కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. శివాజీ యువసేన వారు మరో అడుగు ముందుకేసి మంచినీటి నిర్వహణతో పాటు అంబలి, మజ్జిగ పంపిణీ కూడా చేస్తుండడంతో గ్రామ ప్రజలు, మండల ప్రజలు వారి సేవానిరతిని కొనియాడుతున్నారు.
చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యువసేన వ్యవస్థాపకులు జంగపెల్లి శ్రీనివాస్, అధ్యక్షుడు జంగపెల్లి సతీశ్, ఉపాధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగు సత్యనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నీలం శ్రీనివాస్, మేడగోని విజయ్, హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీశ్, ఛత్రపతి యువసేన నాయకులు మల్యాల శేఖర్, నరేశ్, జంగపెల్లి రవి, గోపు పర్వతాలు, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్న యువసేన నిర్వాహకులను స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు అభినందించారు.
Comments
Post a Comment
Your Comments Please: