తెలంగాణలో ఈ మధ్య వినిపిస్తున్న శబ్దం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ హ్యాట్రిక్ మాత్రమే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడోసారి పవర్ పగ్గాలు చేపడతారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే గాక.. యావత్ దక్షిణ భారతదేశంలోనే ఓ సరికొత్త రికార్డు సృష్టిస్తారన్న అంచనాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ కేడర్ నుంచైతే.. ఫిర్ ఏక్ బార్ - కేసీఆర్ సర్కార్.. అంటూ ఉత్సాహపూరిత నినాదాలు వినిపిస్తున్నాయి. అటు కేసీఆర్ బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగాలకు, ఆయన వివరిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వ్యక్తమవుతోంది.
కేసీఆర్ లో మూడు రకాల షేడ్స్ కనిపిస్తాయంటారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ స్థాపించే కంటే ముందు సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఓ ఉద్యమానికి నేతృత్వం వహించిన నేతగా ఆయనలో అతి గాఢమైన రెండో ఛాయ కనిపిస్తుంది. పార్టీ స్థాపించిన 14 ఏళ్లకు.. తాను స్వప్నించిన స్వరాష్ట్రాన్ని సాకారం చేసుకొని దేశంలో ఏ నాయకుడికీ లేనంత గాఢమైన ప్రొఫైల్ ను సొంతం చేసుకున్నారు. తెలంగాణ సాకారంతో దేశమంతటా ఆయన పేరు మార్మోగిపోయిందంటే అతిశయోక్తి కాదు. అప్పటికి బీజేపీ ఆధ్వర్యంలో 3 రాష్ట్రాలు ఏర్పడినా.. అవేమంత మైలురాయి లాంటి లక్ష్యాలు కావంటారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే తెలంగాణను ఆంధ్రా నాయకులు ఏ స్థాయిలో వ్యతిరేకించారో.. అంతటి వ్యతిరేకత మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించలేదు. ప్రజల్లో ఆ స్థాయి భావోద్వేగాలు ఎక్కడా కనిపించలేదు. కానీ తెలంగాణ ఒక్కటే అందుకు మినహాయింపు. అలాంటి తెలంగాణ ఏర్పాటు అనే అతి కఠినమైన లక్ష్యాన్ని ఎంచుకోవడం ఒక్క కేసీఆర్ కే చెల్లింది అంటారు రాజకీయ పరిశీలకులు.
కేసీఆర్ గనక తొట్రుపడితే.. తొండాట ఆడేందుకు వ్యూహం రచించుకున్న ఆంధ్రా నేతలు కాచుకొని కూర్చున్న సందర్భమది. అలాంటి సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపించిన రథసారథిగా ఇప్పుడు ప్రజల ముందు నిలబడి ఉన్నారు. ఆయన జ్ఞాపకాలన్నీ తెలంగాణ చుట్టూనే. ఆయన అడుగేస్తే తెలంగాణ. మాట్లాడితే తెలంగాణ. శ్వాసిస్తే తెలంగాణ. తెలంగాణలోని సాటి నాయకులెవరూ ఆయనకు సహకరించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలైతే కేసీఆర్ కు అడుగడుగునా అడ్డు తగులుతూ.. ఢిల్లీ పెద్దలను ఆటాడిస్తూ ఉద్యమాన్ని చల్లార్చేందుకు చేయని ప్రయత్నాల్లేవు. ఇక బీజేపీలో రెండు వర్గాలు. తెలంగాణను సమర్థించే వర్గం ఒకటైతే.. సమర్థిస్తున్నట్టుగా కనిపించి వ్యతిరేకించే వర్గం మరోటి. ఇలా కనిపించిన శత్రువులను, కనిపించని శత్రువులను సమర్థంగా ఎదుర్కోవడమే గాక.. వారి కుయుక్తుల బారిన పడకుండా తెలంగాణ ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చిన అవిరళ తెలంగాణ కృషీవలుడు కేసీఆర్.
అందుకే తెలంగాణ అంటే ఆయనకు భావోద్వేగం. తెలంగాణ అంటే కేసీఆర్ జీవన్మరణం. ఆ భావోద్వేగంలోనే నలిగిపోయారు. ఆ భావోద్వేగంతోనే ఎన్నో పాడెలు మోశారు. ఎందరో యువ కిషోరాల అంతిమ యాత్రల్లో కన్నీరు కార్చారు. తెలంగాణకు ఎదురవుతున్న ఇబ్బందులను తన ఇబ్బందులుగా భావించి పంటి బిగువున భరించారు. ఈ విధంగా కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకున్న భావోద్వేగపూరితమైన ఆ 14 ఏళ్లు ఒక తపస్సుతో సమానంగా పరిగణిస్తారు తెలంగాణ ఉద్యమకారులు. ఇలాంటి ఒడిదుడుకులు బహుశా దేశ రాజకీయాల్లోనే ఏ నేత కూడా ఎదుర్కొని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. దీన్ని కేసీఆర్ లోని రెండో షేడ్ గా పేర్కొనాల్సి ఉంటుందంటారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణ సాకారం అయిన తరువాత ఈ పదేళ్ల పరిపాలనా కాలాన్ని కేసీఆర్ లోని మూడో షేడ్ గా పేర్కొనాల్సి ఉంటుందంటారు రాజకీయ పరిశీలకులు. ఉద్యమ నాయకుడిగా ప్రజలంతా ఆయన చెప్పింది చేశారు. ఆయన చూపించినదాన్నే ఫాలో అయ్యారు. ఆ నమ్మకంతోనే తనకు ఉద్యమకాలంలో ఎదురైన సామాజిక తెలంగాణలోని కష్టాలను కడతేర్చేందుకు ప్రాజెక్టులను సంకల్పించారు. సాగునీరు, తాగునీటి కటకటలు లేకుండా చేశారు. పల్లేర్లు మొలిచిన పాలమూరు జిల్లాలో పచ్చని పంటలు పండేలా కృష్ణమ్మను మళ్లించారు. దిగువకు సముద్రంవైపు తరలిపోతున్న గోదావరి నది మీద ఆనకట్టలు వేసి నీటిని వెనక్కి మళ్లించారు. తెలంగాణ అంతటా భూగర్భ జలాలు పెరిగేలా చేశారు. పంటలు పండే సాగు విస్తీర్ణాన్ని అనేక రెట్లకు పెంచారు. రైతుల మొహాల్లో నవ్వులు పూయించారు. ఆత్మహత్యలను అంతం చేశారు. ఇలా కేసీఆర్.. తెలంగాణకు అత్యంత అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను సాకారం చేసి చూపించారు.
అదొక పార్శ్వం అయితే.. విద్యా రంగంలో, వైద్య రంగంలో కేసీఆర్ తీసుకొచ్చిన వినూత్నమైన విధానాలతో ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో గురుకుల పాఠశాలలు నెలకొల్పారు. విద్యార్థులు బడులకు దూరంగా ఉండకుండా ప్రతిరోజూ పరుగెత్తుతూ బడికి రావాలనే లక్ష్యంతో సన్నబియ్యం తీసుకొచ్చారు. ఈ మధ్యనే ఉదయం అల్పాహారం కూడా తీసుకొచ్చి.. విద్యార్థుల ఆరోగ్యం విషయంలోనూ కేర్ తీసుకుంటున్నారు. గృహలక్ష్మి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో కుటుంబాలకు ఎంతోకొంత ఆసరా అవుతున్నారు. ఎవరూ పట్టించుకోని ఒంటరి మహిళలు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లతో వారి పాలిట ఆపద్బాంధవుడై ఆదుకొంటున్నారు. అటు నేరాల అదుపులోనూ కేసీఆర్ మార్కును ప్రదర్శిస్తున్నారు. ఇలా పరిపాలనాపరంగా కేసీఆర్ లో కనిపించేది మూడో షేడ్ గా పేర్కొంటారు రాజకీయ విశ్లేషకులు.
ఈ క్రమంలో ఇప్పటికే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా పరిపాలించిన కేసీఆర్.. తన సుదీర్ఘమైన అనుభవంతో మరోమారు పాలించేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి వరుసగా మూడోసారి సీఎం అయిన వ్యక్తి లేడు. ముఖ్యమంత్రిగా ఎవరైనా రెండుసార్లకే పరిమితం అయ్యారు. అంతకుమించి తెలుగు ప్రజలు ఎవర్నీ మూడోసారి ముఖ్యంత్రిగా చూడలేదు. అయితే ఈసారి మాత్రం తెలంగాణకు మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవడం అనేది చారిత్రక అవసరంగా ఇక్కడి ప్రజానీకం భావిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ మొదలుపెట్టిన సామాజిక కార్యక్రమాలైన దళితబంధు, బీసీ బంధు వంటి పెద్ద పథకాలు ఇతర పార్టీలు గనక పవర్లోకి వస్తే అవి యథాతథంగా అమలవుతాయన్న గ్యారెంటీ లేదన్న ఫీలింగ్ లో యావత్ తెలంగాణ ప్రజానీకం ఉన్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ సంక్షేమ ఫలాలు ఇలాగే అందాలంటే కేసీఆర్ రాక తప్పదన్న భావన అన్ని ప్రాంతాల్లోనూ వ్యక్తమవుతుండడం విశేషం. అందుకే ప్రజల మధ్య ప్రసంగిస్తున్నప్పుడు 24 గంటల పవర్ కోసం నొక్కి చెబుతున్నారు కేసీఆర్. ధరణి వంటి పోర్టల్స్ ను కాంగ్రెస్ పాలకులు ఎత్తేస్తామనడం దుర్మార్గమని.. అలా చేస్తే మళ్లీ పాత అరిష్టాలే రాజ్యమేలుతాయని అప్రమత్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తప్ప మరో ఆప్షన్ లేదని.. ఆయన్ని మించిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు తెలంగాణలో ఎవ్వరూ లేరన్న అభిప్రాయాలు అన్నివర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. మంచి చేస్తే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారని.. ఈ క్రమంలో కేసీఆర్ తెలంగాణలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెబుతున్నారు. దేశంలో ఉత్తరాదిన పలు రాష్ట్రాల నుంచి హ్యాట్రిక్ సీఎంలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జ్యోతిబసు లాంటివారు ఐదుసార్లు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. గుజరాత్ లో మోడీ హ్యాట్రిక్ కొట్టారు. ఢిల్లీలో కేజ్రీవాల్ హాట్రిక్ నమోదు చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాట్రిక్ సీఎంగా నమోదయ్యారు. కానీ దక్షిణాదిలో ఇప్పటివరకు ఎక్కడా కూడా హ్యాట్రిక్ సీఎం నమోదు కాలేదు. తమిళనాడు గానీ, కేరళ గానీ, కర్నాటక గానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గానీ హ్యాట్రిక్ సీఎం అనేది రికార్డు కాలేదు. అలాంటి సందర్భం ఇప్పుడు తెలంగాణలో వచ్చిందని, కేసీఆర్ కచ్చితంగా మూడోసారి సీఎం అయి కొత్త రికార్డు నెలకొల్పుతారని.. ఆ ఊపుతో దేశంలో జాతీయ రాజకీయాల్లోనూ ఓ కొత్త శకానికి నాంది పలుకుతారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే అసాధ్యాలను సుసాధ్యం చేసిన కేసీఆర్.. ఇలాంటి స్వల్పమైన రికార్డు సృష్టించలేరా అన్న అభిప్రాయాలు మెండుగా వినిపిస్తున్నాయి. మరి రేపేం జరుగుతుందో చూడాల్సి ఉంది.
బీ ఆర్ ఎస్ ఓటమి ఖాయం
ReplyDelete