. అందుకే అది విద్రోహం అవుతుందని వారు ఇప్పటికీ చెబుతుంటారు. ఇలా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క హైదరాబాద్ విషయంలో ఇన్ని టైటిల్స్ తెర మీదికి రావడం ప్రజల్లో అతిపెద్ద చర్చాంశంగా మారింది. అయితే బీజేపీ నేతలు ఇప్పటికీ తమ పాత వైఖరికి కట్టుబడి ఉండడమే గాక.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఉత్సవాలు సైతం మొదలు పెట్టడం ఒక అంశమైతే.. బీఆర్ఎస్ తన పాత పంథాను మార్చుకొని.. అది కూడా అధికారికంగా పోటీ ఉత్సవాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. అయితే సెప్టెంబర్ 17 అనగానే.. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న ఆసక్తి మాత్రం ప్రజల్లో పెద్దగా కనిపించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తుండడం విశేషం.
Comments
Post a Comment
Your Comments Please: