తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.
తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని జర్నలిజానికి జహీరుద్దీన్ అలీఖాన్ చేసిన సేవలను సంస్మరించుకుంటూ ఈ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులకు చేరిన ఎంట్రీల నుంచి మొదటి ఉత్తమమైన కథనానికి రూ. లక్ష నగదుతో పాటు ప్రశంసాపత్రం, షీల్డ్ అందజేస్తారు. రెండో ఉత్తమమైన కథనానికి రూ. 50వేల నగదుతో పాటు ప్రశంసాపత్రం, షీల్డ్ అందజేస్తారు. మూడో ఉత్తమమైన కథనానికి రూ. 25వేల నగదుతో పాటు ప్రశంసాపత్రం, షీల్డ్ అందజేస్తారు. అవి కాకుండా మరో పది మందికి ప్రోత్సాహక బహుమతులుగా ప్రశంసాపత్రాలు, షీల్డులను అందజేస్తామన్నారు. కథనాల ఎంపిక కోసం నిపుణులైన జ్యూరీని ఏర్పాటు చేస్తున్నామని, ఇతర వివరాల కోసం 95509 66456 లో సంప్రదించాలని సూచించారు.
Comments
Post a Comment
Your Comments Please: