అత్యంత వెనుకబడిన కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి మెప్పించిన కె.సి.కాళప్ప జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య నిరాడంబరంగా జరిగాయి. ఆదివారం హైదరాబాద్ బండ్లగూడలోని తన స్వగృహంలో కాళప్ప 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంబీసీల్లోని పలు కులాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తమ కులాల అభ్యున్నతి కోసం కాళప్ప చేసిన కృషిని అంతా గుర్తు చేసుకున్నారు. కాళప్ప అనారోగ్యానికి గురైన తరువాత ఎంబీసీ ఎజెండా చలనం లేకుండా పోవడంపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం వరకు కాళప్ప పూర్తి ఆరోగ్యంగా ఉండి యావత్ ఎంబీసీల ఎజెండాను పరుగులు పెట్టించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.
2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించి.. అందుకోసం సామాజిక అధ్యయనం చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టారు. ఆ సమయంలో బీసీల్లో ఉన్న మోస్ట్ బ్యాక్వార్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) కు కూడా సమన్యాయం, సహజ న్యాయం జరగాలనే బలమైన వాయిస్ వినిపించారు కాళప్ప. బీసీల్లో ఉన్న దాదాపు నూటపాతిక కులాల్లో కేవలం 5 పెద్ద కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్నాయని.. మిగతా కులాలు.. అదే బీసీ ల చేతుల్లో అణచివేతకు, అన్యాయానికి గురవుతున్నారని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సామాజిక అసమానతల్లోని లోతును విడమరచి చెప్పారు. దాదాపు 7 గంటల పాటు కేసీఆర్ కు ప్రజెంటేషన్ ద్వారా వివరించడంతో కేసీఆర్.. ఎంబీసీలకు న్యాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అలా కాళప్ప కృషి ఫలితంగానే ఎంబీసీ కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఎంబీసీల జీవితాల్లో ఇక వెలుగులు ప్రసరిస్తాయని అంతా ఆశించారు. అయితే కేసీఆర్ ఇచ్చిన హామీ.. హామీగానే మిగిలిపోయింది. ఈ లోపు కాళప్ప అనారోగ్యం బారిన పడి రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. మరోవైపు ఎంబీసీ చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన తాడూరి శ్రీనివాస్ ను నియమించడంతో.. కాళప్ప అనుయాయుల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. ఎంబీసీలపై అవగాహన లేని, వారి సంక్షేమం విషయంలో చిత్తశుద్ధి లేని శ్రీనివాస్ ను ఎంబీసీ చైర్మన్ గా నియమించడంతోనే కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలోని లోగుట్టు రట్టయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో కాళప్ప పూర్తిగా మంచానికే పరిమితం అవడంతో ఎంబీసీల అసలైన ఎజెండా ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందని.. ఎంబీసీ కులాల నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కాళప్ప ఎజెండా ముందుకు ఏ విధంగా వెళ్తుందన్న చర్చ మిగతా ఎంబీసీ నేతల్లో జరుగుతోంది.
కాళప్పను కలిసి అభినందించినవారిలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణాచారి, ఆరెకటిక నాయకుడు ప్రేమలాల్ అండ్ టీమ్, సీనియర్ పాత్రికేయుడు టి.రమేశ్‌బాబు, ఎం.నరసింహాచారి తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: