కంచే చేనే మేస్తే.. ఆ కాపు ఏం చేయాలి? రక్షణగా నిలవాల్సిన వ్యవస్థే పక్షపాతం చూపి తప్పుకుంటే ఎవర్ని ఆశ్రయించాలి? ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే కబ్జాలకు తెగబడి.. బెదిరింపులకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి? కరీంనగర్ లోని ఓ బాధిత రైతు.. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెర లేపిన భూ కబ్జా భాగోతంతో బెంబేలెత్తిపోతున్నాడు. కరీంనగర్ లో ఉండలేక, ఉంటే బతుకుతానన్న గ్యారెంటీ లేక హైదరాబాద్ పారిపోయి వచ్చానంటున్నాడు. తన గోడును ఎవరికి చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదంటూ.. హైదరాబాద్ లో మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే భూములకు రక్షణ దొరుకుతుందనుకున్న సామాన్య ప్రజలకు.. అలాంటి భరోసా ఏమీ కనిపించడం లేదన్న విమర్శలు చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. అందుక్కారణం పార్టీ పేరు చెప్పుకునో లేదా ఏదో ఒక అధికారి పేరు చెప్పుకునో మాఫియారాయుళ్లు భూములు కబ్జా చేయడం లేదిప్పుడు... ఏకంగా మంత్రులే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రంగంలోకి దిగుతున్నారట. రాష్ట్ర మంత్రి వర్గంలో చాలా కీలకమైన పోర్టుఫోలియో కలిగి ఉన్న బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ మీదనే ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగుల పేరు తెరమీదికి రాగానే కరీంనగర్ ప్రజలు అలర్ట్ అవుతుండడం విశేషం.
Also Read: నిరంజన్‌రెడ్డి బర్త్ డే వేడుకల సందర్భంగా ప్రత్యేక సంచిక
ఈ విజువల్స్ లో కనిపిస్తున్న వ్యక్తి పేరు చెట్టి వెంకటరమణ. కరీంనగర్ పక్కనే ఉన్న కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్ లో ఎకరం భూమిని కొనుగోలు చేశాడు. ముగ్గురు ఆడపిల్లలున్న వెంకటరమణ తన బిడ్డల భవిష్యత్తు కోసం పైసాపైసా జమ చేసి 2007లో ఆ భూమిని కొనుగోలు చేశానంటున్నాడు. ఇటీవల కొంత కాలం క్రితం తన కుటుంబ అవసరాల కోసం 10 గుంటల భూమిని అమ్మేశాడట. మిగిలిన దాదాపు 30 గుంటలకు పైగా భూమ్మీద మంత్రి గంగుల, ఆయన అనుచరుల కన్ను పడిందని.. ఆ భూమిని అడ్డంగా కబ్జా చేశారంటున్నాడు వెంకటరమణ. తన భూమి మీద కన్ను పడిన గంగుల.. తనకు కుడి భుజం ఎడమ భుజం లాంటి నందిని మహిపాల్, కర్ర రవీందర్ రెడ్డిలను రంగంలోకి దింపి కథ నడిపిస్తున్నారని వెంకటరమణ ఆరోపిస్తున్నాడు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గనీ గౌడ్, మాజీ సర్పంచ్ బొమ్మ ఈశ్వర్ గౌడ్ వంటివారు.. గంగుల టీమ్ తో కుమ్మక్కయి కబ్జాల పర్వం కొనసాగేలా సహకరిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
మంత్రి గంగులకు తన భూమ్మీద కన్ను పడటానికి కారణం.. తనకు కళ్లు లేకపోవడమేనని వాపోతున్నాడు వెంకటరమణ. తనకున్న అంధత్వాన్ని ఆసరా చేసుకొని ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో తన భూమిలో ఏకంగా కన్స్ట్రక్షన్లే చేశారని.. ఇంతకు మించిన అన్యాయం తెలంగాణలో ఇంకేం ఉంటుందని వాపోతున్నాడు వెంకటరమణ. పైసాపైసా కూడబెట్టి తాను కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన దస్తావేజులన్నీ తన దగ్గర ఉన్నా కూడా.. గంగుల అండ్ టీమ్ ముందు వాటికి విలువ లేకుండా పోయిందని వాపోతున్నాడు. తన భూమికి సంబంధించి కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్స్ ఉన్నా.. వాటిని కూడా ధిక్కరించి తన భూమిలోకి ఎంటర్ అయ్యారని.. అక్కడే వారు నిర్మాణాలు కూడా కానిచ్చేశారని వాపోతున్నాడు. వారి కట్టడాలను తాను కూల్చానని తిరిగి తన మీదనే కేసు పెట్టారంటూ గంగుల అండ్ టీమ్ బరితెగింపును మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నాడు వెంకటరమణ.
తన భూమ్మీద ఎవరికన్ను పడిందో కొత్తపల్లి ఎస్ఐ ఎల్లయ్యగౌడ్ స్వయంగా తనకు చెప్పారని.. గుడ్డివాడినైన తాను వారిని ఎదుర్కోలేనని.. తనను గంగుల మనుషులు చంపేస్తారని.. అందుకని 30 లక్షలు తీసుకొని వదిలేస్తే ప్రాణాలతో ఉంటానని సలహా ఇచ్చారంటున్నాడు. ఒకవేళ 30 లక్షలు తీసుకొని భూమిని వదులుకోలేకపోతే 10 లక్షలైనా ఇవ్వాలని మెలిక పెడుతున్నారని వాపోతున్నాడు. నాలుగైదు కోట్లు చేసే విలువైన భూమిని.. 30 లక్షలకు ఎందుకు వదులుకోవాలంటూ గంగుల అండ్ టీమ్ ను ప్రశ్నిస్తున్నారు.. చెట్టి వెంకటరమణ దంపతులు. అయితే అప్పటివరకు తనకు అనుకూలంగా ఉన్న ఎస్ఐ బదిలీ మీద వెళ్లిపోతూ తన మీదనే కేసు పెట్టాడంటూ వాపోతున్నాడు. స్థానిక పోలీసులు మంత్రి గంగులకు అనుకూలంగా పనిచేస్తున్నారని బాధిత భార్యాభర్తలు ఆరోపిస్తున్నారు.
మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్భలంతో ఆయన అనుచరులు మహిపాల్, కర్ర రవీందర్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని మంత్రి వద్దకు వెళ్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని.. దీంతో తాను భయపడి హైదరాబాద్ లో తలదాచుకుంటున్నానని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొత్తపల్లి, లక్ష్మీపూర్ వంటి గ్రామాలు కరీంనగర్ కు శివారు గ్రామాలు కావడంతో అక్కడ భూములు కోట్లలో ధర పలుకుతున్నాయని.. గ్రామ సర్పంచ్ తో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పలువురు పంచాయతీ సిబ్బందితో గంగుల, ఆయన టీమ్ కుమ్మక్కయి.. తన భూమిని దక్కించుకునేందుకు భారీ స్కెచ్ వేశారంటున్నాడు.
తాను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న వ్యక్తినని.. అది కూడా గంగులకు చెందిన మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తినేనని... అయినా గంగులకు, ఆయన టీమ్ కు కులాభిమానం కాదు కదా.. ముగ్గురు ఆడపిల్లలతో పాటు వైకల్యం అనుభవిస్తున్న మనిషి ఆస్తిని ఆశించరాదన్న ఇంగితజ్ఞానం కూడా లేదని వాపోతున్నారు వెంకటరమణ దంపతులు. తన ఉద్యమ కాలంతో ఉన్న పరిచయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను గానీ, ఆయన తనయుడు కేటీఆర్ ను గానీ కలిసేందుకు అనుమతిస్తే తన గోడు వెళ్లబోసుకుంటానని.. తనకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
గంగుల అండ్ టీమ్ అరాచకాలను భరించలేకపోతున్నామని, వారి బెదిరింపులతో ఊళ్లో ఉండలేకపోతున్నామంటున్నాడు వెంకటరమణ. భూములపై కన్నేసిన రాబందులు.. ఎప్పుడొచ్చి ఏం చేస్తారో అన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నామని.. అందుకే హైదరాబాద్ పారిపోయామంటున్నారు. తన భూమిలో గంగుల అండ్ టీమ్ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను ఆపేసి తక్షణమే తన భూమి తనకు ఇప్పించి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు వెంకటరమణ దంపతులు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్.. ఇలా మరో బీసీ బిడ్డకు సంబంధించిన ఆస్తులను ఆశించడం న్యాయమేనా.. అని అడుగుతున్నారు కరీంనగర్ ప్రజలు. అలాగే ఇది ఎన్నికల సీజన్. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు, సత్వర న్యాయం జరుగుతుందని ఇతర మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీనియర్ ప్రజాప్రతినిధిగా, బీసీ సంక్షేమ బాధ్యతలు చూస్తున్న మంత్రిగా కీలకమైన పదవిలో ఉన్న గంగుల ఎలా స్పందిస్తారు? వెంకటరమణ దంపతులు ఆరోపిస్తున్న కబ్జాలపై ఏం చెప్తారు? తనకు ఎడమభుజం, కుడి భుజాల్లాంటి అనుచరులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ అంధుడికి ఎలాంటి న్యాయం జరిగేలా చేస్తారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి మంత్రి గంగుల స్పందిస్తారా.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కరీంనగర్ ప్రజలు. వెంకటరమణ లాంటి బాధితులు ఇంకా ఎంత మంది ఉన్నారు? వారంతా.. ఇప్పుడు బయకు వస్తారా? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
Comments
Post a Comment
Your Comments Please: