నిజామాబాద్ జిల్లా బోధన్ లో గల ఓ ప్రధాన దేవాలయంలోకి హిందువులను అనుమతించి, అక్కడ పూజలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేస్తున్నారు. బోధన్ లో గల ఇంద్రనారాయణస్వామి ఆలయాన్ని హిందువులకు అప్పగించాలని ఆయన కోరుతున్నారు. 10 శతాబ్దంలో బోధన్లో ఇంద్రనారాయణుడి దేవాలయాన్ని ఆనాటి రాష్ట్రకూట రాజైన మూడో ఇంద్రుడు నిర్మించాడని.. అది జైన్ టెంపుల్ గా చరిత్రకారులు నిర్ధారించారని అర్వింద్ చెబుతున్నారు. ఆ తరువాత కళ్యాణి చాళుక్యుల కాలంలో రాజా సోమేశ్వరుడి హయాంలో ఆలయాన్ని పునరుద్ధరించి దానికి ఇంద్రనారాయణస్వామి దేవాలయంగా నామకరణం చేశారన్నారు.
ఆలయ నిర్మాణం నక్షత్రాకారంలో ఉంటుంది. ఎంతో అద్భుతమైన, ఆకర్షణీయమైన శిల్పాలు దేవాలయంలో ఆశ్చర్యం గొల్పుతాయి. ఆనాటి శిల్పాచార్యుల ప్రతిభకు దేవాలయ గోడలపై ఉన్న శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే 14వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆక్రమణ తరువాత దాన్ని మసీదుగా మార్చారు. దానికి దేవల్ మసీద్ అనే పేరు పెట్టారు. గర్భగుడిని మార్చి.. ప్రార్థనలు చేసుకునేందుకు ఓ వేదికను నిర్మించి.. మిగిలిన దేవాలయాన్ని పూర్తిగా అలాగే ఉంచి దేవల్ మసీదుగా పేరు పెట్టారని అర్వింద్ అంటున్నారు. నిజానికి ఏ మసీదుకు కూడా హిందూ పేర్లతో కలిపి నామకరణం ఉండదని.. అది దేవాలయమేనని చెబుతూ.. దేవల్ మసీదుగా నామకరణం చేయడంలోనే దాని మీద తమకు అధికారం లేదని, అది ఆక్రమించుకున్నదేనని.. ఆలయ గోడలపై తుగ్లక్ చెక్కించిన రాతల ద్వారా అర్థం చేసుకోవచ్చని అర్వింద్ అభిప్రాయపడుతున్నారు. అందులో ఉండే ఇంద్రనారాయణస్వామి విగ్రహాన్ని కందకుర్తిలోని డాక్టర్ హెడ్గేవార్ స్మారక శ్రీ కేశవ సేవాసమితిలో భద్రపరిచారని అర్వింద్ గుర్తు చేస్తున్నారు.
అలాగే జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో గల ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానిది కూడా ఇదే దుస్థితి ఉందని.. ఆ దృశ్యం ఇప్పటికీ కళ్లకు కడుతుందని అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 14వ శతాబ్దంలో ఔరంగజేబ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సుబేదార్ రుస్తుందిల్ ఖాన్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ను ఆక్రమించుకొని కొంతభాగంలో మసీదు నిర్మించాడని, నిజానికి ఆ భాగంలో ముస్లింలకు ఎలాంటి హక్కూ లేదని.. అది పూర్తిగా ఆక్రమించిందేనని స్పష్టంగా తెలుస్తుందని అర్వింద్ అంటున్నారు. దక్షిణ భారతంలో నవనరసింహ ఆలయాల్లో ఒకటైన ధర్మపురికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉందని, దీని చరిత్ర బ్రహ్మాండపురాణం వంటి పౌరాణిక కాలంలోనే గాక.. కొన్ని వందల ఏళ్ల క్రితం పోతనామాత్యుడు, పింగళి సూరన, మడికి సింగన, కొర్వి గోపరాజు వంటి ఎందరో తెలంగాణ కవులు నరసింహ క్షేత్ర వైశిష్ట్యం గురించి అద్భుతంగా వర్ణించారని చెప్పారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఇంద్రనారాయణ స్వామి ఆలయంలోకి హిందువులను అనుమతించాలని.. అలాగే ధర్మపురిలో ముస్లింలు ఆక్రమించుకున్న ఆలయం మొత్తాన్ని అప్పగించాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయపరమైన పోరాటానికైనా ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ఈ రెండు మాత్రమే కాదు.. తెలంగాణలో ఇలాంటి స్థితిలో ఉన్న అన్ని దేవాలయాలను హిందువులకు అప్పగించాలని.. ఆ పోరాటంలో తాము ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తామన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: