తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప్రజానీకం కోసమే వెచ్చించాడన్నారు. మిర్యాలగూడలోనే గాక నల్లగొండ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తిగా.. వేలాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి అమరుడయ్యారని ఆచారిని స్మరించుకున్నారు. మిర్యాలగూడలో జరిగిన ఆచారి జయంతి వేడుకలను విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సహకారంతో ఆచారి ఫౌండేషన్ ఎంతో శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిందని జితేందర్ చెప్పారు.
ఈ సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి కుట్టు మిషన్ అందజేశామని.. మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అల్పాహారంతో పాటు పాలు పండ్లు పంపిణీ చేశామని జితేందర్ చెప్పారు. అన్నభీమోజు ఆచారి 07–05-1938న జన్మించారు. 16-08-1979న చనిపోయారు.
Comments
Post a Comment
Your Comments Please: