Skip to main content

కాంగ్రెస్ ను తలెత్తుకునేలా చేసిన టఫ్ మ్యాన్

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. బీఆర్ఎస్ కార్డు సైడ్ అయిపొయ్యి.. కాంగ్రెస్ కార్డు ముందుకొచ్చింది. దీనికంతటికీ కారణం ఒకే ఒక్కడు. ఆయనే టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగిల్ హ్యాండెడ్ గా పార్టీని, సీనియర్లను, శ్రేణులను, కేడర్ ను నడిపించి ఉన్నతాసనాన్ని ఖరారు చేసుకున్నారు రేవంత్. మరి.. ఈ ఉన్నతమైన స్థానం ఆయనకు ఊరికే లభించిందా? ఆయన కృషి ఎలాంటిది? 

తెలంగాణ ప్రభుత్వ మార్పిడిలో కీలకమైన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారూ ఉంటే అది రేవంత్ రెడ్డి. టీ-పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడం వెనుక.. కాంగ్రెస్ కు కాకతాళీయమైన అవసరమేం లేదంటారు నిపుణులు. రేవంత్ ను టీ-పీసీసీ చీఫ్ గా తీసుకోవడం వెనుక ఉభయుల ప్రయోజనాలూ ఉన్నాయట. అందుకే కాంగ్రెస్ ను తనకు అప్పగిస్తే.. కొన్ని కీలకమైన నిర్ణయాలు తనకు కట్టబెడితే.. పార్టీని నడిపిస్తానని.. హైకమాండ్ నిశ్చింతగా ఉండొచ్చని.. కచ్చితంగా రిజల్ట్ రాబడతానని ఎంతో నమ్మకంగా చెప్పారట రేవంత్. ఆయన మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ చూసే.. సోనియా, రాహుల్ టీ-పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించేందుకు ముందుకొచ్చారు. దానిపై టీ-కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు, ఎన్ని అసంతృప్తులు వచ్చినా డోంట్ కేర్ అంటూ ముందుకెళ్లింది అధిష్టానం. రేవంత్ కు బాధ్యతలు అప్పగిస్తూ వారు తీసుకున్న నిర్ణయం తప్పు కాదని తాజాగా రుజువైంది. తెలంగాణలో పదేళ్లుగా అధికారం కోసం ఆవురావురంటూ ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు రూపంలో అపురూపమైన బహుమానాన్ని అందించారు రేవంత్. 

మామూలుగా అయితే ముక్కూ మొహం తెలియని అపరిచితుడికి ఎవరైనా ఇంటి తాళాలు అప్పగిస్తారా? కొన్ని లక్షల విలువ చేసే ఇంటి తాళాలే ఇవ్వడం సాధ్యం కానప్పుడు ఒక దేశాన్ని పాలించిన పార్టీగా.. ఏఐసీసీ నేతలు.. టీ-పీసీసీ బాధ్యతలు అప్పగించడం అంత ఆశామాషీనా? ఇది నిజంగా అసాధ్యమే. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న నేతలంతా కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలే అయినా.. ఎవ్వరికీ పార్టీ మీద పెద్ద పట్టింపు లేదు. పార్టీ ప్రయోజనాల విషయంలో ఎవరూ కమిటెడ్ కాదు. పార్టీ పేరు చెప్పుకొని నాయకులుగా రాణిస్తూ ప్రయోజనాలు అనుభవించాలన్నదే వారి పాలసీ. ముఖ్యనేతలంతా మరి ఆ విధమైన వైఖరితో ఉన్నప్పుడు పార్టీ ఎలా బాగుపడుతుంది? తెలంగాణ ఇచ్చినా కనీసం పేరు ప్రతిష్టలు కూడా లేకపోతే ఇక భవిష్యత్తును ఎలా ఊహించవచ్చు? అందుకే ఏఐసీసీ నేతలు బయటి నుంచి వచ్చే ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. అందుకు నేనున్నానంటూ రేవంత్ రాయబారం నడపడం.. వారికి రేవంత్ పట్టుదల మీద, బీఆర్ఎస్ నేతల లోగుట్లపై ఆయనకున్న విషయ పరిజ్ఞానం మీద నమ్మకం కుదిరిందట. దీంతో ఎవరేమన్నా తగ్గేదే లేదంటూ.. ఆయనకు పీసీసీ పగ్గాలు కట్టబెట్టి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది అధిష్టానం. 2021 జులై 7న ఆనాటి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్నుంచి నవంబర్ 30న ఎన్నికలు జరిగేదాకా అన్నీ తానై పార్టీని చక్కబెట్టారు. సరిగ్గా రెండేళ్ల 4 నెలలు గడిచేసరికి రిజల్ట్ చూపించారు రేవంత్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల‌ నుంచి పోటీ చేశారు. కొడంగల్ నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి.. రాష్ట్రంలో కీలకమైన అత్యున్నత పదవిని అలంకరిస్తున్నారు. ఈ ఒక్కటి చాలదా... రేవంత్ లోని టఫ్ మ్యాన్ కెపాసిటీ ఎలాంటిదో?

రేవంత్ లో వేర్వేరు షేడ్స్ ఉన్నాయి. అన్ని పార్టీల జెండాలు కప్పుకున్న అనుభవమూ ఉంది. టీడీపీ రక్తం ప్రవహిస్తున్నా, బీజేపీ కండువాను ప్రేమించే హృదయం ఉంది. అటు గతంలో బీఆర్ఎస్ జెండా మోసిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లో కీలకమైన నేతగా ఎదిగి.. నాయకులందరినీ ఒక్కతాటిపై నడిపించిన ఓ సేనాని సామర్థ్యం కూడా రేవంత్ లో ఉందని రుజువైంది. 

రేవంత్ స్వగ్రామం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కొండారెడ్డిప‌ల్లిలోని వంగూరు. 1969లో జన్మించారు. వీరిది వ్య‌వ‌సాయ కుటుంబం. తండ్రి పేరు దివంగ‌త అనుముల న‌ర్సింహారెడ్డి. త‌ల్లి రామ‌చంద్ర‌మ్మ‌. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్న‌నాటి నుంచే రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రిచేవారు. గ్రాడ్యుయేష‌న్ చ‌ద‌వుతున్న స‌మ‌యంలో ఏబీవీపీ నాయ‌కుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఏ.వీ.కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన త‌ర్వాత ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు అయిన గీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన పెళ్లి ప్రపోజల్ ను గీత అమ్మానాన్న ఒప్పుకోకపోవడంతో జైపాల్ రెడ్డి చేత రాయబారం నడిపించారట రేవంత్. జైపాల్ చెప్పడంతో రేవంత్ కు గీతను ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించారట.. వాళ్ల అమ్మానాన్న. రేవంత్ ను చూడగానే.. ఆయనకుండే క్లారిటీని అర్థం చేసుకున్న గీత పేరెంట్స్.. పెళ్లి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అత్యున్నత పదవి అలంకరిస్తున్న సందర్భంలో వారు ఆనాడు తీసుకున్న నిర్ణయం ఎంత నికార్సయిందో బహుశా ఇప్పుడు అర్థమై ఉంటుందంటున్నారు. మొత్తానికి రేవంత్.. కి ఈ అత్యున్నతమైన స్థానం అనేది జాక్ పాట్ కాదు. కష్టే ఫలి అన్నట్టు.. తాను పూర్తి క్లారిటీతో కష్టపడి సాధించుకున్నదే కావడం గమనార్హం. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...