ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన సమయంలో జరిగిన పోరాటాలు... ఆ తరువాత భారత్‌పై జరిగిన దాడులను భావి తరాలకు తెలియజేసేలా కొందరు నిర్మాతలు, దర్శకులు సినిమాలను రూపొందించడం ట్రెండ్‌గా వస్తోంది. అలాంటి సినిమాలలో కొన్ని ప్రశంసలు అందుకుంటే... మరికొన్ని విమర్శలపాలవుతున్నాయి. ఆ కోవకు చెందినవే ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలు. ఇప్పుడిక ఆ జాబితాలో రజాకార్ మూవీ చేరిపోయింది. భారత స్వతంత్రం అనంతరం తెలంగాణలో రజాకార్ల అరచకాలను తెలిపేలా ఈ మూవీ రూపొందుతుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మాత్రం దుమ్ము రేపుతోంది.
సెప్టెంబర్ 17... తెలంగాణ విమోచన దినోత్సవం రోజున రిలీజ్ అయిన రజాకార్ మూవీ టీజర్ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ మూవీతో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. 1.42 నిమిషాల నిడివి గల ఈ టీజర్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. రాష్ట్ర ప్రజలను రెండు వర్గాలుగా విడదీసేందుకే ఈ మూవీని తీస్తున్నారని కొందరు ఆరోపిస్తుండగా... లేదు లేదు... ఇదో పీరియాడిక్ డ్రామా అంటున్నారు నిర్మాతలు. అయితే మరెందుకీ రచ్చ? అసలు ఆ టీజర్‌లో ఏముంది?
తాజాగా రిలీజ్ అయిన రజాకార్ టీజర్ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సినిమాతో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. 1947లో దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినా.. హైదరాబాద్‌కు మాత్రం రాలేదన్న పాయింట్‌తో రజాకార్ టీజర్ మొదలు కాగా.. ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు చేసిన దౌర్జన్యాలు, అరాచక చర్యలను ఈ టీజర్‌లో చూపించారు. ఇందులో ప్రధానంగా హిందువులందరినీ ఇస్లాం మతంలోకి మార్పించి.. ముస్లిం రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో రజాకార్లు చేసిన క్రూర చర్యలను తెరకెక్కించినట్టుగా ఉంది. బ్రహ్మణుల జ్యంజాలను తెంపేయటం.. తెలుగు మాట్లాడే వారి నాలుకలను కోసేయటం.. ఇస్లాం మతంలోకి చేరని వాళ్లను మూకుమ్మడిగా ఉరి తీయటం లాంటి ఘోరాలను కూడా టీజర్‌లోనే కవర్ చేశారు.
రజాకార్-ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ చిత్రం టీజర్ సెప్టెంబర్ 17న విడుదలైంది. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ తరహాలోనూ ఈ సినిమా కూడా వివాదాస్పదమవుతోంది. సినిమా రిలీజ్ కాక ముందే సినీ, రాజకీయ వర్గాల మధ్య హీట్ పుట్టించింది. యాటా సత్యనారాయణ దరకత్వంలో.. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో నిజాం పాలనలో రజాకార్ల దారుణాలను, వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తీశామని చిత్ర యూనిట్ అంటోంది. అయితే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని సినిమా తీశారని ముస్లిం వర్గం ఆరోపిస్తుంది. ఈ సినిమా పోస్టర్‌ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, బీజేపీ నేతలు విడుదల చేసినప్పుడూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు ఈ మూవీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల సమయం కావడంతో... తెలంగాణ ఎన్నికలే లక్ష్యంగా ఈ సినిమా తీస్తున్నారని అధికార బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.
రజాకార్లు అనే పదం 1927లో స్థాపించిన మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు ఖాసిం రజ్వీ నేతృత్వంలోని సొంత సైన్యంలో భాగమైన వాలంటీర్లను సూచిస్తుంది. అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అల్లకల్లోలమైన కాలంలో హైదరాబాద్ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి రజాకార్లు బలమైన వ్యూహాలను ఉపయోగించారు. నివేదిక ప్రకారం, వారు 1946 తర్వాత రైతాంగ తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నించిన నిజాం ప్రభుత్వం, ప్రభావవంతమైన భూస్వాముల మద్దతును పొందారు. అలా అణిచివేతకు గురైన జనం తిరుగుబాటుకు దిగడంతో రజాకార్ల ఆగడాలు మరింత పెరిగాయి. రజాకర్ అంటే వలంటీర్ అనే అర్థం వస్తుంది కానీ వాళ్లు చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి రజాకార్ల అరాచకాలను, అకృత్యాలను చూపే ప్రయత్నమే ఈ రజాకార్ మూవీ.
ఈ మూవీ పోస్టర్‌లో తుపాకీ కత్తిపై ఓ బ్రాహ్మణుడి మృతదేహం వేలాడుతున్నట్టు చూపించడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆనాడు రజాకార్లు ఒక కులం అంటూ టార్గెట్ చేయలేదని.. ఎక్కువగా రెడ్లు, దళితులే బలయ్యారని... ఎలక్షన్ల కోసం, వేడిలో వేడిగా డబ్బు చేసుకోవడం కోసం ఈ పాట్లు అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ వివాదానికి మరింత ఊతమిచ్చింది. మరోవైపు అటు మత పెద్దలు ఇటు ఎంబీటీ లాంటి రాజకీయ పార్టీ నేతలు కూడా ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమాను తీస్తున్నారని మండిపడుతున్నారు. రాజకీయాల కోసం తప్పుడు సినిమాలు తీస్తే జనం నమ్మరంటున్నారు.
రజాకార్ టీజర్ బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మంత్రి కేటీఆర్ అంటుంటే... ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రజాకార్ టీజర్ ను ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ పోస్టుపై స్పందించిన మంత్రి కేటీఆర్... బీజేపీకి చెందిన కొంత మంది తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి బీజేపీకి చెందిన కొంత మంది కృషి చేస్తున్నారని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు ట్రాక్ మార్చిందని ఆరోపించారు. రజాకార్ల దాష్టీకాలను చూపించగానే ట్విట్టర్ టిల్లుకు సమస్యగా మారిందని మండిపడ్డారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. హిందువుల పండుగ వినాయక చవితికి శుభాకాంక్షలు చెప్పలేదు.. కానీ రజాకార్ల హిందూ మారణహోమాన్ని చూపించిన సినిమాపై దాడికి సిద్ధమయ్యారని కేటీఆర్ పై విమర్శలు చేశారు. చరిత్రను తుడిచిపెట్టే పనికిమాలిన ప్రయత్నాలకు బదులు కేటీఆర్ కు కొంత స్పృహను కలిగించాలని అందరూ గణనాథుడిని ప్రార్థిద్దాం అంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి మద్దతుతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ మూవీపై కామెంట్స్ చేశారు. ఈ చిత్రాన్ని 'ది కాశ్మీర్ ఫైల్స్', 'ది కేరళ స్టోరీ' చిత్రాలతో పోల్చారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో హైదరాబాద్ మారణకాండ, ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన విషాద సంఘటనలపై దృష్టి సారించి 'రజాకార్' అనే పేరుతో ఒక అద్భుతమైన చిత్రం త్వరలో విడుదల కానుందన్నారు. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించి, విజయానికి సహకరించాలని ప్రజలను కోరారు. మూవీ చూసిన తర్వాత సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో డిసైడ్ అవ్వాలన్నారు. మీరు, మేము కలిసి సినిమా చూద్దామని... ఆ తర్వాత ఓ నిర్ణయానికి రావాలని రాజా సింగ్ కేటీఆర్‌కు పిలుపునిచ్చారు.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ముస్లిం మత పెద్దలు విమర్శిస్తున్నారు. అందులో భాగమే రజాకార్ సినిమాను నిర్మిస్తున్నారని ఆరోపించారు. 75 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని రూపొందిస్తున్న ఈ చిత్రం... సమాజంలో మరింతగా చీలిక తెస్తుందని అంటున్నారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఆమోదం తెలపబోదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టే సినిమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఉద్దేశ పూర్వకంగా నరహంతకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 1948 నాటి ఘటనలను తప్పుగా చిత్రీకరించి బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. హింసను సృష్టించడం.. శాంతి, మత సామరస్యాన్ని కాపాడుకోవడంపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంటే... సినిమా విడుదలకు ముందే నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలు ఎలా వివాదమైయ్యాయో... ఈ సినిమా కూడా అంతకు మించి వివాదమవుతుందని నెటిజన్లు అంటున్నారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణ సమాజంలో మత ఘర్షణలు పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం మతంతో పాటు రాజకీయ టర్న్ తీసుకునే అవకాశముందని ఓ వర్గం ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక ఇలాంటి వివాదాలతో సినిమాకు హైప్ పెంచి దర్శక, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుందని అంటున్నారు.
మొత్తానికి టాలీవుడ్‌లో రజాకార్ మూవీ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. అయితే ఇలాంటి సినిమాలు సామాన్యులకు ఎంత వరకు ఉపయోగకరమని జనం గుసగుసలాడుతున్నారు. మానిన గాయాన్ని మరోసారి తెరకెక్కించి ఏం చెప్పాలనుకుంటున్నారని కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రస్తుతం అతి పెద్ద సమాచార మాద్యంగా ఉన్న సినిమా తెరపై ఇలాంటి చిత్రాలు యూత్‌కు ఏం మెసేజ్ ఇవ్వనున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: