చంద్రబాబుకు అక్కడ ఢిల్లీలో ద్వారాలు మూసుకుపోయాయా? ఆయన ఎంత ప్రయత్నించినా అమిత్ షా మనసు కరగలేదా? తన కష్టాలు తీరాలన్నా, పార్టీ మీద నీలినీడలు తేలిపోవాలన్నా బలమైన జాతీయ పార్టీ అండ కావాలని కోరుకున్న బాబుకు.. కమలనాథుల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదట. ఆ విషయం కన్ఫామ్ అయ్యాకనే ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ వైపు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టడం ఖాయంగా మారిందట. మరి ఆ విశేషాలేంటి?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. బీజేపీ మీద ఆశలు పూర్తిగా వదిలేసుకున్నారట. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారనే అభిప్రాయాలు, వ్యాఖ్యలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీ అండ తనకు అవసరమని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైతే కమలం పార్టీ ఆయన్ని నిరాకరిస్తోందని.. ఇదే వైఖరిని కొనసాగిస్తే కాంగ్రెస్ పంచన చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాను కాంగ్రెస్ వైపు వెళ్లడానికి వెనుకాడేది లేదని చెప్పడానికే.. ఇక్కడ తెలంగాణలో పోటీ నుంచి విరమించుకున్నారని.. బాబు పొలిటికల్ డెసిషన్లో అది శ్యాంపిల్ మాత్రమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఆ సమయంలో ప్రతిపక్షాలతో ఉమ్మడి కూటమి ఏర్పాటులో ఆయనే క్రియాశీల పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రతిపక్ష పార్టీల సభల్లోనూ పాల్గొన్నారు. బీజేపీ కేంద్రంలో ఓడిపోతుందనే ధీమాతోనే ఆయన అలా చేశారంటారు. ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కేంద్రంలో ప్రతిపక్షాలు ఘోర ఓటమి చవిచూశాక... ప్రధాని మోడీ కరుణా కటాక్షం కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. తాను తీవ్రంగా నిందించిన మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించడం లేదు. ఒకవేళ అప్పటినుంచే బీజేపీతో సరైన మైత్రిని కొనసాగిస్తూ ఉన్నట్టయితే బాబుకు ఈ పరిస్థితి ఎదురై ఉండేది కాదన్న అభిప్రాయాలు కూడా కొందరి నుంచి వినిపిస్తున్నాయి. అయితే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడాలనే ఆపత్కాల అవస్థలో పడిపోయారట చంద్రబాబు.
మరోవైపు ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా బ్లాక్‌గా ఏర్పడ్డాయి. అవేవీ టీడీపీని పట్టించుకోవడం మానేశాయి. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు బీజేపీకి దగ్గరవడం వల్లే కీలకమైన ప్రతిపక్షాలన్నీ బాబును ప్రతిపక్ష నేతగా గుర్తించడం మానేశాయట. ఈ నేపథ్యంలో బాబు ప్లాన్ బీ ని రెడీ చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌కు దగ్గర కావడం ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోదలచారట. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లోపాయికారీగా మద్దతిచ్చేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్‌కు పడితే, ఆ పార్టీ గెలుపు ఈజీ అవుతుంది. కీలకమైన తెలంగాణపై పట్టు సాధిస్తే, 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే... కేంద్రస్థాయిలో మళ్లీ చక్రం తిప్పే అవకాశం తనకు లభిస్తుందనేది చంద్రబాబు ప్లాన్ బి లోని సూత్రమట. జగన్ తనపై వరుసగా కేసులు పెడుతుండటంతో బాబుకు ఇప్పుడు కేంద్రం అండ అవసరం అవుతోంది. తాను ఎంత చేరువ అవుతున్నా బీజేపీ నుంచి రక్షణ అందడం లేదు. అందుకే ఆయన హస్తానికి స్నేహ హస్తం అందించేందుకు రెడీ అయిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఆంద్రాలో కూడా ఆ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు.
అయితే చంద్రబాబు ఆలోచనలు, వ్యూహాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉంటాయని ఆ పార్టీలోని పలువురు సీనియర్లే చెబుతున్నారు. మరి చంద్రబాబు ఈసారి కాంగ్రెస్ వైపు వెళ్తే.. ఆ పథకం కూడా ఉల్టాపల్టా అయిపోతే.. బాబు మళ్లీ ఏం చేస్తారన్న ఆందోళన సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. చంద్రబాబు మాత్రం.. బయటికొచ్చినా.. జైల్లో ఉన్నా.. ప్లాన్ బిలు, ప్లాన్ సిలు రచిస్తూనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Comments
Post a Comment
Your Comments Please: