Skip to main content

ఔను.. అది "సామాజిక విశ్వరూప మహాసభ"

తేదీ: 11-11-2023, శనివారం, సాయంత్రం (నరక చతుర్దశి నడుస్తున్న సమయం)

అది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక శుభ ముహూర్తం. 

దళితజాతిలోని మాదిగ బిడ్డలకు సామాజిక న్యాయం జరగబోతోంది అనడానికి పునాదులు పడిపోయిన పుణ్య తిథి.
14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మించి నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం వెలువడిన అద్భుత సందర్భం. 
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా మరో భారీ నిర్ణయానికి అంకురారోపణం జరిగిపోయింది. ఇక ఆవిష్కారమే తరువాయి. అదే ఎస్సీ వర్గాలు, అందులోని ఉపకులాల వాటాలు తేల్చే విభజన విషయం. 

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆ సంస్థ అధినేత, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే గాక.. వాటికి నేతృత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాట్లాడిన తీరు అపురూపం, ఆయన ఆవిష్కరించిన స్వప్నం రేపటి రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఒక ఉద్విగ్నభరిత సచిత్ర దృశ్యరూపం. 20 నిమిషాలకు పైగా మందృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదు. తన జీవిత పోరాటాన్ని, మాదిగ జాతి 30 ఏళ్లుగా తన హక్కుల సాకారం కోసం నిరంతరాయంగా చేస్తున్న ఆరాటాన్ని ఆవిష్కరింపజేశారు. ప్రధానమంత్రి మోడీని ఆయనే రప్పించారా.. లేక మోడీ అండ్ టీమ్ వ్యూహాత్మకంగా మందకృష్ణకు ఆ అవకాశం ఇచ్చి బహిరంగ సభను ఏర్పాటు చేయించారా అనే రంధ్రాన్వేషణను కాసేపు పక్కన పెట్టి అసలు చిత్రాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

తమ జాతి బిడ్డలు, తమకు ఎదురైన సామాజిక వివక్షకు ఎదురీదుతూ రాజ్యాంగ నిర్మాత ప్రసాదించిన హక్కుల సాధన కోసం 30 ఏళ్లు పోరాడాల్సిన కపట రాజకీయ సన్నివేశాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని.. పెట్టుబడులకు, కట్టుకథలకు పుట్టిన దుష్ట సంతతి మీడియా కూడా తమ పట్ల తీవ్రమైన వివక్ష చూపుతోందని.. ఢిల్లీలో కొలువుదీరిన ప్రభువుల దృష్టిని ఆకర్షించేంత కవరేజీ బలం, కండబలం, కాసుల దమ్మూ తమకు లేవని.. తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం దక్కాలంటే అది మోడీ ఒక్కడి వల్లనే సాధ్యమవుతుందని, మరో వ్యక్తితో, మరో నాయకుడితో అయ్యే పని కాదని ఆపుకోలేని ఉద్వేగం మాటున ఆసాంతం గద్గద స్వరంతోనే తన అంతరంగాన్ని మోడీ ముందు పరచారు. తమ సభకు మోడీ వంటి మహా నాయకుడు వస్తున్నాడంటే తమ సమస్యకు పరిష్కారం దొరికినట్టేననే భావన మాదిగ జాతి ప్రజల్లోకి వెళ్లిపోయందని రేపటి పరిణామాలకు పూర్వరంగాన్ని చూచాయగా స్పృశించారు మందకృష్ణ. 

ఆయన మాటలో అడుగడుగునా ఆనందమే కనిపించింది. ఆయన శరీరంలో అణువణువునా పులకరింతే వ్యక్తమైంది. తెలంగాణలో గానీ, ఆంధ్రాలో గానీ, ఉమ్మడి ఆంధ్రాలో గానీ ఎమ్మార్పీఎస్ ను వైఎస్ చంద్రబాబునాయుడు నుంచి వైఎస్ దాకా వాడుకుని వదిలేసినవారే. ఏ ప్రాంతంలో ఏ వర్గం ఓట్లు ఎన్నున్నాయి, అప్పుడు ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది, అది ఎవరికి లాభం చేసి పెడుతుంది.. ఇలాంటి వ్యాపార లెక్కలే రాజకీయాలను శాసించాయి, శాసిస్తున్నాయి. తన 30 ఏళ్ల ఎమ్మార్పీఎస్ జీవితం, అంతకుముందు అజ్ఞాత ఉద్యమ జీవితం.. ఆయన ఎంతమందిని చూసి ఉంటారు? ఎంతమంది ముఖ్యమంత్రులతో చాలా దగ్గరగా మాట్లాడి ఉంటారు? ఎవరి వైఖరేంటో అర్థం చేసుకోలేనంత అమాయకుడా మందకృష్ణ? వారు తమ డిమాండ్ ను పరిష్కరిస్తారేమోనని ఎదురుచూసి చూసి అలసిపోయాడు మందకృష్ణ. దేశానికే కాదు.. ప్రపంచానికే పెద్దన్నగా అవతరించిన మోడీ కాక ఇంకెవరూ తమ సమస్యను పరిష్కరించలేరన్న భావన ఏర్పడితే అందులో వాస్తవం లేకపోలేదు. తన ఉపన్యాసం నిండా మోడీలోని అంతరంగాన్ని ఎంత చక్కగా ఆవిష్కరించారు మందకృష్ణ. 

అందుకు తగినట్టుగానే ప్రధాని కూడా మందకృష్ణకు ఎంత గొప్ప విలువ ఇచ్చారు? మాదిగ రిజర్వేషన్ పోరాటానికి నాయకుడు కృష్ణ అయితే... ఇక నుంచి ఆయనకు తాను కూడా ఒక కార్యకర్తగా  తోడవుతున్నానని ప్రకటించడం ఎంత గొప్ప రెస్పాన్స్? వన్ లైఫ్, వన్ మిషన్ అంటూ మందకృష్ణ జీవితానికి ఎంత అద్భుతమైన టైటిల్ ఇచ్చారు మోడీ? మాదిగ రిజర్వేషన్, వాటాల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని.. అందుకోసం ముందుగా ఓ కమిటీని వేస్తామని.. ఈ సమస్య సుప్రీంకోర్టులో ఉన్నందున కోర్టులో మందకృష్ణకు అండగా తమ ప్రభుత్వం నిలబడి పోరాడుతుందని ఎంత చక్కటి రోడ్ మ్యాప్ ప్రకటించారు మోడీ? మోడీ మాటల్లో.. సమస్య ఎంత లోతైనది అయినప్పటికీ, ఎంత క్లిష్టమైంది అయినప్పటికీ తాము వాటి సాధన దిశగా కలబడతామని చెప్పడానికి మించిన గ్యారెంటీ ఏం కావాలి? సమస్యకు దాదాపుగా ఓ అద్భుతమైన పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్న అభిప్రాయానికి అక్కడే పునాది పడిపోయింది. 

అటు మందకృష్ణ కూడా తమ సమస్యకు పరిష్కారం దొరికితే.. బీజేపీ బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో మోడీకి లక్ష్మణుడిగా, ఓ తమ్ముడిగా ఉండే బాధ్యతలు తీసుకుంటానని హామీ ఇవ్వడం రేపటి రాజకీయాలు, సామాజిక పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెబుతోంది. తెలంగాణ ప్రజలంతా కోరుకున్న తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి కేసీఆర్  ఓ ఉద్యమకారుడిగా తాత్కాలికంగా నటించిన దానికి ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? 30 ఏళ్లుగా మందకృష్ణ అండ్ టీమ్ పోరాడుతున్నదానికి వారికి దక్కిన రెమ్యూనరేషన్ ఎంత? ఆ రెండూ పక్కపక్కన పెట్టి చూస్తే.. ఎవరి ఉద్యమంలో వెయిటేజీ ఉంది? ఎవరి ఉద్యమంలో చిత్తశుద్ధి ఉంది? ఉద్యమం పేరు చెప్పి ఊరేగుతున్నది ఎవరు? చినిగిపోయిన బట్టలతో ఇప్పటికీ ఎక్కే గడపా, దిగే గడపా నడుస్తున్నది ఎవరు? 30  ఏళ్లుగా మాదిగల డిమాండ్ ను సజీవంగా ఉంచడానికి మందకృష్ణ ఎన్ని బాధలు భరించాడో, ఎన్ని అవమానాలు భరించాడో ఊహించడం కష్టమా? తెలంగాణ ఉద్యమాన్ని మందకృష్ణ ముందుండి నడిపించకపోయినా కీలకమైన అన్ని సమయాల్లో కూడా అండగా ఉండి.. ఉద్యమ దీపాన్ని ఆరిపోకుండా కాపాడాడు. అది నేటికీ తెలంగాణ సమాజం మరచిపోదు. కానీ ఉద్యమకారుల పేరిట, రాష్ట్రం వచ్చిన తరువాత ఆ ఫలాలు అనుభవిస్తూ ఇప్పటికీ అవసరాన్ని బట్టి మళ్లీ తెలంగాణ ముసుగు తొడుక్కుంటున్నవారి గురించి కూడా తెలంగాణ ప్రజలకు బాగానే అర్థమైంది. 

అందుకే ఇప్పుడు కేసీఆర్ మీద మందకృష్ణ ఓ తిరుగులేని అస్త్రం కాబోతున్నారు. రాజకీయం తప్ప ఏదీ తెలియని కేసీఆర్.. దుష్ట రాజకీయాల కోసం పనికిమాలిన హామీలు, దిక్కుమాలిన ఈక్వేషన్లు తెరమీదికి తీసుకొస్తూ ఓ ప్రమాదకరమైన అసాంఘిక శక్తిగా మారిపోయారంటే అతిశయోక్తి కాదేమో. ముస్లిం మైనారిటీల్లో మహిళలు ఎదుర్కొంటున్న ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడిన మందకృష్ణకు.. ఓట్ల కోసం మైనారిటీ కార్డును ప్లే చేస్తూ అత్యంత ప్రమాదకరమైన రాజకీయ క్రీడను మొదలుపెట్టిన కేసీఆర్ కు ఎంత తేడా ఉంది? బీజేపీకి తెలంగాణ మీదుగా దక్షిణాది రాజకీయ యాత్రలో తాను అండగా ఉంటానని చెప్పిన మందకృష్ణ.. ఇటు కేసీఆర్ ను, అటు కాంగ్రెస్ ను సమానంగా చెడుగుడు ఆడేశారు. అటు బీజేపీ కూడా దొరల సమాజానికి చెందిన కేసీఆర్ మీద, మాదిగ బిడ్డ అయిన మందకృష్ణను మరో పోరాటానికి సమాయత్తం చేస్తోంది. అందుకు మందకృష్ణ కూడా తాను సిద్ధంగా ఉన్నానని.. సభాముఖంగానే ప్రకటించడం విశేషం. 

ఈ అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉన్నా.. అటు తరువాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు యావత్ ఈక్వేషన్స్ మారబోతున్నాయన్నమాట. అక్కడిదాకా ఎందుకు? కేసీఆర్ పై పోరాటం.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే మొదలైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. కేసీఆర్ ముస్లింలను దుర్నీతితో వాడుకుంటూ దుష్ట రాజకీయం చేసేందుకు అన్ని పథకాలూ వేసుకొని పెట్టుకుంటే... రేపు మందకృష్ణ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పోరు జరిగే ఆస్కారం ఉందన్న ఊహాచిత్రం కళ్లముందు కదలాడుతోంది. అయితే అంతకన్నా ముందు మాదిగ రిజర్వేషన్ విషయంలో మోడీ నుంచి హామీ నెరవేరితేనే అనేది మాత్రం మరువరాదు. మొత్తానికి దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణలో మందకృష్ణ ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని ఛేదించారు. ఇక శంఖం ఊదడమే మిగిలింది. 

నోట్- ఈ వార్త బాగుందనిపిస్తే షేర్ చేయండి. ఇంకా బాగుందనిపిస్తే ఓ కామెంట్ రాయండి. బాగా లేదనిపించినా కామెంట్ రాయండి. 

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మోడాల చంద్రశేఖర్ కు గౌరవ డాక్టరేట్

సీనియర్ పాత్రికేయుడు మోడాల చంద్రశేఖర్ కు జి.హెచ్.పి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి విహార్, శ్రీ సత్యసాయి ఆడిటోరియంలో గౌరవ డాక్టరేట్ ల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ 34 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో పలు పరిశోధనాత్మకమైన కథనాలు అందించారు. అంతేకాకుండా ధ్యాన సైన్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన యూనివర్శిటీవారు ఈ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఆయన సేవలకు గాను ఇప్పటికే రాష్ట్రస్థాయిలో స్ఫూర్తి రత్న వంటి అవార్డులు, ప్రముఖుల ప్రశంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శీటీ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డా. పి.రవీందర్, చెన్నయ్ సైబర్ క్రైమ్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తంగరాజు, ఎన్ఏఐ జనరల్ సెక్రటరీ డా.విపుణ్ గౌర్, జీహెచ్ పీయు తమిళనాడు, పాండిచ్చేరి రీజియన్ జాయింట్ డైరెక్టర్ లు డా. వళ్ళార్ మతి, శుభాస్ షా, నామినేషన్ కమిటీ మెంబర్ బొడుసు మాధవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు అందజేసి తన బాధ్యతను మరింత పెంచిన ...