మా దుకాణం మా ఇష్టం. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెరుస్తాం.. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మూస్తాం. మీకేమైనా అభ్యంతరమా? అన్నట్టుగా ఉందట టీడీపీ హైకమాండ్ వైఖరి. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసి ఉనికి చాటుకుంటేనే కదా.. పార్టీకి భవిష్యత్తు ఉండేది? మరి పార్టీ భవితవ్యాన్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టారా? పోటీ చేస్తామన్న కాసాని జ్ఞానేశ్వర్ ను.. సైలెంట్ చేయించి టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించడంలో ఆంతర్యమేంటి? జ్ఞానేశ్వర్ రాజీనామా నుంచి ఓటర్లకు ఏం సంకేతం వెళ్తోంది?
టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడం.. టీ-రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి ఉండే ఫాలోయింగ్ గురించి మాట్లాడుకోవాల్సింది పెద్దగా ఏమీ లేదు. కానీ.. దాని వెనకాల చంద్రబాబు నడుపుతున్న మంత్రాంగం ఎంత లోతైందనే విషయమే సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కొంతమంది జ్ఞానేశ్వర్ రాజీనామాను హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. రాజీనామా వెనకాల బీఆర్ఎస్ కు ఆయన రాజీపడిపోయారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ జ్ఞానేశ్వర్ చెబుతున్న వాదనలు వింటే చంద్రబాబు తెరంగేట్రం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. జ్ఞానేశ్వర్ మీద విమర్శలను, అనుమానాలను కాసేపు పక్కనపెడితే.. అసలు తెలంగాణలో టీడీపీ పోటీలో ఎందుకు ఉండడం లేదన్నది చాలా కీలకంగా మారుతోంది. చంద్రబాబుకు జ్ఞానేశ్వర్ నచ్చకపోతే ఫరవాలేదు. ఆయన్ని పక్కనపెట్టి.. ఇంకొకరికి ఎవరికైనా పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. కానీ అదేదీ చేయకుండా పోటీ చేయడం లేదని ప్రకటించడంలో ఆంతర్యమే చాలా అనుమానాస్పదం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
చంద్రబాబు అనూహ్య నిర్ణయం వెనుక కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కుట్ర దాగున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అంటే.. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా అందరూ చెబుతారు. ఇప్పటివరకు ఒక్కసారైనా ఆయన చంద్రబాబును విమర్శించకపోవడం ఒకటైతే.. బాబు పట్ల తన అపరిమితమైన ఆరాధానా భావాన్ని కూడా బహిరంగంగానే చాటుకున్నారు రేవంత్. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరే ముందు కూడా ఆయన స్వయంగా బాబును కలిసి చాలాసేపు ముచ్చటించి రావడాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అంతకుముందు తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మీద కుట్ర చేసి ఓటుకు నోటు కేసులో రేవంత్ పట్టుబడిన అంశాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబు తన శిష్యుడిగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తదుపరి సీఎం రేవంతే అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ గనక పోటీలో ఉంటే.. ఆ ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ కు మేలు చేస్తాయని.. అలాంటిది జరగకుండా ఉండేందుకే.. టీడీపీని పోటీలో లేకుండా బాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ఆ ఓట్లన్నీ రేవంత్ కు బదిలీ అయ్యేలా చేసే ఎత్తుగడనే చంద్రబాబు అమలు చేస్తున్నారంటున్నారు పరిశీలకులు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తెలంగాణలో అన్ని సీట్లకూ పోటీ చేస్తామని జ్ఞానేశ్వర్ ప్రకటించిన కాసేపటికే లోకేశ్ తొందరపాటు ప్రదర్శించి తాము పోటీ చేయడం లేదని ప్రకటించి తన మాటకు విలువ లేకుండా చేశారని జ్ఞానేశ్వర్ చివుక్కుమన్నారు. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకు నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి కలిస్తే.. అక్కడ చంద్రబాబు కూడా అదే మాట వినిపించడంతో జ్ఞానేశ్వర్ తీవ్రంగా హర్ట్ అయ్యారట. పోటీలో లేకపోవడానికి బాబు వేస్తున్న కుట్రకోణం లోతెంతో తెలిసిందంటున్నారు జ్ఞానేశ్వర్.
తెలంగాణలో కనుమరుగవుతున్న టీడీపీ కోసం తన భవిష్యత్తును కూడా పక్కనపెట్టి పని చేశానని... సొంత ఖర్చులతో పార్టీకోసం పాటు పడ్డానని ఆవేదన చెందుతున్నారు. పోటీలో ఉండరాదు అనుకుంటే ఖమ్మం జిల్లాలో ఎంతో భారీ ఎత్తున సభను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో చెప్పాలని జ్ఞానేశ్వర్ ఇప్పుడు నిలదీస్తుండడం విశేషం. సొంత పార్టీ భవిష్యత్తు కోసం కాక.. అవతలిపార్టీకి మేలు జరిగేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారని.. అలాంటప్పుడు తాను పార్టీలో ఎందుకు ఉంటానని ఆయన ప్రశ్నిస్తుండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తెలంగాణలో ఒకప్పుడు వెలుగు వెలిగిన పార్టీని బతికించుకునేందుకు కాకుండా.. తన దురుద్దేశపూరిత కుట్ర కోణాలు ఆవిష్కరించేందుకు ప్రయత్నించడంతో కలత చెందానని జ్ఞానేశ్వర్ అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో పోటీ చేసేందుకు నాయకులంతా సొంత ఖర్చులతో ముందుకొచ్చారని.. అయినా బాబుకు ఏంటి నష్టమో తెలియడం లేదని.. ఇదంతా చంద్రబాబు చీకటి కుట్రలో భాగమేనని కన్ఫామ్ అయిందంటున్నారు జ్ఞానేశ్వర్.
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఎన్నికల ఇన్‌చార్జిగా బాలకృష్ణను నియమించారు. ఆయన తెలంగాణ నేతలతో సమావేశం నిర్వహించి, తమ సత్తా ఏంటో చూపుదామని తొడ గొట్టడం మరో విశేషం. తెలంగాణలో జరిగే ప్రచారంలో పాల్గొంటానని బాలయ్య హామీ కూడా ఇచ్చారు. ఇక అభ్యర్థులను ప్రకటించడమే తరువాయి అనుకున్న దశలో.. రేవంత్‌రెడ్డి చక్రం తిప్పి.. బాబు ప్రభావితం చేశారన్న వాదనలకు.. బాబు తాజా వైఖరితో రూఢి అయిందంటున్నారు పరిశీలకులు. మరి ఈ తరుణంలో... పార్టీ కోసం ఖర్చు చేసి పార్టీ పట్ల సిన్సియర్ గా పనిచేసిన జ్ఞానేశ్వర్ లాంటి నాయకులు మళ్లీ దొరుకుతారా.. అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీడీపీలో తనకు జరిగిన ట్రీట్ మెంట్ తో రేపో మాపో జ్ఞానేశ్వర్ కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. బహుశా అది బీఆర్ఎస్సే కావచ్చు.
Well written
ReplyDelete