ఆధునిక పోకడలకు దూరంగా ఉండే వెనుకబడ్డ కొడంగల్ నుంచి.. రాష్ట్ర అత్యున్నత పదవికి ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రస్థానం చాలాచాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అంతేకాదు.. పాత మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రికి ఎన్నికైన రెండో సీఎం రేవంత్ కావడం మరో విశేషం. ఆయన రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాల గురించి ఓసారి చూద్దాం.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికైన సందర్భం ఒక ముఖ్యాంశమైతే.. పాలమూరు జిల్లా నుంచి సీఎంగా ఎన్నికవుతున్న రెండో వ్యక్తి కూడా రేవంతే కావడం మరో ముఖ్యాంశం. ఆంధ్రాలో విలీనం కాక ముందు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు బూర్గుల రామకృష్ణారావు. ఆయన అప్పటి కల్వకుర్తి తాలూకాలోని పడకల్లు గ్రామంలో జన్మించారు. గొప్ప మేధావి, రచయిత, నిజాంపై పోరాడిన ధీరుడిగా కీర్తి గడించిన బూర్గుల తరువాత.. ఇంత కాలానికి మళ్లీ పాలమూరు ప్రాంతం నుంచి రేవంత్ రూపంలో మరో వ్యక్తి సీఎం అవుతున్నాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతుండడంతో ఆ ప్రాంతానికి మరోసారి ఆ ఖ్యాతి దక్కినట్టయింది. పాలమూరు నుంచి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లోకి ఎక్కుతున్నారు.
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న టీ-పీసీసీ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి.. 1969లో నవంబర్ 8న నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించారు. వారిది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. తండ్రి పేరు దివంగత అనుముల నర్సింహారెడ్డి. తల్లి రామచంద్రమ్మ. మహబూబ్‌నగర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్ననాటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచారు. 2006లో మిడ్జిల్ మండల జడ్పీటీసీ సభ్యుడుగా విజయం సాధించడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వతంత్రుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలవడంతో.. ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన పునాది పడింది. 2014లో అదే టీడీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014–17 మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన రావడంతో టీడీపీ ఉనికి కోల్పోతున్న తరుణంలో 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా చేశారు. అప్పుడే కాంగ్రెస్ లో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకొని అధిష్టానానికి నమ్మినబంటుగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ వ్యవహారాలను సొంత వ్యవహారాల కంటే చిత్తశుద్ధిగా చేస్తున్న వ్యక్తిగా అధిష్టానం ఆయన్ని గుర్తించింది.
ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. అలా ఎంపీగా ఉన్న సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి, అటు కామారెడ్డి నుంచి పోటీ చేశారు. కొడంగల్ నుంచి భారీ మెజారిటీతో గెలిచి.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని లిఖించారు. 2021 జూన్ 26న ఏఐసీసీ అధిష్టానం టీ-పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ ను ఎంపిక చేసింది. 2021 జూలై 7న టీ-పీసీపీ చీఫ్ గా ప్రమాణస్వీకారం చేసి కీలకమైన బాధ్యతలు భుజాలకెత్తుకున్నారు రేవంత్. అలా అసెంబ్లీ ఎన్నికలకు భారీ స్కెచ్ వేసి సఫలీకృతం అయ్యారు రేవంత్.
ముక్కూ మొహం తెలియని అపరిచితుడికి ఎవరైనా ఇంటి తాళాలు అప్పగిస్తారా? కానీ ఒక దేశాన్ని పాలించిన పార్టీగా.. ఏఐసీసీ నేతలు.. రేవంత్ కు టీ-పీసీసీ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా ఆ పేరైనా వారికి రాలేదు. అలాంటప్పుడు తెలంగాణలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అందుకే ఏఐసీసీ నేతలు రేవంత్ ను రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు. వారికి రేవంత్ పట్టుదల మీద, బీఆర్ఎస్ నేతల లోగుట్లపై ఆయనకున్న విషయ పరిజ్ఞానం మీద నమ్మకం కుదిరింది. దీంతో ఎవరేమన్నా తగ్గేదే లేదంటూ.. ఆయనకు పీసీసీ పగ్గాలు కట్టబెట్టి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. అప్పటి నుంచి మొన్న ఎన్నికలు జరిగేదాకా అన్నీ తానై పార్టీని చక్కబెట్టారు రేవంత్. టీ-పీసీసీ చీఫ్ గా సరిగ్గా రెండేళ్ల 4 నెలలు గడిచేసరికి రిజల్ట్ చూపించారు రేవంత్. ఈ ఒక్కటి చాలదా... రేవంత్ లోని కెపాసిటీ ఎలాంటిదో? రేవంత్ గురించి మరో విషయం కూడా చెప్పుకోవాలి. వాస్తవానికి ఆయన సీఎం కావాలనే టార్గెట్ 2029లో ఉందట. టీ-పీసీసీలో ఉండే పాత తరాన్ని సెట్ చేసుకోవడం లేదా.. క్రమంగా వారిని సైడ్ చేయడం. ఇందుకోసం కనీసం 2 టర్మ్ ల అసెంబ్లీ కాలం పడుతుందని ఆయన అంచనా వేసి పెట్టుకున్నారట. ఆ దిశగానే ఆయన ఆపరేషన్ కూడా చాపకింద నీరులా చేసుకుంటూ పోతున్నారు. అటు అధిష్టానం ఇచ్చిన ఫ్రీడమ్ ని చక్కగా ఉపయోగించుకుంటూ.. తోక జాడించినవారిని హైకమాండే పక్కకు తోసేసేలా చేస్తూ టాప్ లెవల్ కి ఎదిగారు. అంటే మరో టర్మ్ సమయం ఉండగానే.. ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తున్నారు. అనుకున్న టైమ్ కి అయిదేళ్లు ముందుగా సీఎం కావడం నిజంగా వండర్ ఫుల్ కదా. ఒక నాయకుడి పొలిటికల్ ప్రొఫైల్ లో ఇంతకన్నా సక్సెస్ పాయింట్ ఇంకేముంటుంది?
సమర్ధుడు.
ReplyDelete