టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీనియర్లను లైట్ తీసుకుంటున్నారా? చాలా మంది సీనియర్ల రాజకీయ భవిష్యత్ డైలమాలో పడినట్టేనా? మొదటి లిస్టులో సీనియర్ల పేర్లు కనిపించకపోవడానికి కారణం అదే అంటున్నారు విశ్లేషకులు. ఇక రెండో జాబితా సీట్లలో పోటీ విపరీతంగా ఉండడంతో టికెట్లు దక్కే సంభావ్యత అనుమానంలో పడిందన్న ఆందోళన సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది.
టీ-కాంగ్రెస్ లో సీనియర్లంటే ఒకప్పుడు వారు చెప్పిందే వేదం. ఆ మాటకొస్తే.. ఎవరు రాసుకున్న వేదం వారిదే... అన్నట్టుగా ఉండేది పరిస్థితి. పార్టీ పగ్గాలన్నీ ఢిల్లీలోని హైకమాండ్ గుప్పిట్లో ఉండడంతో.. లోకల్ పీసీసీ చీఫ్ లు గానీ, పార్టీ ఇతర పోర్ట్ ఫోలియోల మాటలకు గానీ పెద్దగా చెల్లుబాటు అయ్యేది కాదు. ఢిల్లీలో వారు చెప్పిందే ఫైనల్ కాబట్టి.. ఇక్కడ వీరి మాటలకు పెద్దగా ప్రయారిటీ ఉండేది కాదు. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి పగ్గాలు కట్టబెట్టాక క్రమంగా రీతి-రివాజు మారుతూ వచ్చింది. తొలుత రేవంత్ ను కూడా పాత పద్ధతుల్లోనే గూట్లో చెక్కేందుకు ప్రయత్నించారు. అయితే హైకమాండ్ ను ఒప్పించకొని, మెప్పించుకున్న రేవంత్.. రాష్ట్ర పార్టీ మీద క్రమంగా అదుపు సాధించారు. రేవంత్ కు రాహుల్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వడంతో.. క్రమంగా నాయకుల మీద కూడా రేవంత్ హోల్డ్ పెరిగిందంటున్నారు విశ్లేషకులు. వరంగల్ సభకు రాహుల్ వచ్చినప్పుడు.. సీనియర్లకు ఇండైరెక్టుగా ఘాటైన హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో తీవ్రమైన చర్చాంశంగానే మారింది. అయితే రాహుల్ అప్పుడు ఆ విధంగా కుండబద్దలు కొట్టడమే.. ఇప్పుడు పార్టీకి కలిసొస్తోందన్న అభిప్రాయాలు కలిగిస్తోంది.
ఉండేవాళ్లు ఉండొచ్చు.. పోయేవాళ్లు పోవచ్చు. అంతే తప్ప.. పార్టీలో ఉన్నట్టు నటిస్తూ అవతలివారికి సహకరించేలాగా వ్యవహరిస్తే అలాంటివారిని ఉపేక్షించేది లేదని రాహుల్ చాలా తీవ్రంగా స్పందించడం అప్పట్లో పార్టీ సీనియర్లలో కలకలం రేపింది. దాంతో రేవంత్ మీద పలువురు సీనియర్లు ఇంతెత్తున ఎగిరిపడ్డారు. వరుసగా ఢిల్లీకి క్యూ కట్టారు. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి వచ్చారు. ఫలితంగా కాంగ్రెస్ కండిషన్ తీవ్రంగా డ్యామేజ్ అయింది. అలాంటి స్టేజ్ నుంచి.. ఇప్పుడు అధికారం పక్కా అనే ఆత్మవిశ్వాసం తొణికిలాడుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ మ్యాజిక్ అనేది సీనియర్ల తోకలను మూకుమ్మడిగా కత్తిరించడం వల్లే సాధ్యమైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందువల్లే రేవంత్ పార్టీ మీద తన ముద్ర వేయగలిగారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ సీనియర్లలో రేవంత్ కు సహకరించినవారు కొందరైతే.. ఆయన మీద తిరుగుబాటు చేసినవారు మరికొందరు. తిరుగుబాటు చేసినవారినీ, చేయనివారినీ అని కాకుండా.. కేవలం గెలుపును మాత్రమే క్రైటీరియాగా తీసుకొని రేవంత్ టికెట్లు కన్ఫామ్ చేస్తున్నారని.. టికెట్లు దక్కించుకున్నవారి పేర్లను పరిశీలిస్తున్న రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్లే టికెట్లు దక్కనివారిలోనూ తనకు విధేయులు ఉన్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్లు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన మాజీ ఎంపీలు.. కొందరికి ఇప్పుడు టికెట్లు వస్తాయా రావా అన్న డైలమా నెలకొంది. తెలంగాణ సాధించుకున్నాక సురక్షితమైన స్థానాల మీద కూడా పలువురు నేతలు పట్టు కోల్పోయారు. అక్కడ పార్టీ కేడర్ కూడా క్రియాశూన్యంగా ఉండిపోయిందన్న అభిప్రాయాలు పార్టీ ఇన్ సైడర్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మధుయాష్కీ ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని ముచ్చట పడుతున్నారు. కానీ నిజామాబాద్ లో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణ ఉద్యమం నుంచి పసుపు బోర్డు, నిజాం షుగర్స్ వంటి అంశాల వైపు మళ్లుతున్నాయి. వరుసగా రెండు దఫాలు ప్రజాక్షేత్రంలో లేకపోవడంతో.. మధుయాష్కీ స్థానచలనం కాక తప్పడం లేదట. ఈ క్రమంలో ఆయన్ని ఎల్బీనగర్ కు మార్చాలన్న ప్రతిపాదనపై చర్చ నడుస్తోందట. మరి.. ఎల్బీనగర్ సీటు ఆశిస్తున్న స్థానిక నేతల పరిస్థితేంటి?
ఇక పొన్నం ప్రభాకర్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. కరీంనగర్ లో ఆయనకు కలిసొచ్చే పరిస్థితులు లేవట. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తును ఎలాగైనా కాపాడాలని ఆలోచిస్తున్న రేవంత్.. అక్కడికి సమీపంలోని మరో స్థానానికి మార్చాలన్న నిర్ణయానికి వచ్చారట. ఈ క్రమంలో కరీంనగర్ లో బీఆర్ఎస్ హవాకు చెక్ పెట్టేలా.. పార్టీకి కొత్త అయిన ఓ ముస్లింకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారట రేవంత్. అసెంబ్లీలో ముస్లిం ప్రాతినిధ్యాని అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఈ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే.. కరీంనగర్ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ నుంచి ఓ ముస్లిం వ్యక్తి పోటీ పడతాడంటున్నారు నిపుణులు.
ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి చిన్నారెడ్డి వంటి సీనియర్ లీడర్ కు ఈసారి టికెట్ దక్కే అవకాశాలు దాదాపు క్లోజ్ అయ్యాయంటున్నారు. అటు వీహెచ్ లాంటి బీసీ పెద్ద లీడర్లకు ఈసారి రేవంత్ మొండిచేయి చూపడం ఖాయంగా భావిస్తున్నారు. హైకమాండ్ నుంచి తీసుకున్న అధికారాన్ని రేవంత్ చాలా క్రియాశీలంగా, గెలుపోటములే క్రైటీరియాగా టికెట్లు ఇవ్వాలనే నిర్ణయం కారణంగా హస్తం పార్టీకి హైప్ వచ్చిందంటున్నారు. దీంతో చాలా మంది సీనియర్ల రాజకీయ భవిష్యత్తుకు బ్రేకులు పడ్డాయంటున్నారు. వారి రాజకీయ జీవితం బహుశా ఇక్కడితో సమాప్తమైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు పలువురు ఇన్ సైడర్స్. అయితే అవసరాన్ని బట్టి, అధికారంలోకి వస్తే అప్పటి పరిస్థితులను బట్టి సీనియర్ల సేవలు వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదన్న ఫీలర్స్ పంపిస్తున్నారు రేవంత్.
తెలంగాణలో కొద్ది నెలల క్రితం వరకు థర్డ్ ప్లేస్ లో ఉందనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల రేసులో దూసుకుపోతోంది. ఈ క్రమంలో సీనియర్లను తప్పించడంలో సక్సెస్ అయిన రేవంత్.. రెండో జాబితా విడుదల చేసిన తరువాత కూడా ఇదే క్రమశిక్షణను మెయింటెయిన్ చేస్తారా? చేయిస్తారా? రెండో జాబితా తరువాత కూడా సీనియర్ల నుంచి రేవంత్ ఇదే తరహా మద్దతు పొందితే ఆ పార్టీకి అది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందంటున్నారు విశ్లేషకులు. మరోవైపు.. కాంగ్రెస్ లో సీనియర్లను సక్సెస్ ఫుల్ గా రేవంత్ తప్పిస్తుండగా.. బీజేపీలో సీనియర్లు కచ్చితంగా పోటీ చేయాలన్న కండిషన్ ఢిల్లీ హైకమాండ్ నుంచి రావడం ఆ పార్టీలో నెలకొన్న పరిణామాలను చూపుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇలా బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లోకి రావడంతో ఆ పార్టీ కేడర్లో కొత్త అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Post a Comment
Your Comments Please: